హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మళ్లీ సింగం-2 సినిమా స్టోరీనే.. ఆ సినిమాలో విలన్ డేనీ భారత్‌లోకి అడుగుపెట్టేందుకు రాత్రి సమయాన్నే ఎంచుకొంటాడు. ఒక షిప్ నుంచి మరో షిప్‌లోకి మారతాడు. డేనీని తీసుకురావటానికి మరో విలన్ ‘సహాయం’ సహాయం చేస్తాడు. అచ్చం అలాంటి కథే ఇక్కడా. కాకపోతే అక్కడ డేనీ, ఇక్కడ డ్రగ్స్. డ్రగ్స్ ఆఫ్రికా నుంచి వస్తాయి. వాటిని తీసుకురావడానికి టోనీ గ్యాంగ్ రాత్రి పూటే సముద్రంలోకి వెళ్తుంది. ఒక బోటు నుంచి మరో బోటులోకి సరుకును దించుతారు. నావిళాదళ సిబ్బందికి కంటపడకుండా దేశంలోకి చేరవేస్తారు. డ్రగ్స్ దందాలో అరెస్టయిన టోనీని పోలీసులు విచారించగా.. సరఫరా జరిగే తీరును వివరించినట్టు తెలిసింది. ఆఫ్రికా నుంచి వచ్చే డ్రగ్స్ సముద్రం ఒడ్డుకు చేరుకోకముందే దాదాపు 20 కిలోమీటర్ల ముందు టోనీ గ్యాంగ్ ఓ బోట్లోవెళ్లి వాటిని తీసుకొని వచ్చేవారని చెప్పినట్టు సమాచారం. టోనీ ఎక్కడ కూడా తన ఏజెంట్లను నేరుగా కస్టమర్‌తో మాట్లాడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు. కొన్ని యాప్‌లను గుర్తించి, వాటిని తన ఏజెంట్లకు పంపి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించేవాడు. ఆ ఏజెంట్ డ్రగ్స్ డెలివరీకి వెళ్లినపుడు యాప్‌ను లైవ్‌లో పెట్టుకోవాలి. వినియోగదారుడు కూడా ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారానే సంభాషణలు జరిగేవి. కాల్ కాన్ఫరెన్స్ ద్వారా టోనీ వీరిద్దరిని లైవ్‌లో చూసేవాడు. తానుమాత్రం ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. టోనికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టార్భాయ్ ఇప్పుడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. అతని ఫొటో పోలీసులకు దొరకటం ఇప్పుడు కీలకంగా మారింది. స్టార్భాయ్ ఇండియాకు వచ్చాడా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.