ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో విఫలం
తెలంగాణను ఉద్ధరిస్తామంటే నమ్మేదెవరు?
రాష్ర్టాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ
రాహుల్ మాటలకు మోసపోయేవాళ్లు లేరు
వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): బీజేపీని ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ తెలంగాణను ఉద్ధరిస్తామంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. తెలంగాణను వంచించి, పౌరులను వలసలపాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఆదివారం తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా కాంగ్రెస్ కాలయాపన చేయటం వల్లనే వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ అమరుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోవటం వల్లే బీజేపీ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతున్నదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు తాము బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లోపలా, బయటా మాట వరుసకైనా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎవరికి భయపడి రాహుల్‌గాంధీ నోరు తెరువలేదని నిలదీశారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నదని ఆరోపించారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదని అన్నారు.
కష్టపడి సాధించుకున్నాం..
ఇష్టపడి రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకొంటున్నాం
కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసిన విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి హితవు పలికారు. కష్టపడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఏడేండ్ల్లుగా కేంద్రం నుంచి రాష్ర్టానికి వివిధ రంగాల్లో వస్తున్న అవార్డులే అందుకు సాక్ష్యమని తెలిపారు. దేశ వ్యవసాయరంగంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక విధానమే లేదని విమర్శించారు. నెహ్రూ కుటుంబ వారసత్వం మినహా రాహుల్ ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఎన్ని వేషాలు వేసినా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం కలేనని తేల్చి చెప్పారు.