హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : సజ్జాపూర్ చామదుంప భౌగోళిక గుర్తింపు దరఖాస్తును చెన్నై జీఐ రిజిస్ట్రీ మంగళవారం ఆమోదించింది. తెలంగాణ జీఐ మ్యాన్‌గా పేరుగాంచిన సుభాజిత్ సాహా, హెడ్ లీగల్, రిజల్యూట్ 4ఐపీ ఈ దరఖాస్తు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో పండించే చామదుంప పుట్టుక, దాని లక్షణాలపై తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య కీలక సమాచారం సేకరించారు. భౌగోళిక సూచిక(జీఐ) రక్షణ కోసం దరఖాస్తు చేసిన మొట్టమొదటి చామదుంప రకంగా ఇది గుర్తింపు పొందింది.
చామదుంపలు సాగు చేసే రైతులకు సజ్జాపూర్ రకం గేమ్ చేంజర్ అవుతుందని వీసీ రాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఉద్యాన వారసత్వాన్ని పరిరక్షించడానికి మరో 5 పంటలు వరుసలో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ టీజీవో మెంబర్ సెక్రటరీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జీఐ ట్యాగ్లు ప్రపంచ మారెట్లను సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తాయని వెల్లడించారు.
సజ్జాపూర్ చామదుంప అనేది ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన రకం. చూడటానికి ఆకర్షణీయంగా, శ్రేష్ఠమైన వంట గుణం, లోతైన సాంసృతిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సజ్జాపూర్లోని నల్లరేగడి నేలల్లో ఉండే ప్రత్యేకమైన ఖనిజ కూర్పు వల్ల ఇది ఏర్పడుతుంది. పొడి పదార్థం అధికంగా ఉండటంతో వండినప్పుడు మెత్తగా, అంటుకోకుండా ఉంటుంది. వగరు కూడా తకువే. ఎకువగా శుద్ధి చేయకుండానే తినవచ్చని పిడిగం సైదయ్య వెల్లడించారు.