Cyber Crime | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ వేదికగా కొత్త దందాకు తెరతీశారు. పాతతరం పోర్న్‌స్టార్ ఫొటోలు, విదేశీ యువతల ఫొటోలు డీపీలుగా పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ‘నా పేరు ఎమ్రీ.. నాది కెనడా. నా వయసు 35 సంవత్సరాలు. నేను చాలా ధనవంతురాలిని. నాకొక స్నేహితుడు కావాలి. అతని ఏజ్‌తో నాకు సంబంధం లేదు. నేను ఆర్థికంగా అతనికి తోడుగా ఉంటాను’ అంటూ ‘అలీస్ ఫౌండేషన్ ఫర్ ది పూర్’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా సైబర్ దొంగలు మోసాలకు పథకం రచించారు.
ఈ ‘అలీస్ ఫౌండేషన్ ఫర్ ది పూర్’ అనే పేజీకి అనుబంధంగా ఎన్నో నకిలీ అకౌంట్లు పోర్న్‌స్టార్ ఫొటోలతో ఉన్నాయి. అన్ని పేజీల్లోనూ ఒకటే కంటెంట్.. నాది కెనడా/ఆస్ట్రేలియా/అమెరికా/ నైజీరియా ధనవంతురాలిని అంటూ పరిచయం చేసుకుంటారు. మిగతా విషయం అంతా సేమ్. ఇంకొందరు సైబర్ దొంగలు బిజినెస్ మహిళ ఫొటోతో నకిలీ అకౌంట్‌తో ‘తనతోపాటు బిజినెస్ చేసే ఓ వ్యక్తి కావాలని, అతని ఖర్చులు అన్నీ భరిస్తానని, తానే పెట్టుబడులు పెడతానని, వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలి’ అని ఓ అప్లికేషన్‌ను పోస్టు చేస్తుంది.
అందమైన విదేశీ యువతుల ఫొటోలు, మాజీ పోర్న్స్టార్ల ఫొటోలు ఫేస్బుక్ నకిలీ ఖాతాలకు డీపీలుగా పెట్టి.. ఆకర్షిస్తున్నారు సైబర్ దొంగలు. ఒక అకౌంట్లో ‘అలీస్ ఫౌండేషన్ ఫర్ ది పూర్’ అని ఉంటే.. చాలా ఖాతాలకు ‘ఫౌండేషన్ ఫర్ ది పూర్’ అనే పేరు కామన్‌గా ఉంటుంది. ‘అలీస్’ స్థానంలో పేర్లు మారుతూ ఉంటాయి. రెచ్చగొట్టేలా కనిపిస్తున్న ఆ ఫొటోలపై క్లిక్ చేస్తే.. కింద వాట్సాప్ లింక్ ఓపెన్ అవుతుంది. కొందరికి టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నారు.
దానిని ఓపెన్ చేయగానే రెచ్చగొట్టే ఫొటోలతో తమ దారిలోకి తెచ్చుకుంటారు. అలా పరిచయం పెంచుకొని న్యూడ్ వీడియోకాల్స్ చేసి, దానిని రికార్డు చేసి, డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరిని నమ్మకంగా నమ్మించేందుకు దరఖాస్తు ఫారాన్ని అప్లోడ్ చేస్తారు. దానిపై క్లిక్ చేయగానే కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలో ఉద్యోగాలు అంటూ.. గంటలకు 27 డాలర్లు, నెలకు 32 వేల డాలర్లు సంపాదించొచ్చు అని ఆశపెడతారు. వాటిపై క్లిక్ చేయగానే.. వీసాలు, ఫీజులు అంటూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇంకొదరికి రూ.100 నుంచి 500లోపు పెట్టుబడి పెట్టించి, రెట్టింపు కమీషన్ వస్తుందని టార్గెట్లు ఇచ్చి.. నిలువునా ముంచుతున్నారు.
‘Alice Foundation for the poor’ అనే అకౌంట్‌కు దాదాపు 15 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒకసారి ఆ ఫాలోవర్స్ లిస్ట్‌పై క్లిక్ చేస్తే.. ఓపెన్ అవ్వదు. ఇలానే ‘ఫౌండేషన్ ఫర్ ది పూర్’ అనే పేరు కామన్‌గా అన్ని అకౌంట్లకు వేలల్లో ఫాలోవర్స్ ఉన్నా.. అవన్నీ క్లోనింగ్ ద్వారా సృష్టించినవే. ఇక ఇలాంటి ఫేస్బుక్ నకిలీ పేజీలను పరిశీలిస్తే.. అవన్నీ వారం రోజుల లోపు క్రియేట్ చేసినవే. కానీ, వాటికి వేలల్లో ఫాలోవర్స్ ఉంటారు.
ఇలాంటి ఫేస్బుక్ ఖాతాల నుంచి రిక్వెస్టులు వస్తే.. స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై కల్పిస్తున్న విస్తృత ప్రచారంతో సైబర్ నేరగాళ్లు కొత్త దారులు ఎంచుకుంటున్నారని, ఇలాంటి రిక్వెస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవి ఫేక్ ఖాతాలని తెలియక ఎంతోమంది అమాయకులు తన ఫోన్‌నంబర్లు, ఇతర వివరాలు సైతం ఇస్తున్నారు. కాబట్టి.. సైబర్ నేరాలకు స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.