ఆదిలాబాద్ : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి , నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి జోగు రామన్న ( Jogu Ramanna ) ను పోలీసులు ముందస్తు అరెస్టు( Arrest ) చేశారు. ఆదిలాబాద్‌లోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లిన పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖను తన ఆధీనంలో ఉంచుకొని ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు చేయించి జైలుకు పంపడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజస్వామికమని మండిపడ్డారు.
ఖానాపూర్ నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్కు అనుకూలంగా మారడంతో కుట్రా పూరిత చర్యలకు దిగజారడం శోచనీయమని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నియమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలు పోలీసుల పహారా మధ్య వారికి అనుగుణంగా మార్చుకునే కుతంత్రాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.