హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ ఒకటి నుంచి బీటెక్ క్లాసులు ప్రారంభించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వెల్లడించింది. ఆగస్టు 31లోపు తొలివిడత సీట్ల భర్తీని పూర్తిచేసి, సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక బీటెక్ ఫస్టియర్‌లో మొదటి, రెండోవిడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 15 నుంచి క్లాసులను ప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు 2021-22 విద్యాసంవత్సర క్యాలెండర్‌ను ఏఐసీటీఈ విడుదలచేసింది. కాలేజీల గుర్తింపు, సీట్ల భర్తీ, తరగతుల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది.
జూలై ఒకటి నుంచి పీజీడీఎం, పీజీసీఎం తరగతులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీసీఎం), ఆన్లైన్, ఓడీఎల్ కోర్సుల అకాడమిక్ క్యాలెండర్‌ను సైతం ఏఐసీటీఈ విడుదల చేసింది. పీజీడీఎం, పీజీసీఎం కోర్సులు నిర్వహించే విద్యాసంస్థలు జూన్ 30లోపు అనుమతులు పొంది, జూలై 1 నుంచి తరగతులు నిర్వహించాలని ఏఐసీటీఈ పేర్కొన్నది. సీట్లు పొందిన వారు జూలై 5వ తేదీలోపు రద్దుచేసుకోవచ్చని, జూలై10వ తేదీలోపు మొత్తం ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేయాలని ఏఐసీటీఈ షెడ్యూల్లో ప్రకటించింది. ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్
లర్నింగ్ కోర్సులు నిర్వహించే విద్యాసంస్థలు జూన్ 30లోపు అనుమతులు తెచ్చుకొని, సెప్టెంబర్ 1లోపు తొలివిడత, ఫిబ్రవరి 1, 2022లోపు రెండోవిడత ప్రవేశాలు పూర్తిచేయాలని వెల్లడించింది.
ముగియకుండానే..
ప్రస్తుత విద్యాసంవత్సరం ముగియకుండానే ఏఐసీఈటీ నూతన విద్యాసంవత్సరాన్ని ప్రకటించింది. 2020- 21 విద్యాసంవత్సరం కొనసాగుతుండగా, కరోనా దృష్ట్యా పరీక్షలు జరుగలేదు. పరీక్షల నిర్వహణపై వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతుండగానే నూతన విద్యాసంవత్సరం షెడ్యూల్ ప్రకటనపై తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. క్లాసులు జరుగుతున్నాయో, లేదో తెలుసుకోకుండా షెడ్యూల్ విడుదల చేయడంమేంటని ప్రశ్నించారు.
ఏఐసీఈటీ నిర్ణయం అశాస్త్రీయం..
వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండానే ఏఐసీఈటీ 2021-22 విద్యాసంవత్సరం షెడ్యూల్ ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదని టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీపీఐఈఏ) అధ్యక్షుడు డాక్టర్ వీ బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏఐసీటీఈ నిర్ణయం అశాస్త్రీయమని, ఏదో తంతు పూర్తిచేసినట్టుగా షెడ్యూల్ విడుదలచేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. సిలబస్, పరీక్షలు పూర్తికాకుండా కొత్త షెడ్యూల్ విడుదల గందరగోళానికి దారితీస్తుందన్నారు.
షెడ్యూల్ – గడువు..
టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ల నుంచి గుర్తింపు పొందడానికి జూన్ 30
విశ్వవిద్యాలయాలు, బోర్డుల నుంచి గుర్తింపునకు జూలై 15
తొలివిడత కౌన్సిలింగ్, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు ఆగస్టు 31
2,3,4 సంవత్సరాల విద్యార్థులకు క్లాసుల నిర్వహణ సెప్టెంబర్ 1
రెండోవిడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు సెప్టెంబర్ 9
నచ్చిన కాలేజీల్లో సీట్లు దక్కకుంటే సీట్ల రద్దు సెప్టెంబర్ 10
మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి గడువు సెప్టెంబర్ 15
ఫస్టియర్ విద్యార్థులకు తరగతుల నిర్వహణ సెప్టెంబర్ 15
లాటరల్ ఎంట్రీతో సెకండియర్‌లో చేరేందుకు సెప్టెంబర్ 20