హైదరాబాద్ : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలది సమాన పాత్ర ఉంటుంది అని చెప్పిన సీఎం.. కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర త్యాగపూరితమైనదన్నారు. మహిళాభ్యుదయానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు.
సమాజంలో పురుషుడితో పాటు అన్ని రంగాల్లో మహిళలది సమాన పాత్ర. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పది, త్యాగపూరితమైంది. అన్నీ తానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ అందరి ఆలనా పాలనా చూసే ఒక తల్లి కనబరిచే ప్రాపంచిక దృక్పథాన్ని దార్శనికతను మానవీయ కోణాన్ని పాలనలో అన్వయించుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మానవ జాతికి మహిళ ఒక వరం. మహిళాభ్యుదయానికి చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళాభ్యుదయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళా బంధుగా ఆదరణ పొందుతుండడం సంతోషంగా ఉంది. దళిత, బడుగు బలహీన వర్గాలు, రైతుల ఆత్మబంధువు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి 10 లక్షల మంది ఆడపిల్లల పెండ్లికి సాయం చేశాం. 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్స్ అందించి ఆర్థికంగా ఆలంబననిచ్చాం.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.