బైపీసీకి డిమాండ్!
ఇంటర్‌విద్య విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్. ఇక్కడ తీసుకొనే కోర్సును బట్టే విద్యార్థి జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ టర్నింగ్ పాయింట్ వద్దే విద్యార్థుల అభిరుచులు.. ప్రాధాన్యాలు మారుతున్నాయి.
- ఈ ఒక్క ఏడాదిలోనే 10 వేల మంది అదనంగా చేరిక
- ఎంపీసీ కోర్సుకు తగ్గిన ఆదరణ.. 14వేలకు పైగా పడిపోయిన అడ్మిషన్లు
- 5లక్షల మార్కు దాటిన ఫస్టియర్ అడ్మిషన్లు
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఇంటర్‌విద్య విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్. ఇక్కడ తీసుకొనే కోర్సును బట్టే విద్యార్థి జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ టర్నింగ్ పాయింట్ వద్దే విద్యార్థుల అభిరుచులు.. ప్రాధాన్యాలు మారుతున్నాయి. ఒకప్పుడు ఇంజినీరింగ్ లక్ష్యంగా పరుగులు పెట్టిన విద్యార్థులు తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్ రంగాల్లో ఎంట్రీకి మార్గం చూపే బైపీసీ కోర్సు పట్ల ఆసక్తిచూపుతున్నారు.
ఈ విద్యాసంవత్సరంలో బైపీసీలో ఏకంగా 10 వేల మందికి పైగా అదనంగా చేరడం ఈ మార్పునకు అద్దం పడుతున్నది. నిరుడు బైపీసీ కోర్సులో 1.01 లక్షల మంది చేరగా, ఈ విద్యాసంవత్సరం 1.11లక్షలకు పెరిగింది. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ఐదు లక్షల మారును దాటాయి. ఫస్టియర్‌లో 5,05, 898 మంది, సెకండియర్‌లో 4,90,214 మంది కలిపి మొత్తం 9,96,112 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తున్నారు.
ఎంపీసీకి తగ్గుతున్న క్రేజ్
మరోవైపు ఎంపీసీ కోర్సు అడ్మిషన్లలో ఈ ఏడాది తగ్గుదల నమోదైంది. గత విద్యాసంవత్సరంలో 2,20,282 మంది ఎంపీసీలో చేరగా.. ఈసారి ఆ సంఖ్య 2,06,344కు పడిపోయింది. అంటే 13,938 మంది ఈ కోర్సులో తగ్గారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ వంటి విభాగాలకు డిమాండ్ కనిపిస్తున్నా.. ఇంటర్ స్థాయిలో ఎంపీసీ ప్రవేశాలు తగ్గడం చర్చనీయాంశంగా మారింది. ఎంఈసీ కోర్సుకు కాస్త డిమాండ్ పెరగడం గమనార్హం. నిరుడు ఈకోర్సులో 15 వేల మంది చేరితే ఈ ఏడాది ఏకంగా 17వేల మంది చేరారు. డిగ్రీలో బీకాంకు డిమాండ్ ఉండగా, ఇంటర్లో సీఈసీ అడ్మిషన్లు కాస్త స్వల్పంగా తగ్గాయి. నిరుడు 95వేల మంది చేరితే ఈ ఏడాది 94వేల మందే అడ్మిషన్ పొందారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) కోర్సులో నిరుడు 12,205 మంది చేరగా ఈ సారి 13,603కి పెరిగాయి.
ఏసీఈ కోర్సు అదుర్స్
ఈ విద్యాసంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అకౌంటెన్సీ కామర్స్, ఎకనామిక్స్(ఏసీఈ) కోర్సుకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. తొలి ఏడాదిలోనే ఈ కోర్సులో 7,014 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. సంప్రదాయ కోర్సులతో పోల్చితే ఈ కోర్సులో చేరడం ద్వారా వాణిజ్య, ఆర్థిక రంగాల్లో అవకాశాలు లభిస్తాయన్న ఆలోచన విద్యార్థుల్లో కనిపిస్తున్నది. హెచ్ఈసీ కోర్సు ప్రవేశాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. నిరుడు 9,941 మంది విద్యార్థులు మాత్రమే చేరగా, ఈ విద్యాసంవత్సరం ఏకంగా 13,917 మంది చేరారు. అంటే దాదాపు నాలుగు వేల మంది అదనంగా ఈ కోర్సులో అడ్మిషన్లు పొందడం విశేషం. సివిల్స్ పట్ల ఆసక్తి గల విద్యార్థులు ఈ కోర్సులో చేరుతున్నట్టు స్పష్టమవుతున్నది.
సీఎస్ఈలో సున్నా
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సుల్లో టాప్ కోర్సు. కానీ ఇంటర్లో మాత్రం ఈ కోర్సుకు అంతగా డిమాండ్ కనిపించడంలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ కోర్సులో చేరకపోవడం.. ఒక్క అడ్మిషన్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ కోర్సుతోపాటు ఈ విద్యాసంవత్సరంలో మొత్తం ఆరు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ కోర్సుల్లో ఒక్కరు కూడా చేరలేదు. మెకానికల్ టెక్నాలజీ(ఓల్డ్ సిలబస్), అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్(ఏఅండ్‌టీ), అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(ఏఈటీ), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(ఈఈటీ), మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు(ఎంఈటీ) కోర్సుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు. మరోవైపు సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ కోర్సులో నిరుడు జీరో అడ్మిషన్లు నమోదు కాగా ఈ సారి ఏడుగురు చేరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుకు ఆదరణ పెరుగుతున్నది. నిరుడు 71 మంది చేరితే ఈ సారి 330 మంది ప్రవేశాలు పొందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

