కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వక నిత్యం ఎదురు చూడాల్సి వస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదీగాక లోవోల్టేజీ సమస్యతో నిత్యం సతమతమవుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 11: కరెంట్ లేక నీరందక పంటలు ఎండిపోతున్నాయని మండిపడుతున్నారు. కరెంట్ కోసం నిత్యం ఆందోళనలు చేపడుతున్నా కాంగ్రెస్ సర్కార్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కూడా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు.
సరిపడా విద్యుత్తు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజీ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో హనుమకొండ- సిద్దిపేట ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ విద్యుత్తు సబ్‌డివిజన్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించారు. ఆరు గంటల కరెంటే వస్తుండటంతో పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంట్ కోసం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బిల్యానాయక్తండాలోని సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద జకినాలపల్లి, ఊర్కొండపేట గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. అదే విధంగా వంటావార్పు నిర్వహించారు. కరెంట్ ఇవ్వడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని డిమాండ్ చేశారు. అప్రకటిత విద్యుత్తు కోతలు, లోవోల్టేజీతో పంటలకు నీరందడంలేదని ఆగ్రహించిన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లికి చెందిన రైతులు గుత్ప గ్రామంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం 63వ జాతీయ రహదారిపై బైఠాయించారు.

కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు కన్నీరు పెడుతున్నారని, రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బీమ్లా తండా, దేవుని గుట్ట తండా శివారులో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. వెంటనే ఆమె విద్యుత్తు అధికారులకు ఫోన్ చేసి.. ఇచ్చే కరెంటైనా లోవోల్టేజీ లేకుండా చూడాలని కోరారు.
– హత్నూర

రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచెడ్‌లో రైతు రమేశ్ తన వరిపొలానికి ట్యాంకర్ ద్వారా తడి పెడుతున్న విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంటేరు అక్కడికి వెళ్లి పొలాన్ని పరిశీలించారు. దగ్గరలో ప్రాజెక్టులు ఉన్నా నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వమని ఆయన విమర్శించారు.
– గజ్వేల్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బిల్యానాయక్‌తండా సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజీ వద్ద ధర్నా చేస్తున్న రైతులు

కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప వద్ద రాస్తారోకో చేస్తున్న అడవిమామిడిపల్లి గ్రామ రైతులు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ విద్యుత్తు సబ్‌డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

