హైదరాబాద్లోని ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధి భోలక్పూర్ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తున్నది. చిన్న గల్లీలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నవారిని ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.