హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, డైరెక్టర్ ఎన్ శంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనిల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను మంత్రి తలసాని శాలువాతో సత్కరించి అభినందించారు.
అనిల్ కుర్మాచలం 1979, మార్చి 8న కరీంనగర్‌లోని రామ్‌నగర్‌లో జన్మించారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆయన.. లండన్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. దశాబ్దం క్రితం లండన్‌లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌ను స్థాపించారు. అనంతరం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షణలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ చాప్టర్స్‌ను వివిధ దేశాల్లో ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని, పర్యాటకంతో పాటు సాంస్కృతిక రంగాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలో అనిల్ కుర్మాచలం కీలకపాత్ర పోషించారు. అనిల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు.