పెద్దపల్లి, జనవరి 9(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకూ సాగునీటిని అందించడమే లక్ష్యంగా కాళేశ్వరంలో 15పంపులతో ఎత్తిపోతలు పోయిస్తున్నారు. ప్రాజెక్టు లింక్-1లోని 9 పంపులను, లింక్-2లోని 6 పంపులతో ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గల బ్యాక్ వాటర్‌ను నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములకు అందించడమే లక్ష్యంగా ఇరిగేషన్ అధికారులు నీటిని ఎత్తిపోస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపు హౌజ్‌లోని 3 పంపులతో 6,600 క్యూసెక్కులు అన్నారంలోని సరస్వతీ బరాజ్‌లోకి, మంథని మండలంలోని కాసిపేటలోని సరస్వతీ పంపు హౌజ్‌లోని 3 పంపులతో 8,700 క్యూసెక్కుల నీటిని మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి, అంతర్గాం మండలంలో గోలివాడలోని పార్వతి పంపు హౌజ్‌లోని 3 పంపులతో 7,800 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.