సర్కారీ ఆస్తుల స్వాహా భూదాహం.. సర్కార్ దాసోహం
మనం థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటం.. ఫస్ట్‌హాఫ్‌లో ముఖ్య పాత్రలన్నీ దాదాపు ప్రశాంతంగా ఉంటయ్. పెద్దగా ట్విస్టులు ఉండవు. పాత్రలన్నీ అమాయకంగా కనిపిస్తాయి. రీళ్లు గడిచేకొద్దీ.. మలుపులు ప్రారంభమవుతయ్. గంగ చంద్రముఖిలా మారినట్టు ప్రశాంతంగా కనిపించే పాత్రలు నెమ్మదిగా తమ అసలు రూపాన్ని ప్రదర్శిస్తుంటయ్. కథ ైక్లెమాక్స్‌కు చేరేసరికి ఆ పాత్రలకు సహకరించిన సూత్రధారులెవరో? వారి మధ్య ఉన్న ఆ బంధం ఏమిటో బయటపడిపోతుంది. ఇదే రీతిన బెంగళూరుకు చెందిన సాస్ (SAS) ఇన్ఫ్రా థ్రిల్లర్‌కు తక్కువకాని ‘మల్టీలేయర్ ఆక్రమణ’ను ఆవిష్కరించింది.
- రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగిన కంత్రీ కంపెనీ
- పెద్దల అండతో బరితెగింపు.. కబ్జాకు సహకరించిన అధికారులు
- ‘సాస్’ కోసం చక్రం తిప్పిన ‘ముఖ్యనేత’ ప్రధాన అనుచరుడు
- మొదట భూసేకరణతో గృహాలకు కేటాయించినట్టు నమోదు
- పదిహేను రోజుల్లోనే గుంట భూమి ప్రైవేట్ వ్యక్తి పేరిట మార్పు
- మరో 4 రోజుల్లో ఒకే లావాదేవీపై సాస్ ఇన్ఫ్రాకు బదలాయింపు
- ఆధారాలేవీ లేకుండానే 3.17 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్
- దారి కోసం ఏకంగా తౌతోనికుంటలో రోడ్డేసిన సాస్ ఇన్ఫ్రా
- ఈ అరాచకంపై గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌వాసుల అభ్యంతరం
- అక్రమాలపై చర్యలు మాని, సంధికి ప్రయత్నాలు చేసిన హైడ్రా
- ‘సాస్’కు దారివ్వకుంటే మీ దారి మూస్తామంటూ వార్నింగ్
- ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టుకు అపార్ట్‌మెంటువాసులు
మనం థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటం.. ఫస్ట్‌హాఫ్‌లో ముఖ్య పాత్రలన్నీ దాదాపు ప్రశాంతంగా ఉంటయ్. పెద్దగా ట్విస్టులు ఉండవు. పాత్రలన్నీ అమాయకంగా కనిపిస్తాయి. రీళ్లు గడిచేకొద్దీ.. మలుపులు ప్రారంభమవుతయ్. గంగ చంద్రముఖిలా మారినట్టు ప్రశాంతంగా కనిపించే పాత్రలు నెమ్మదిగా తమ అసలు రూపాన్ని ప్రదర్శిస్తుంటయ్. కథ ైక్లెమాక్స్‌కు చేరేసరికి ఆ పాత్రలకు సహకరించిన సూత్రధారులెవరో? వారి మధ్య ఉన్న ఆ బంధం ఏమిటో బయటపడిపోతుంది. ఇదే రీతిన బెంగళూరుకు చెందిన సాస్ (SAS) ఇన్ఫ్రా థ్రిల్లర్‌కు తక్కువకాని ‘మల్టీలేయర్ ఆక్రమణ’ను ఆవిష్కరించింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఖాజాగూడలో భూ ఆక్రమణ పర్వంలో అనేక మలుపులు, ట్విస్టులతో వ్యవస్థల నిజస్వరూపాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో ముఖ్యనేత మొదలు అనేకమంది ప్రభుత్వ పెద్దలు ప్రధాన పాత్రలు పోషించిన కథాంశమిది!

బెంగళూరుకు చెందిన ‘సాస్ ఇన్ఫ్రా’ కంపెనీ హైదరాబాద్ రియల్టీ రంగంలోకి ప్రవేశించింది. కొంత భూమిని కొనుగోలు చేసి, మరికొంత డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని భారీ ప్రాజెక్టు చేపట్టింది. నిర్మాణ సామగ్రి, టిప్పర్లతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలంటే పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కొంత వాడుకుంటానని దరఖాస్తు చేసుకున్నది. సర్కార్ సానుకూలంగా స్పందించడంతో అందుకయ్యే ఫీజునూ చెల్లించింది. ఇదంతా చూసి కొనుగోలుదారులు క్యూ కట్టారు. రెండేండ్లు కుదురుగా ఉన్న కంపెనీ.. నెమ్మదిగా నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది. స్థానికుల ఫిర్యాదుతో అప్పటి సర్కార్ కొరడా ఝుళిపించగా.. కంపెనీ వెనక్కితగ్గినట్టు నటించింది.
