బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:38

పునర్జన్మనిచ్చిన గాంధీ దవాఖాన!

పునర్జన్మనిచ్చిన గాంధీ దవాఖాన!

  • కరోనా గర్భిణికి పురుడు
  • బతుకదనుకున్న తల్లీబిడ్డ ప్రాణాలు డాక్టర్లు నిలబెట్టారు
  • కార్పొరేట్‌ కాదన్నవేళ ఆదుకున్న సర్కారు వైద్యం
  • గాంధీ దవాఖానే కరెక్ట్‌: రషీద్‌  

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గాంధీ దవాఖాన.. ఓ తల్లీబిడ్డకు ప్రాణంపోసింది. లక్షలు తిన్న కార్పొరేట్‌ దవాఖాన పొమ్మన్నవేళ అక్కున చేర్చుకుని పురుడుపోసింది. కన్నీటిధారతో గర్భిణిని కూతురిని తీసుకొచ్చిన ఆ తండ్రి ఆనందబాష్పాలు రాల్చేలా సంతోషాన్ని నింపింది. ‘పరిస్థితి చెయ్యి దాటిపోయింది. తల్లీబిడ్డకు ప్రాణాపాయం ఉన్నది. ఇక మా చేతుల్లో ఏమీలేదు అని కార్పొరేట్‌ దవాఖాన చేతులెత్తేసింది. కానీ నా బిడ్డ కు గాంధీ దవాఖాన పునర్జన్మనిచ్చింది’ అని హైదరాబాద్‌ బీఎస్‌ మక్తాలో ఉండే మహ్మద్‌ రషీద్‌ఖాన్‌ సంతోషంతో చెప్పారు. ‘నా కూతురిని మూడో కాన్పుకోసం బీఎస్‌ మక్తాలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయిస్తున్నాం. ఇటీవల చెకప్‌కు వెళ్లగా అనుమానంతో చేయించిన పరీక్షలో కరోనాగా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచనతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచాం. 14 రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేశాక రిపోర్టు నెగెటివ్‌ వస్తే డెలివరీ చేస్తామన్నారు. కానీ, అంతలోనే నా కూతురికి బ్లీడింగ్‌ మొదలైంది. గత సోమవారం ప్రైవేట్‌ దవాఖానకు తీసుకెళ్లాం. అమ్మాయి ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని, నా దగ్గర సంతకాలు తీసుకున్నరు. లోపల బిడ్డను తీసేయాల్సి వస్తుందని చెప్పారు. మరో రెండుగంటల తర్వాత గర్భిణి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉన్నది, సర్కారు దవాఖానకు తీసుకుపొమ్మని చేతులెత్తేసిండ్రు. భయపడుతూనే గాంధీ దవాఖానకు తీసుకొచ్చిన. మంగళవారం ప్రసూతి విభాగంలో అడ్మిట్‌ చేసుకున్నారు. బుధవారం సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేశారు. బాబు పుట్టిండు. తల్లీబిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యారు. గాంధీ డాక్టర్లు చాలామంచి వైద్యం అందించారు. దవాఖానలో అన్ని సదుపాయాలున్నాయి’ అని రషీద్‌ వివరించారు. బయట మాట్లాడుకుంటున్న దానికి, దవాఖానలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నదని, గాంధీలో వైద్యసిబ్బంది చాలా మంచివారని మెచ్చుకున్నారు. పూర్తి భరోసాతో గాంధీ దవాఖానకు రావొచ్చని చెప్పారు. బతికి బట్టకట్టాలంటే గాంధీ వంటి సర్కార్‌ దవాఖానలే కరెక్ట్‌ అని రషీద్‌ తేల్చిచెప్పారు.logo