హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి శుక్రవారం శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధి విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, ఐటీ ఎగుమతులు, పరిశ్రమల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలతో ఆయన ఏకీభవించారు.
కిటెక్స్ వస్త్ర పరిశ్రమ వంటి ప్రముఖ పరిశ్రమను తెలంగాణకు తీసుకురావడం గొప్ప విషయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పని చేశారని మెచ్చుకున్నారు. పరిశ్రమలు, ఐటీ వృద్ధి అంశంపై మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీనికి స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్.. పరిశ్రమల్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నామని, కంపెనీల ఇష్టానుసారం ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రత్యేకంగా రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. కంపెనీలకు, స్థానిక యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.