‘సాస్.. భూహారతి’ థ్రిల్లర్ సినిమాలో ఇది తొలి ట్విస్ట్.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాలం కలిసి వచ్చిందని భావించి సాస్ ఇన్ఫ్రా మళ్లీ తన పన్నాగాలకు పదును పెట్టింది. పరిస్థితులు అనుకూలించాయి. పెద్దలూ ప్రసన్నమయ్యారు. ఇంకేముంది.. విశ్వరూపం బయటపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారంగా నిర్మాణ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోయింది. కొనుగోలు దారులకు చేసిన ఒప్పందంలో కోతపెట్టి ఉల్లంఘనలకు పాల్పడింది. పక్కనున్న ప్రభుత్వ భూమిని రాత్రికిరాత్రి కొల్లగొట్టి తన ఖాతాలో వేసుకున్నది. ఆ జాగలో నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు ఏకంగా సమీపంలోని చెరువులోనే రోడ్డు వేసింది. ‘ముఖ్య నేత’ అండతో ఆ ప్రైవేట్ నిర్మాణ కంపెనీ ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయింది. పెద్దల ఒత్తిడితో అధికారులే దగ్గరుండీ ఆక్రమిత భూమికి అవసరమైనవన్నీ సమకూర్చి పెట్టారు.
సాస్ కంపెనీకి సర్కార్ భూమిని అధికారులు దగ్గరుండి మరీ ఒకేరోజులో ధారాదత్తం చేశారు. చెరువులోంచి రోడ్డు వేసేందుకు వీలుగా.. హైడ్రానే నేరుగా రంగంలోకి దిగి ఇరుగు పొరుగు అపార్ట్‌మెంట్‌వాసులకు ధమ్కీ ఇచ్చింది. మూడేండ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేండ్లలో కాకపోయినా.. రెరా అటు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఇలా సాగిలపడ్డాయంటే ఇంతకీ సూత్రధారి ఎవరై ఉంటారనే కదా మీ సందేహం? అది తెలియాలంటే కెమెరా మణికొండ వైపు తిప్పాలి. అక్కడ.. సాస్ డైరెక్టర్‌తోపాటు సూత్రధారి డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు కనిపిస్తుంది. ప్రభుత్వ భూమి ధారాదత్తానికి ముందు ఈ ప్రాజెక్టులోని 14 వేల పైచిలుకు చదరపు అడుగులు సంయుక్త ప్రాజెక్టును చేపట్టిన ‘ఆ కంపెనీ’ పేరిట సేల్‌డీడ్ జరుగడం కొసమెరుపు.
సీన్-1
(గుండాల కృష్ణ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో సాస్ ఇన్ఫ్రా సంస్థ వాణిజ్యపరమైన నిర్మాణ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఖాజాగూడలోని సర్వేనంబర్ 19లో 10.32 ఎకరాల భూమి ఉన్నది. అందులో 1.36 ఎకరాలను హర్వీందర్ కౌర్ అనే పట్టాదారు నుంచి సాస్ ఇన్ఫ్రా కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో 5.16 ఎకరాలను హర్విందర్ కౌర్, మోహినీచావ్లాతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది. ఇంకో 3.19 ఎకరాలపై యాజమాన్య హక్కు ఉన్న హర్వీందర్ కౌర్, మోహినీచావ్లాను కలుపుకొని మొత్తం 10.32 ఎకరాల్లో ప్రాజెక్టు మొదలుపెట్టింది.
2017లో భూ వినియోగ మార్పులో భాగంగా ప్రభుత్వ అనుమతితో అగ్రికల్చర్ నుంచి మల్టీపుల్ జోన్‌గా మార్చుకొని 2019లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నది. 36 అంతస్తులతో, 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులు పొందింది. అది ఖాజాగూడలో రద్దీ ప్రాంతం కావడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పైగా చుట్టుపక్కల ఓక్రిడ్జ్, ఢిల్లీ వంటి అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, కాలుష్యంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని వాడుకోవాలని సాస్ ఇన్ఫ్రా అనుకున్నది. ఈ మేరకు 23.8.2018న సాస్ యాజమాన్యం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నది.
