సుక్కల ముగ్గేసినట్టు సెల్లెలా..!
సక్కంగా కూడబెట్టు సెల్లెలా..!!
దళిత బంధు కోసం స్ఫూర్తి ఇచ్చిన కలాలు
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఉద్యమాలకు కవులు, రచయితలు సంఘీభావంగా నిలువడం కొత్త కాదు. ప్రపంచమంతా చరిత్ర పొడుగునా ఈ సౌహార్దత కనిపిస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో నడిచిన తెలంగాణ ఉద్యమంలోనూ కలాలు కవాతు తొక్కినయి. ఉద్యమానికి అండగా నిలిచినయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసే క్రమంలో దళిత బంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. దళిత బంధు పథకం ఒక ఉద్యమంగా ముందుకొచ్చిన వేళ కవులు కలాలకు పదునుపెట్టారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో దళిత యువతలో ఉత్తేజం నింపడానికి, మార్గనిర్దేశం చేయడానికి గీతరచన గావించారు. లబ్ధ ప్రతిష్ఠులైన కవులు ఈ గీతాలను రచించారు. హుజూరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధు పథకం సోమవారం ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సందేశం, స్ఫూర్తి ఆధారంగా ‘దళితబంధు’ పథకంపై అదే రోజున పలు గీతాలు ఆవిష్కృతం కానున్నాయి. ప్రతిపాటలో వైవిధ్యం ఉన్నది. దళితులు ఉద్యమ భాగస్వాములు కావాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం కావాలని పిలుపునిస్తున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సంస్థ చైర్మన్ రసమయి బాల్కిషన్ ఆధ్వర్యంలో ఈ చైతన్య గీతాల రూపకల్పన జరిగింది. గోరటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, అంబటి వెంకన్న తదితరులు గీత రచన చేశారు. ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న తన సహజమైన తాత్తిక ధార ఉట్టిపడేలా గీతాన్ని రచించి గానం చేశారు. గొంతు పండిన గోరటి పాట వినగానే గుర్తు పట్టని వారుండరు. ‘మట్టి నుండి సిరుల దీసే మహిమ నీకు ఉన్నదీ.. పెట్టుబడియే నిను వరిస్తే నీకు ఎదురేమున్నదీ’ అంటూ ఆయన దళితుల ఔన్నత్యానికి పట్టం గట్టారు. ఆకురాలే చీకటి ఎప్పుడూ ఆవరించి ఉండదనే భావనను నూరిపోశారు. ‘తెలంగాణ జాతి పిత మన కేసీయార్ సారూ, అనుకున్నది సాధించుదాక వెనుదిరుగడు చూడు..’ అంటూ కేసీఆర్ దృఢ నిశ్చయాన్ని ఆవిష్కరించారు. దళిత బంధు పథకాన్ని ‘దేశ గతినే మార్చివేసే విప్లవ మార్గమూ’ అంటూ ఆయన అభివర్ణించారు. వెలి వాడలింక వెన్నెలోల మెరువనున్నది నిజమురా అంటూ ఆకాంక్షించారు. చంద్రప్రకాశ్ ‘లేలే దళితన్నా లేచిరా…బిరబిర నడిచిరా ’ అంటూ ఉత్తేజాన్నిచ్చారు. ‘దళిత జాతి మేలుకొంది దండు కట్టి’ పాటలో- దళిత బంధు పథకం కింద అందించే పథకాలను భిక్షపతి రమ్యంగా వివరించారు. కారు కొనుక్కుంటవో, టాక్సీ నడుపుకుంటవో.. డ్రైవరుగా ఉన్నోడివి ఓనరువై పోవాలె అని ఉద్భోదించారు.
