బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం!
సింగరేణి మొత్తం అవినీతిలో కూరుకుపోయింది.. ప్రభుత్వ పెద్దల రూ.వేల కోట్ల అవినీతితో సంస్థ మూతపడేలా ఉన్నది - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా చేసిన ఆరోపణ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు మూడేండ్లుగా సింగరేణి సంస్థ ప్రతిష్టను మసకబార్చే ఘటనలు తరుచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. టెండర్లలో కుమ్మక్కుల నుంచి లక్షల టన్నుల బొగ్గు మాయమవడం వరకు ఎన్నో కుంభకోణాలు బయటికి వచ్చాయి.
- లాభాల్లో కార్మికుల వాటా 32 శాతానికి పెంపు
- 61 ఏండ్లకు పెరిగిన ఉద్యోగ విరమణ వయస్సు
- కారుణ్య నియామకాలతో కుటుంబాలకు భరోసా
- రూ.10 లక్షల గృహ రుణం, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం
- ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి
- ఆరు జిల్లాల అభివృద్ధికి సింగరేణి చేయూత
కానీ.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో సింగరేణిలో స్వర్ణయుగం నడిచింది. ఉత్పత్తి, లాభాలు గణనీయంగా పెరగడం, లాభాల్లో కార్మికులకు వాటాగా రూ.వందల కోట్లు పంచడం, ఏటికేడు వాటా పెరగడం, కార్మికులకు వసతుల పెంపు.. ఇలా ఎప్పుడూ సంతోషకర వార్తలే వినిపించేవి. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎదగడంతోపాటు దాదాపు ఆరు జిల్లాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.
కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గోదావరిఖని: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏం మారుతుంది? తెలంగాణను ఆత్మలో నింపుకున్నవాడు పాలకుడైతే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయి?.. వీటికి సమాధానంగా నిలిచిన రంగాల్లో సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఒకటి. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. లాభాల్లో కార్మికుల వాటా పెంపు, పదవీ విరమణ వయస్సు పెంపు, రూ.10 లక్షల గృహ రుణ సదుపాయం, కారుణ్య నియామకాల సరళీకరణ వంటి చర్యలు ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలను అందించింది.
ఉత్పత్తి, టర్నోవర్, లాభాల్లో నమోదైన వృద్ధి సంస్థ ఆర్థిక కార్యకలాపాల విస్తరణను సూచించింది. గనుల చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి నిధులు వెచ్చించడంతోపాటు కార్మికుల నివాస, వైద్య, విద్యాసదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పాలనను సింగరేణి చరిత్రలో కీలక దశగా కార్మికులు, ఆ పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. కానీ, దాదాపు మూడేండ్ల కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాలమయంగా మారింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చూపుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌పై కార్మికులు రగిలిపోతున్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు సంస్థ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? కార్మికుల సంక్షేమ పథకాలు కొనసాగుతాయా? సంస్థలో ప్రభుత్వరంగ స్వరూపం, ఉద్యోగభద్రతకు ఎలాంటి హామీలు ఉంటాయి? అన్నవి ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.
లాభాల్లో పెరిగిన 11 శాతం వాటా
కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చిన కీలక నిర్ణయాల్లో లాభాల వాటా పెంపు ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికులకు చెల్లించే లాభాల వాటాను ప్రభుత్వం క్రమంగా పెంచుతూ వచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 21 శాతం వాటా ప్రకటించగా.. 2017-18లో 27 శాతానికి, 2018-19లో 28 శాతానికి, 2021-22లో 30 శాతానికి పెంచారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ వాటాను 32 శాతానికి చేర్చారు. అంటే తొమ్మిదేండ్లలో 11 శాతం వాటా పెరిగింది. 2022-23లో సంస్థ సాధించిన లాభాల నుంచి కార్మికులకు సుమారు రూ.711 కోట్లను ప్రత్యేక ప్రోత్సాహకంగా చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ లాభాల్లో కార్మికులకు అందించిన వాటా పెరగడం వల్ల.. సంస్థ ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించినప్పుడు ఉద్యోగులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఏర్పడింది.