నిర్మాణ సమయంలో వినియోగించే ట్రక్కులు,ఇతరత్రా నిర్మాణ సామగ్రిని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో నిల్వ ఉంచుకుంటే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని, కాలుష్యాన్ని కూడా నివారించే అవకాశం ఉంటుందని ఆ దరఖాస్తులో పేర్కొన్నది. ఆరు నెలలపాటు ఆ భూమిని వినియోగించుకునేందుకు తాము ఫీజు చెల్లిస్తామని కూడా అందులో స్పష్టంచేసింది. ప్రాజెక్టుకు సహకరించాలనే సదుద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తహసీల్దార్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.
సీన్-2
మొదట్లో రూల్స్ ప్రకారమే!
సాస్ ఐటవర్ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించారు. సర్వేనంబర్ 20/1లో 3.17 ఎకరాలు ఉండగా, అందులో మూడెకరాలను అప్పటికే ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం బీసీ సంక్షేమ శాఖకు కేటాయించినట్టు గుర్తించారు. అంటే కేవలం 17 గుంటలే రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్నది. అందుకే బీసీ సంక్షేమ శాఖకు కేటాయించిన మూడెకరాల్లో ఎకరం భూమిని సాస్ ఇన్ఫ్రా వినియోగించుకునేందుకు అనుమతినిస్తే, మొత్తం 1.17 ఎకరాల్లో ఆరు నెలలపాటు తమ నిర్మాణ సామగ్రి, ట్రక్కుల పార్కింగ్‌కు వినియోగించుకుంటుందని నివేదిక రూపొందించారు. ఆరు నెలల లీజుకుగాను రూ.68.97 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారు. దీంతో సాస్ యాజమాన్యం ఆ మేరకు చెల్లించి, 1.07 ఎకరాల భూమిని వినియోగించుకోవడం మొదలుపెట్టింది.
సీన్-3
నెమ్మదిగా తప్పటడుగులు 2018-19 ప్రాంతంలో నిర్మాణ పనులను మొదలుపెట్టిన సాస్ యాజమాన్యం నెమ్మదిగా తప్పటడుగులు వేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన మేరకు పక్కన ఉన్న సర్వేనంబర్ 20/1లోని 1.17 ఎకరాల భూమిని వినియోగించుకోవాలి.
కానీ అందుకు భిన్నంగా, మరో రెండెకరాలను కూడా స్వాధీనం చేసుకొని అందులో సామగ్రి నిల్వ ఉంచడం, ట్రక్కులను పార్కింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండానే అందులో కాంక్రీట్ మిక్సింగ్ చేసే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దీంతో పక్కనే ఉన్న గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌వాసులు కాలుష్యంతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. 2020 జనవరిలో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిక కూడా సమర్పించారు. సాస్ యాజమాన్యం లీజు ఒప్పందాన్ని అతిక్రమించి ఎక్కువ విస్తీర్ణాన్ని వినియోగించడంతోపాటు లీజు గడువు కంటే ఎక్కువ సమయం వాడుకుంటున్నదని అందులో పేర్కొన్నారు. అక్రమంగా రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో అప్పటి కలెక్టర్ స్పందించి, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్‌ను ఆదేశిస్తూ లేఖ (ఎల్సీ1/2870/2018, తేది:13.1.2020) రాశారు. అందులో రెండు కీలకమైన ఆదేశాలిచ్చారు.
‘సాస్ యాజమాన్యం కేవలం ఆరు నెలలకు మాత్రమే 1.17 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన తీసుకున్నది. కానీ అదనంగా మరో రెండు ఎకరాలను ఆక్రమించుకొని వినియోగించుకోవడంతోపాటు లీజు గడువు ముగిసిన తర్వాత కూడా వాడుకున్నది. ఈ మేరకు సాస్ ఇన్ఫ్రాకు నోటీసు జారీ చేయాలి. 4.6.2019 నుంచి 4.1.2020 వరకు 3.17 ఎకరాలను వినియోగించుకున్నందుకు జరిమానా కింద రూ.1,93,39,833 సర్కార్ ఖజానాలో జమ చేయించాలి’ అని సూచించారు.
‘సర్వేనంబర్ 20/1లోని రెవెన్యూ శాఖకు చెందిన 17 గుంటలతోపాటు బీసీ సంక్షేమ శాఖకు చెందిన మూడెకరాలు.. మొత్తం సాస్ ఇన్ఫ్రా ఆధీనంలో ఉన్న 3.17 ఎకరాలను పూర్తిగా ఖాళీ చేయించి స్వాధీనం చేసుకోవాలి’ అని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రెడీమిక్స్ ప్లాంట్‌ను తొలగించి, సామగ్రి, ఇతరత్రా యంత్రాలను అక్కడి నుంచి తీసేసి 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జరిమానాతో కొరఢా ఝళిపించడంతో ప్రభుత్వ భూమి వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాస్ భయపడింది. ఆ తర్వాత కరోనాతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నెమ్మదించాయి. అనంతరం కొంతకాలం నిర్మాణ పనులను నెమ్మదిగా కొనసాగించింది.

