హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రానంతరం కార్మిక సంక్షేమమే ధ్యేయంగా రూపొందించుకొన్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తిరగారాస్తున్నది. బ్రిటిష్ కాలం నాటి అమానవీయ విధానాలను, బానిస చట్టాలను మళ్లీ తెర మీదకు తెస్తున్నది. 44 కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దుచేసి నాలుగు లేబర్కోడ్లు రూపొందించింది. వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్ పేరుతో నాలుగు కోడ్లను రూపొందించిన మోదీ ప్రభుత్వం గెజిట్ విడుదలకు సమాయత్తమవుతున్నది. లేబర్ కోడ్ల ద్వారా కేంద్రం 44 హక్కులను కాలరాయనున్నదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.
కార్మికుల పాలిట శాపం పారిశ్రామిక సంబంధాల కోడ్
పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మిక హక్కులను కాలరాస్తుందనే ఆందోళనను కార్మికసంఘాలు వ్యక్తంచేస్తున్నాయి. కార్మికుల డిమాండ్లపై సమ్మె నోటీసు ఇవ్వడానికి ఇప్పటివరకు ఉన్న 14 రోజుల వ్యవధిని కేంద్రం 60 రోజులకు పెంచింది. సమ్మెకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశాన్ని యాజమాన్యాలకు కల్పించింది. దీంతో కేసు ట్రిబ్యునల్‌లో ఉన్నంత కాలం కార్మికులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో 10 కంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థలను పరిశ్రమలుగా గుర్తించేవారు. ఇప్పుడు ఆ సం ఖ్యను 20కి పెంచారు. విద్యుత్తు సంస్థల్లో 40కి పెంచారు. ఫలితంగా చిన్న పరిశ్రమల్లోని కార్మికులు చట్టపరంగా ఆరోగ్యం, భద్రత, సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. పాత చట్టం ప్రకారం యూనియన్లను యాజమాన్యం గుర్తించాలన్న నిబంధనలేదు. ఏ సంఘానికైనా కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం పరిశ్రమల్లోని కార్మికుల్లో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న సంఘాన్నే గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. ఇతర సంఘాలను యాజమాన్యాలు పట్టించుకోవు.
పరిశ్రమల్లో ప్రమాదాలకు కార్మికులదే బాధ్యత
భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌లో ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, డాక్ వర్కర్, బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి, పని నియమాల క్రమబద్దీకరణ, సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్స్ వర్కర్స్ యాక్టు తదితర వాటికి సంబంధించి మొత్తం 13 పాత చట్టాలను పొందుపరిచారు. పాతచట్టాల ప్రకారం కార్మికులకు తాము పనిచేస్తున్న పరిశ్రమల్లోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పనిభద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అమలయ్యేవి. ఇప్పుడు చేస్తున్న పనితో సంబంధం లేకుండా అన్ని రంగాల కార్మికులకు ఒకే గూడు కిందకు తీసుకొచ్చారు. గత చట్టాల ప్రకారం పరిశ్రమలో ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త కోడ్ ప్రకారం ప్రమాదాలకు కార్మికులను కూడా బాధ్యులను చేస్తారు. ప్రమాదాలకు కార్మికుడు కారణమని నిర్ధారిస్తే రూ.10 వేల జరిమానా, జైలుశిక్ష విధిస్తారు.
సామాజిక భద్రత హుళక్కే
సామాజిక భద్రత కోడ్-2020లో పీఎఫ్, ఈఎస్ఐ, పరిహారం, ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్, మెటర్నిటీ బెనిఫిట్, గ్రా ట్యూటీ, వెల్ఫేర్, అసంఘటిత కార్మికులు తదితర అంశాలకు సంబంధించిన తొమ్మిది పాత చట్టాలను చేర్చారు. ఈ కోడ్ నిబంధనలు నిర్మాణరంగ కార్మికుల ప్రయోజనాలకు విఘా తం కలిగించేలా ఉన్నాయని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
12 గంటల పని.. ఓటీలు ఉండవు
బీజేపీకి ఉన్న సంఖ్యా బలంతో వేతనాల కోడ్‌కు 2019లో పార్లమెంటు ఆమోదం లభించింది. ఇందులో వేతనాల చెల్లింపు, కనీస వేతనం, బోనస్, సమాన వేతనాల చట్టం వంటి నాలుగు పాత చట్టాలను చేర్చారు. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన 8 గంటల పని విధానానికి మోదీ ప్రభుత్వం చెల్లుచీటి ఇవ్వనున్నది. యాజమాన్యం కోరితే 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాలని, అం దుకు ఎలాంటి ఓటీ (ఓవర్ టైమ్) వేతనాలను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. దీంతో చాలా పరిశ్రమల్లో మూడు షిఫ్టుల విధానం కనుమరుగై రెండు షిఫ్టులే మిగలనున్నాయి. ఒక షిఫ్ట్‌లో పనిచేసే కార్మికులకు ఉపాధి పోవడం ఖాయం. కార్మిక హక్కులను కాలరాసే లేబర్కోడ్లను విరమించుకోకపోతే భవిష్యత్తులో నిరవధిక పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.
సార్వత్రిక సమ్మెకు వామపక్షాల మద్దతు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మికసంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. దేశ సంపదను కాపాడుకొనేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనేందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఎస్‌యూసీ పార్టీల నాయకులు శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
హమాలీలు పాల్గొనొద్దు: పౌరసరఫరాల సంస్థ ఎండీ
సమ్మెలో పాల్గొనకుండా ప్రభుత్వానికి సహకరించాలని హమాలీ సంఘాలకు పౌరసరఫరాల సంస్థ ఎండీ అనిల్‌కుమార్ కోరారు. హమాలీలు సమ్మెలో పాల్గొం టే ఏప్రిల్ నెల రేషన్ బియ్యం సరఫరాలో ఆలస్యం జరిగి పేదలకు ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.
కేంద్రంపై విద్యుత్తు సంఘాల పోరు
25 యూనియన్లతో జేఏసీ ఆవిర్భావం
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు సమరశంఖం పూరిస్తున్నారు. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లోని దాదాపు 25 సంఘాలు ఏకతాటి మీదకు వచ్చాయి. శనివారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీగా (టీఎస్పీఈజేఏసీ)గా ఏర్పడ్డాయి. జేఏసీ అధ్యక్షుడిగా సాయిబాబు, కన్వీనర్‌గా రత్నాకర్‌రావు, కో చైర్మన్‌గా శ్రీధర్, కో కన్వీనర్‌గా బీసి రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో విద్యుత్తు రంగ ఉద్యోగులందరూ పాల్గొనాలని సాయిబాబు పిలుపునిచ్చారు. 28న భోజన విరామ సమయంలో నిరసన తెలపాలని, 29న మింట్ కాంపౌండ్ ధర్నాకు తరలిరావాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా తాము సమ్మెలో పాల్గొంటున్నట్టు జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ మద్దతు ప్రకటించింది. విద్యుత్తుసౌధ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ మాట్లాడారు.