పదవీ విరమణ వయస్సు పెంపు
సింగరేణి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన మరో కీలక నిర్ణయం పదవీ విరమణ వయస్సు పెంపు. 2021 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. అప్పటి నివేదికల ప్రకారం.. ఈ నిర్ణయంతో సుమారు 43,899 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగింది. వయోపరిమితి పెంపుతో అర్హులైన ఉద్యోగులు మరో ఏడాది పాటు విధుల్లో కొనసాగి వేతనం పొందే అవకాశం లభించింది. తద్వారా ఉద్యోగభద్రతతోపాటు ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరింది. పదవీ విరమణ అనంతరం లభించే ప్రయోజనాలు, పెన్షన్, కొత్త నియామకాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది సంబంధిత నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
సొంతింటి కలకు రూ.10 లక్షల రుణం
సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నది ఎవరికైనా ఒక కల. సింగరేణి కార్మికులు దాన్ని సులభంగా సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని గృహ రుణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన ఉద్యోగులకు గృహ నిర్మాణానికి ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పథకాన్ని రూపొందించారు. రుణ అర్హతలు, మంజూరు విధానం, తిరిగి చెల్లింపు నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందుతుంది. మరోవైపు కార్మికుల నివాస సదుపాయాల మెరుగుదలపై కూడా దృష్టి సారించారు. సింగరేణి క్వార్టర్లకు దశలవారీగా ఏసీ సదుపాయం కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. 2022 నాటికి 26,170 క్వార్టర్లకు ఏసీ కనెక్షన్లు ఇచ్చినట్టు నివేదికలు పేర్కొన్నాయి.
కారుణ్య నియామకాలతో భరోసా
సింగరేణి కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచిన సంక్షేమ చర్యల్లో కారుణ్య నియామకాలు కీలకమైనవి. ఉద్యోగి మరణించినప్పుడు లేదా నిబంధనల ప్రకారం వైద్యపరంగా ఉద్యోగానికి అనర్హుడైనప్పుడు వారి కుటుంబంలోని అర్హులైన వారికి ఉపాధి కల్పించే విధానం అమల్లో ఉన్నది. ఈ విధానాన్ని సరళీకరించడం ద్వారా బాధిత కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించే ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2024 డిసెంబర్ వరకు కారుణ్య నియామకాల విధానం ద్వారా మొత్తం 17,203 మంది ప్రయోజనం పొందారు. బాహ్య నియామకాల ద్వారా 4,790 మంది ఉద్యోగాల్లో చేరారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
కార్మికుల సంక్షేమాన్ని వేతనాలు, బోనస్లకే పరిమితం చేయకుండా వారి కుటుంబాలకు అవసరమైన ఇతర సదుపాయాలపైనా దృష్టి సారించారు. కార్మికులతోపాటు వారి తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు అందించే మ్యాచింగ్ గ్రాంట్‌ను పెంచడం, కార్మికుల విద్యుత్తు చార్జీల భారం తగ్గించడం, ఉన్నత విద్య అభ్యసించే కార్మికుల పిల్లలకు ఫీజుల చెల్లింపులో సహకారం వంటి చర్యలు చేపట్టారు. లాభాల బోనస్, పండుగ అడ్వాన్స్ పెంపు, క్యాంటీన్ల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు కూడా కార్మికుల సంక్షేమంలో భాగమయ్యాయి.
ఆరు జిల్లాల అభివృద్ధికి సింగరేణి అండ
బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమంతోపాటు గనుల పరిసర ప్రాంతాల అభివృద్ధిలోనూ సింగరేణి కీలకపాత్ర పోషించింది. సంస్థ కార్యకలాపాలు విస్తరించిన ఆరు జిల్లాల్లోని గనుల పరిసర గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు వెచ్చించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) కింద 2015 నుంచి 2022 వరకు రూ.3,423 కోట్ల నిధులను ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగాలకు జమ చేసినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నిధులతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పాఠశాల భవనాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. వీటికి అదనంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద సుమారు రూ.250 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. సుమారు 120 గ్రామాలు, 15 పట్టణ ప్రాంతాల్లో ఈ నిధులను వినియోగించినట్టు పేర్కొన్నారు.
పెరిగిన బొగ్గు ఉత్పత్తి.. టర్నోవర్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి ఆర్థిక ప్రగతి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. 2014-15లో టర్నోవర్ రూ.14,821.42 కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి రూ.33,065 కోట్లకు చేరింది. అంటే దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. నికర లాభం సైతం రూ.1,227 కోట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ.2,222 కోట్లకు చేరింది. సుమారు రెట్టింపు అయ్యింది. ఈ గణాంకాలు సంస్థ కార్యకలాపాల విస్తృతి, ఆదాయం, లాభాల్లో వచ్చిన పెరుగుదలను స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉత్పత్తి సైతం గణనీయంగా పెరిగింది. 2015-16లో 60.38 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, 2022-23లో ఇది 67.14 మిలియన్ టన్నులకు పెరిగింది. 2023-24లో 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. బొగ్గు ఉత్పత్తి పెరుగుదల సంస్థ కార్యకలాపాల విస్తరణకు సూచికగా నిలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

