Ande Sri | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుడు ఉన్నరా? ఒక సంగీత దర్శకుడి పేరు చెప్పు’ అంటూ అందెశ్రీ అన్నట్టుగా ఓ వివాదాస్పద ఆడియో వైరల్ అవుతున్నది. జయజయహే తెలంగాణ గీతానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన కీరవాణి సంగీతాన్ని అందించడంపై తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ఈ ఆడియో వైరల్ కావటం అగ్గి రాజేసింది. ఒకవేళ తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం పనికిరాకుంటే, ఇటలీ వనిత అయిన సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను వదిలేస్తామా? అని అందెశ్రీ ప్రశ్నించారు. ‘రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. భారతదేశ వనిత కూడా కాదు. ఇటలీకి చెందిన మహిళ. అయినా ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబురం అయినప్పుడు ఇదెలా తప్పవుతుంది’ అని అన్నారు. సినీ దర్శకుడు ప్రేమ్‌రాజ్, అందెశ్రీకి మధ్య ఫోన్ సంభాషణ యథాతథంగా..
ప్రేమ్‌రాజ్: అన్నా.. నమస్తే నేను ప్రేమ్‌రాజ్.
అందెశ్రీ: చెప్పండి సార్.
ప్రేమ్‌రాజ్: అన్నా.. గా పాట మీద అందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది.
అందెశ్రీ: ఏం ఇబ్బంది ఉన్నది.
ప్రేమ్‌రాజ్: మీరు పాడిన పాట పెట్టాలని మేం అప్పుడు వీడియోల మీద వీడియోలు పెట్టినం. అప్పుడు ఆ ఆవేదన ఉండేగనీ. ఇప్పుడు చేసినపనికి దీన్ని చూసి బాధ అనిపిస్తున్నది. కీరవాణి ఎందుకన్నా చేయడం.
అందెశ్రీ: ఎవరు చెయ్యాలె?
ప్రేమ్‌రాజ్: తెలంగాణలో ఎంతమంది లేరు. ఎవరైనా చేయొచ్చు.
అందెశ్రీ: ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు?
ప్రేమ్‌రాజ్: ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా.. ఎంత మంది లేరన్న నేను పది మందిని సూపిస్త.
అందెశ్రీ: నేను అడుగుతున్న కదా. కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుడి పేరు చెప్పు నాకు. తెలంగాణ రాష్ట్రం మనకు ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం.
ప్రేమ్‌రాజ్: అవి టెక్నికాలిటీస్ అన్నా.
అందెశ్రీ: ఒక ఇటలీకి చెందిన అమ్మాయి. ఆమె ఇచ్చిన స్వతంత్రం, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబురమైనప్పుడు. ఒక అనుభవం అంటం, నేను సినిమాకు కూడా చూడలేదు ఆయనను. మన దగ్గర చేస్తం. క్యాసెట్లు చేసేవాళ్లు వందలు వేలు ఉన్నరు.
ప్రేమ్‌రాజ్: క్యాసెట్లు కాదన్నా.. సినిమాలకు చేశారన్నా. నా సినిమా చేసిన రవికళ్యాణ్ ఉన్నడు, అర్జున్ ఉన్నడు.
అందెశ్రీ: అట్లా కాదు తండ్రీ.. నీ సినిమాకు పెట్టుకున్నవాళ్లను నా సినిమాకు పెట్టుకోలేను కదా.
ప్రేమ్‌రాజ్: అది నీ సినిమా కాదన్నా. నీ సినిమా అయితే పట్టించుకునేవాన్ని కాదన్నా. నువ్వు సినిమా తీసి కీరవాణిని పెట్టుకో, రెహమాన్‌ను పెట్టుకో ఎవరినైనా పెట్టుకో. అది తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా. మాకు సంబంధం లేదా?
అందెశ్రీ: నేను అడిగినదానికి జవాబు ఇవ్వలేదు నువ్వు. సోనియగాంధీ ఒక భారత దేశ మహిళ కాదు. ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చి బతుకునే పోగొట్టుకున్నది. అయినా మనం దానికి సంబురాలు పడుతున్నం.
ప్రేమ్‌రాజ్: ఆ పాట మా ఆత్మగౌరవం. ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేం చూడలేం.
అందెశ్రీ: నువ్వు తినే పిడికెడు మెతుకులు ఉంటయి కదా.. అవి ఏ ప్రాంతంలో పండించినరో ఎవ్వడూ చెప్పడు, ఎన్ని చేతుల కష్టమో అని ఎవ్వడు చెప్పడు.
ప్రేమ్‌రాజ్: దానికి దీనికి ఎందుకు సంబంధం అన్నా.. అట్లాంటప్పుడు తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలె?