సీన్-4
కాంగ్రెస్ రాకతో ఇష్టారాజ్యం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాస్ తన అసలు రంగు బయటపెట్టింది. సాస్ ఇన్‌ఫ్రాలోని ఒక డైరెక్టర్‌కు, ‘ముఖ్యనేత’ ప్రధాన సన్నిహితుడికి మధ్య గతంలోనే వ్యాపార భాగస్వామ్యం ఉన్నది. దీనిని అడ్డుపెట్టుకొని సాస్ ఇన్ఫ్రా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. సర్కార్ పెద్దల సహకారం ఉండటంతో అధికారులు నిబంధనలేవీ పట్టించుకోకుండా కండ్లు మూసుకొని సాస్ ఐటవర్ ప్రాజెక్టుకు సవరణ అనుమతులు ఇచ్చేశారు.
- 36 అంతస్తులు, 33 లక్షల చదరపు అడుగులకు అనుమతులు తీసుకొని ఉన్న భూ విస్తీర్ణంలోనే దానిని ఏకంగా రెండు పర్యాయాలు సవరించింది. 38 అంతస్తులతో ఏకంగా 60 లక్షల చదరపు అడుగులకు నిర్మాణ విస్తీర్ణాన్ని పెంచింది. అనధికారికంగా ఇది 70 లక్షలు ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాణ నిబంధనలను పూర్తిగా అతిక్రమించిందనే విమర్శలున్నాయి.
- ప్రతి అంతస్తులో 70 వేల చదరపు అడుగులకు బదులు 90 వేల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు ఆ విస్తీర్ణాన్ని ఏకంగా 1.20 లక్షల చదరపు అడుగులకు పెంచింది.
- నిర్మాణ సమయంలో తౌతోనికుంట వైపు జరిగిన నిర్మాణం (సుమారు రెండు స్లాబులు) ఒక్కసారిగా కుప్పకూలిన సందర్భం కూడా ఉంది.
- ఫలితంగా నిబంధనల మేరకు చుట్టూ ఉండాల్సిన సెట్‌బ్యాక్‌లో భారీ వ్యత్యాసం, ఉల్లంఘనలు ఉన్నట్టు తెలిసింది.
- అయినప్పటికీ అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ నిబంధనల అమలు, నిర్మాణ ఉల్లంఘనలు ఏవీ పట్టించుకోకుండా ఫైర్ ఎన్వోసీ, జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశాయి.
- కొనుగోలుదారులకు ఒప్పంద సమయంలో ప్రతి వెయ్యి చదరపు అడుగులకు పది చదరపు గజాల అన్ డివైడ్ షేర్ (యూడీఎస్) ఇస్తానని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొని, ఇప్పుడు దానిని ఏడు చదరపు గజాలకు కుదించింది.
- 2019లో అనుమతులు తీసుకునే సమయంలో తూర్పు వైపున తౌతోనికుంట అని సరిహద్దుగా చూపి, అనంతరం రెండు పర్యాయాలు సమర్పించిన సవరణ దరఖాస్తుల్లో పొరుగువారి భూమి అని చూపి తప్పుదోవ పట్టించారు.
సీన్-5
సాస్ విశ్వరూపం
టిప్పర్లు, ఇతర సామగ్రి నిల్వ ఉంచుకునేందుకంటూ 1.17 ఎకరాల ప్రభుత్వ భూమిని సాస్ ఇన్ఫ్రా లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ దానిని అమాంతంగా మింగేయాలన్నది సాస్ ఇన్ఫ్రా ప్లాన్. కానీ బీఆర్ఎస్ హయాంలో ఆ పాచిక పారలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సవరణ అనుమతులతోపాటు ప్రాజెక్టుకు అగ్నిమాపక శాఖ అనుమతులు, జీహెచ్ఎంసీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా పొందింది. ఇది చాలదన్నట్టు ఇకో అడుగు ముందుకేసి.. సర్కార్ పెద్దల సహకారంతో 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిని రాత్రికిరాత్రి కొల్లగొట్టింది. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా సర్కారీ అని ఉన్న 3.17 ఎకరాల భూమి, ఇప్పటికీ 22ఏ నిషేధిత జాబితాలో ‘సర్కారీ-రాష్ట్ర ప్రభుత్వ భూమి’గా నమోదై ఉన్నది.
