CM KCR | బీఆర్ఎస్ నాందేడ్ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన సుమన్.. ప్రజల కోసం పని చేస్తున్నాడని కొనియాడారు. నాయకులు మన మధ్యలో నుంచే పుట్టుకొస్తారని, అందుకు బాల్క సుమన్ నిదర్శనం అని కేసీఆర్ పేర్కొన్నారు.
రైతులకు తెలంగాణలో ఏ వసతులు లభిస్తున్నాయో.. అలాంటి వసతులు మహారాష్ట్రలో లభించాలంటే గులాబీ జెండాను గెలిపించండని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం మీరే నేతలు కావాలన్నారు. మనలో నుంచే నాయకుడు పుట్టుకొస్తాడని కేసీఆర్ తెలిపారు. ఇక్కడ బాల్క సుమన్ అనే నాయకుడు ఉన్నాడు. సుమన్ కాలేజీలో చదువుకున్నప్పుడు తెలంగాణ యుద్ధంలో నాతో పాటు పాల్గొన్నడు. ఆ తర్వాత చిన్న వయసులోనే ఎంపీ అయిండు. 31 ఏండ్లకే ఎంపీ అయిండు. ఆత్మవిశ్వాసం, తెగింపు, నమ్మకం ఉంటే తప్పకుండా నాయకులం అవుతాం. నాయకులు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యలో నుంచే నాయకులు పుట్టుకొస్తారంటూ సుమన్ గురించి కేసీఆర్ తెలిపారు.