హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కేపీహెచ్బీ కాలనీలోని శివపార్వతి థియేటర్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి టాకీస్ మొత్తం వ్యాపించాయి. దీంతో సినిమా హాల్లోని ఫర్నీచర్ అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్నిప్రమాదం జరగడానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో థియేటర్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు టాకీస్ యాజమాన్యం తెలిపింది.