కోస్గి, అక్టోబర్ 7 : సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం.. నారాయణపేట జిల్లా కోస్గిలో రెండోరోజూ బుల్డోజర్లు మోత మోగించాయి. బాధితులు అడ్డుకునే యత్నంచేసినా.. పోలీస్ పహారా మధ్య అధికారులు కూల్చివేతలు కొనసాగించారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులు మొర పెట్టుకున్నా.. పట్టించుకోకుండా పెద్దపెద్ద భవనాలన్నీ నేలమట్టం చేశారు.
న్యాయస్థానాల ఆదేశాలను అధికారులే కాలరాస్తే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జేసీబీలతో దాడికి సర్వం కోల్పోయిన బాధితులు అద్దె ఇండ్లను వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. తమ కుటుంబాలను రోడ్డుపాలుచేసిన వారి కుటుంబాలు కూడా రోడ్డున పడే రోజులు దగ్గరపడ్డాయని శాపనార్థాలు పెట్టారు. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కూల్చివేతల ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని బాధితులు ముక్తకంఠంతో హెచ్చరించారు.