హైదరాబాద్ : ఆషాఢమాస బోనాల ( Bonalu ) మహోత్సవాల సందర్భంగా ఈనెల 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన ( Artisan Exhibition) అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ , కమిషనర్ బాల మాయాదేవి ( Bala Mayadevi ) తెలిపారు.
బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల చేతివృత్తుల ఉత్పత్తులు ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ,వాకిటి శ్రీహరి , బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి.హెచ్. హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.గత ఏడాది 30 స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 60 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేతివృత్తులు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేదరి, చేనేత , పూసల తదితర సంప్రదాయ కులవృత్తులకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశాన్ని ఈ మేళా కల్పిస్తుందని ఆమె వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ మేళాను సందర్శించి సంప్రదాయ చేతివృత్తులను ఆదరించి మేళాను విజయవంతం చేయాలని కోరారు.