Gun License | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో తుపాకీ లైసెన్సులు కలిగినవారు చాలా తక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో కేవలం 9,810 మంది మాత్రమే అధికారికంగా గన్స్‌ను కలిగి ఉన్నారు. ఇలాంటివారు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ అగ్రస్థానంలో నిలిచాయి. ఉత్తరాదితో పోల్చితే.. దక్షిణాదిలో కర్ణాటక మినహా అన్ని రాష్ర్టాల్లో లైసెన్స్ కలిగిన తుపాకులు చాలా తక్కువ. వీటిలో కర్ణాటక 1,20,719 లైసెన్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (24,237), కేరళ (11,330), తెలంగాణ (9,810), ఆంధ్రప్రదేశ్ (7,007) ఉన్నాయని, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో అసలు తుపాకీ లైసెన్సులే లేవని కేంద్ర హోంశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
2018 ఎన్నికల నాటికి తెలంగాణలో 9,070 మంది గన్ లైసెన్స్ కలిగి ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 9,810కి చేరింది. గత ఐదేండ్లుగా తెలంగాణలో కేవలం 740 మందికి మాత్రమే లైసెన్స్ ఇచ్చినట్టు పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. వీరిలో అత్యధికంగా భద్రతా సిబ్బంది, క్రీడాకారులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే 5 వేలకుపైగా గన్ లైసెన్స్‌లు ఉన్నట్టు తెలుస్తున్నది. వీటిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, పాతబస్తీలో ఎక్కువగా ఉన్నట్టు స్పెషల్ బ్రాంచ్ అధికారులు చెప్తున్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని లైసెన్స్డ్ ఆయుధాలను తిరిగి ఇచ్చేలా పోలీసులు ఆదేశాలు జారీచేయనున్నారు. దీంతో ఆయా ఆయుధాలను స్థానిక పోలీసుస్టేషన్లలో సమర్పించి, ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ వాటిని తిరిగి పొందాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాతీయ బ్యాంకులతోపాటు ప్రభుత్వ రంగ భద్రతా సిబ్బందిని, క్రీడాకారులను మినహాయింపు ఇవ్వనున్నారు. ఎన్నికల వేళ లైసెన్స్డ్ వెపన్స్‌ను డిపాజిట్ చేయని వారికి చట్టపరంగా నోటీసులు జారీచేసి కఠిన చర్యలు చేపడతామని, అలాంటివారికి మరోసారి లైసెన్సులు జారీ చేయబోమని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.