Balagam Mogilaiah | హైదరాబాద్ : బలగం సినిమా( Balagam Movie ) లో క్లైమాక్స్ పాట పాడి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) ఆదేశాలతో మొగిలయ్యకు నిమ్స్‌లో వైద్యం కొనసాగుతోంది. అయితే మొగిలయ్యకు ఎలాంటి గుండె సమస్య లేదని నిమ్స్ వైద్యులు నిర్ధారించారు.
దీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో గత ఏడాది కాలం నుంచి మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే నిన్న ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వరంగల్ నుంచి నిమ్స్‌కు తరలించారు. ఇవాళ మొగిలయ్యకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుండె సమస్య లేదని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం మొగిలయ్యకు డయాలసిస్ కొనసాగుతోందని తెలిపారు. మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేశారు.