హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ):మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి తనవారెవరో.. పరాయివారెవరో కాస్త తెలిసి వచ్చినట్టయింది. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలని ప్రచారంచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్‌పార్టీ చర్యలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆదివారం షోకా జ్ నోటీసులు జారీచేసింది.
వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసి తన తమ్ముడికి ఓట్లు వేసేలా చూడాలని కోరినట్టు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ క్రమశిక్షణ కమిటీకి సమాచారం ఇచ్చారు. ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినట్టు వెల్లడించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం నియామాలు ఉల్లంఘించారని, ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని సూచించింది.