హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తేతెలంగాణ) : ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి సూట్‌కేసులు పంపడం.. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధించడం.. తప్ప తన మూడేండ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం’ అని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై నిత్య నిర్బంధం కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు ప్యారడైజ్ సినిమాలో మాలిక్ చేతిలో నలిగిన సవారీలుగా మారాయని, తెలంగాణలో నీరో రాజ్యం కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రోజురోజుకూ అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతు న్నాయని విమర్శించారు. ప్రజాపాలన ముసుగులో బరితెగింపు పాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కాంగ్రెస్ నేతల వద్ద బౌన్సర్ల తరహాలో వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. శాంతిభద్రతలను పక్కనబెట్టి ప్రతిపక్ష నేతల ఇండ్ల వద్ద తిష్టవేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అరెస్టును కోర్టులు తిరస్కరిస్తున్నా, ప్రభుత్వం నిస్సిగ్గుగా కేసులపై కేసులు పెడుతూ వేధింపులకు దిగడం దారుణమని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతుల పొలాలు తడిపేందుకు నీళ్లు లేవని చెబుతున్న ప్రభుత్వం.. లిక్కర్ తయారీకి మాత్రం నీళ్ల కరువులేదని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు.
‘మెడికొవర్ దవాఖాన ఎదుట ఫ్లెక్సీలు పెట్టారని బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరి కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై, హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లపై ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలెందుకు తీసుకోలేదని దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆధారాలతో నిలదీసిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై అక్రమ కేసు నమోదు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తప్పుడు కేసు అని కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గురాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక బ్యూరోక్రాట్ ఫిర్యాదు చేస్తే బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమేంది?’అని ప్రశ్నలవర్షం కురిపించారు.
కాంగ్రెస్ పెద్దల కోసం, సీఎం రేవంత్‌రెడ్డి అనుయాయులను కాపాడేందుకే కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ఉన్నపళంగా రద్దు చేశారని దేశపతి ఆరోపించారు. సర్కార్ నిర్ణయంతో రూ. 300 కోట్ల ప్రజాధనం వృథా అయిందని దుయ్యబట్టారు. ఏ ఒక్క మంచిపనిచేయని ముఖ్యమంత్రిగా చరిత్రహీనుడిగా నిలిచిపోతారని దెప్పిపొడిచారు. ఎర్రవల్లిలోని అసైన్డ్ భూముల్లో అమరుల కాలనీ కట్టడమెందుకు? దళితులు, అమరుల కుటుంబాల మధ్య తగాదా పెట్టడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లేదా మీరు నిర్మిస్తున్న ఫోర్త్‌సిటీలో అమరుల కాలనీ కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.