మెడికల్ షాపు, బట్టల షాపు మొదలుకొని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వరకు అనేక వ్యాపారాలు చేసుకోవచ్చని సూచించారు. ‘చరిత మలుపు తిరుగుతోంది దళిత సోదరా, దళిత బంధు పిలుస్తోంది రా కదలిరా… శ్రమ చేసే గుణముంది, సాధించే తెలివుంది లక్ష్యాన్ని చేరుకునే లక్షణముంది’ అంటూ అభినయ శ్రీనివాస్ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ‘కట్టుకట్టు నడుం గట్టవె చెల్లెలా, దళిత బంధు బాటబట్టవె చెల్లెలా’ అంటూ ప్రత్యేకించి దళిత చెల్లెండ్లకు కోదారి శ్రీను పిలుపునిచ్చారు. ఇగిర మున్న ఇల్లాలివి చెల్లెలా, హిమ్మతిపుడు దొరికిందే చెల్లెలా .. అంటూ దళిత బంధు పథకం విశిష్టతను వివరించారు. ఆలోచనకు పదును పెట్టు దళిత సోదరా అవకాశం వచ్చింది వదులుకోకురా.. తరతరాల కష్టాలకు ఇగ ముగింపు పలుకుదాం.. నరనరాన ఉత్తేజం నింపుకొని సాగుదాం అంటూ బుర్ర సతీశ్ ఉత్తేజభరితంగా రాశారు. ‘దళిత యువత ఇక మేలుకో, నీ జీవిత లక్ష్యం చేరుకో.. ఆశకు రెక్కలు తొడగాలి, మీ కలలకు రూపం ఇవ్వాలి’ అంటూ మానుకోట ప్రసాద్ సందేశం అందించారు.
రచయితలు పూలే, అంబేద్కర్ స్ఫూర్తిని పలికించారు. కేసీఆర్ అడుగడుగునా అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. ఈ పాటలకు కల్యాణ్ సంగీతం సమకూర్చారు. రసమయి బాల్కిషన్, శంకర్‌బాబు, రవిచరణ్, శ్రీకాంత్, మౌనిక గానం చేశారు. తెలంగాణ సాంస్కృతికసంస్థ చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో గోరటి వెంకన్న, అభినయ శ్రీనివాస్, ఏకే భిక్షపతి, మానుకోట ప్రసాద్, మిట్టపల్లి సురేందర్, అంబటి వెంకన్న ఈ గీతాలు రాశారు. కళ్యాణ్ సంగీతం సమకూర్చారు. శంకర్‌బాబు, రసమయి బాలకిషన్, సాయిచరణ్, శ్రీకాంత్, మౌనిక గానం అందించారు.
‘దళితులంత కావాలిక ధనవంతులుగా
దళితబంధు తెచ్చింది సిరుల పండుగ’
‘సంకల్పం గట్టిదైతె సాధించనిదేముంది
సర్కారే అభయమిచ్చె తిరుగేముంది’
‘జట్టుకట్టి పట్టుబట్టవే సెల్లెలా..
పేదరికం మట్టుబెట్టవే సెల్లెలా..’
‘ఇగురమున్న ఇల్లాలివే సెల్లెలా..
నీకు హిమ్మతిప్పుడు దొరికిందె సెల్లెలా..’
‘అప్పు లేదు సప్పు లేదు ఎన్నెలో.. ఎన్నెలా..!
బాకీ కట్టె బాధ లేదు ఎన్నెలో.. ఎన్నెలా..!’
‘మొక్క పెరిగి నీడనిచ్చె చట్టైనట్టు
నీ సంపద పెరుగాలె ఎన్నో రెట్లు’
రసమయికి క్యాబినెట్ హోదా
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
‘దళితబంధు ఉద్యమాల కదం తొక్కరా డప్పుల దరువేసుకుంటూ పదం పాడిరా’
‘తెలంగాణ దళితబంధు పిలుపునందుకో సర్కారు అండ ఉంది గెలుపునందుకో..’
‘దళితబంధు ఇచ్చింది ఎగిరేందుకు రెక్కలు పట్టుదలతో అందుకో ఆ నింగిలోని చుక్కలు..’
‘నీ చేతుల లక్ష్మి ఉంది/నీ ముందర లక్ష్యముంది సర్కారు నీ సాయముంది దళిత సోదరా..’
‘దళితవాడ తీరుమారి ధనికవాడ కావాలె దేశానికి తెలంగాణ వేగుచుక్క కావాలె’