అందెశ్రీ: కచ్చితంగా సంబంధం ఉంటది
ప్రేమ్‌రాజ్: అట్లాంటప్పుడు తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలన్నా.. ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినవ్?
అందెశ్రీ: అట్ల అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణ, ఆమెది ఇటలీ.. మాకు ఎందుకు అని వదిలేస్తరా?
ప్రేమ్‌రాజ్: ఢిల్లీలో ఎవరున్నా చేయాలె అది. ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరు.
అందెశ్రీ: ఇది కూడా అంతే. టెక్నికల్‌గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది
ప్రేమ్‌రాజ్: ఆస్కార్ గ్రహీత కావాలా?
అందెశ్రీ: ఆస్కారం నాకెందుకయ్యా?
ప్రేమ్‌రాజ్: నీకెందుకన్నా ఆస్కార్ గ్రహీతలు ఇప్పుడు?
అందెశ్రీ: తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి బానిసను
ప్రేమ్‌రాజ్: మీరు కీర్తికి బానిసా?
అందెశ్రీ: కీర్తి… వద్దులే నీకెందుకు?
ప్రేమ్‌రాజ్: ఇట్ల చేస్తే మాకు కోపమొస్తది.
అందెశ్రీ: ఒకవేళ నీకు చేతనైతే నా కీర్తిని తగ్గించేందుకు ప్రయత్నం చెయ్యి.
ప్రేమ్‌రాజ్: ఎవరి కీర్తిని ఎవరు తగ్గియ్యరన్నా.
అందెశ్రీ: నువ్వు ఏం మాట్లాడకు ఇక. నీకు చాతనైతే ఆ కీర్తి తలనరికేతందుకు ప్రయత్నం చెయ్యి
ప్రేమ్‌రాజ్: మీ కీర్తిమీద ఎవరికి అసూయ లేదు.
అందెశ్రీ: మరి నీకెందుకువయా.. కీర్తి కావాలని మాట్లాడుతున్నవ్. కీర్తి కండూతి నీకుంటది.
ప్రేమ్‌రాజ్: మీకు ఇది అవసరమా?
అందెశ్రీ: కచ్చితంగా అవసరం.. నాకు కాదు.
ప్రేమ్‌రాజ్: ఆ పాట విషయంలో తెలంగాణకు ఏది అవసరమో, అదే అవసరం. మీ వ్యక్తిగతం ఏముండదు దాంట్లో
అందెశ్రీ: నాకు వ్యక్తిగతం అంటలేను, ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు.
ప్రేమ్‌రాజ్: అది మీది కాదు పాట..మీరెట్ల నిర్ణయం తీసుకుంటరు?
అందెశ్రీ: ఇప్పుడు నిన్ను అడగాలా? ఇప్పుడు అడగాలా వచ్చి.
ప్రేమ్‌రాజ్: అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా?
అందెశ్రీ: అట్ల కాదే.. నీకు రైట్ ఉంటే ఏం చేస్తవో చెయ్యే. నీకు ఏదన్నా చేతనైతే నా కీర్తి తల నరికేతందుకు కంకణం కట్టుకుంటే ఆ పనిచెయ్యి.
ప్రేమ్‌రాజ్: నీ కీర్తి జోలికి ఎవడొస్తరన్నా.. మాకేం అవసరం? ఈ అదనపు కీర్తి ఎందుకంటున్న. నీకు ఉండేది తక్కువున్నదా? అడిషనల్‌గా కీరవాణి కీర్తి కావాలా?
అందెశ్రీ: ఆ కీర్తి ఎవరికి కావాల్నో వారికి తెలిసి ఉంటది గని.. నీతో మాట్లాడే సమయం కూడా లేదు.
ప్రేమ్‌రాజ్: తెలంగాణలో ఉన్న ఒక గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకన్నా బాగనే చేస్తడు.
అందెశ్రీ: ఓ తండ్రి.. నేను ఇంతసేపు మాట్లాడిన అంటే నేను దేని కోసం మాట్లాడిన.. ఎందుకోసం మాట్లాడిన
ప్రేమ్‌రాజ్: మాట్లాడే అవసరం లేదనంటే మేమేం చేయలేంగానీ..
అందెశ్రీ: నా కీర్తిని అడ్డగించేతందుకు, నా కీర్తి తల నరికేతందుకు ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో
ప్రేమ్‌రాజ్: ఏం కీర్తి అన్నా.. నీ కీర్తి జోలికి ఎవడు వస్తడు, ఏం అవసరం, మాకేమన్నా వస్తదా?
అందెశ్రీ: ఇప్పుడు మాట్లాడేందుకు నాకు సమయం లేదు.