హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఆదివారం విడుదల చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో మొత్తం 174 పోస్టుల భర్తీకి ఈ జాబితా వెల్లడించినట్టు బోర్డు పేర్కొన్నది. గైనకాలజీలో(90), అనస్తీషియా(44), పీడియాట్రిక్స్(28), ఆర్థోపెడిక్స్(12) పోస్టులు ఉన్నట్టు వివరించింది.
మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 1న హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫైనల్ మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టును విడుదల చేయనున్నట్టు ఆదివారం ప్రకటనలో బోర్డు తెలిపింది.