BRS | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ‘బలగం’ సినిమా థీమ్ తో బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన యాడ్స్ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. శనివారం విడుదలైన ఈ ప్రకటనలు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్‌గా మారా యి. బలగం నేపథ్యంలో పార్టీ రూపొందించిన ఈ ఐదు యాడ్లు సినిమా థియేటర్లలో, టీవీల్లో ప్రదర్శించేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వినూత్నరీతిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తెలుగులో విజయవంతమైన ‘బలగం’ సినిమా థీమ్‌తో ప్రస్తుతం రూపొందించిన ఈ యాడ్స్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన విజయాలను, పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించడం కోసం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరాన్ని ఈ లఘు చిత్రాల్లో సృజనాత్మకంగా పొందుపర్చారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘బలగం’ సినిమా సంచలనం సృష్టించింది. తెలంగాణ లో వ్యక్తుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ చిత్రం.. ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొని అపూర్వ విజయాన్ని అందుకున్నది. గ్రామగ్రామాన ప్రొజెక్టర్లు, స్రీన్ల మీద ప్రదర్శించిన ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.