- అందులో మూడెకరాలను బీసీ స్టడీ సర్కిల్ కోసం బీసీ సంక్షేమ శాఖకు కేటాయించిన రికార్డులు ఉన్నాయి. అంతకుమించి 2019-20లో ఇదే సాస్ ఇన్ఫ్రా 1.17 ఎకరాలను లీజు ప్రాతిపదికన తీసుకొని ప్రభుత్వానికి రూ.లక్షలు కూడా చెల్లించింది. ఇన్ని ఆధారాలు ఉండగా, భూ భారతిలో రాత్రికిరాత్రి సుమారు రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు సాస్ ఇన్ఫ్రాకు ధారాదత్తం చేశారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తీరు చూస్తుంటే సర్కార్ పెద్దలు ఆదేశిస్తే అధికారులు ఎంతటి అక్రమాలకైనా వెనుకాడరనేది అర్థమవుతున్నది.
- సర్వేనంబర్ 20/1లోని 3.17 ఎకరాలను సాస్‌కు కట్టబెట్టడంలో అధికారులు అనుసరించిన తీరు విస్మయానికి గురిచేస్తున్నది. 13.4.2026న ఖాతా నంబర్ 30000101 కింద చూపిన 3.17 ఎకరాలను భూసేకరణ కింద చూపారు. విచిత్రంగా విక్రయదారుడి కింద ప్రభుత్వ భూమి అని, కొనుగోలుదారు కింద ఇంటి స్థలాలు అని నమోదు చేశారు. దీనికి లావాదేవీ నంబర్ కూడా నమోదు చేశారు.
- ఆ తర్వాత 15.06.2026న సాస్ ఇన్ఫ్రా డైరెక్టర్ గూడె వెంకటేశ్వరరావు పేరు మీద సర్వేనంబర్ 20/1/1లో గుంట భూమి లావాదేవీ జరిగినట్టుగా నమోదు చేశారు. దీనికి 239/2001 డాక్యుమెంటును లింకు డాక్యుమెంట్‌గా చూపారు. పట్టాదారు కింద ఇంటి స్థలాలు అని, దరఖాస్తుదారుడిగా గూడె వెంకటేశ్వరరావును పేర్కొన్నారు.
- మరో నాలుగు రోజులకు అంటే.. 19.6.2026న జరిపిన ఒక లావాదేవీలో ఇంటి స్థలాలు పట్టాదారుగా, కే సాస్ ఇన్ఫ్రా దరఖాస్తుదారుగా పేర్కొంటూ 3.16 ఎకరాల్లో 1.2850 ఎకరాల మీద సేల్‌డీడ్ నమోదు చేశారు. ఇందులో సర్వేనంబర్ కాలంలో 20/1/1/2గా నమోదు చేసి, ఒరిజినల్ సర్వేనంబర్ కాలంలో 20/1/1గా చూపారు. దీనికి 76/2002ను లింకు డాక్యుమెంట్‌గా చూపారు.
- అదే రోజు అంటే.. 19.6.2026న ఇంటి స్థలాలు పట్టాదారుగా చూపి, కే సాస్ ఇన్ఫ్రా దరఖాస్తుదారుగా సర్వేనంబర్ 20/1/1లోని 3.16 ఎకరాల్లో 1.2850 ఎకరాలను నాలా కింద మార్చినట్టుగా నమోదు చేశారు. ఇక్కడ కీలకమైన విషయమేందంటే.. ఒకేరోజు జరిగిన సేల్‌డీడ్, నాలా అనుమతులకు లావాదేవీ నంబర్ ఒకటే వేయడం.
సీన్-6
రెవెన్యూ టు రిజిస్ట్రేషన్
ఈ ఏడాది జూన్ 19న రెవెన్యూ శాఖ విజయవంతంగా అక్రమ రిజిస్ట్రేషన్‌తో సర్కార్ భూమిని సాస్ ఇన్ఫ్రాకు ధారాదత్తం చేస్తే, నాలుగు రోజుల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ శాఖ సాన్ ఇన్ఫ్రా అక్రమాలకు దర్వాజలే తెరిచింది.
- భూ భారతిలో సర్వేనంబర్ 20/1 ఈసీ పరిశీలిస్తే.. సర్వేనంబర్ అనేక రూపాంతరాలు చెందింది. 19.6.2026న గుంట భూమి సాస్ ఇన్ఫ్రా డైరెక్టర్ గూడె వెంకటేశ్వరరావు పేరిట, 1,2850 ఎకరాలు కె సాస్ ఇన్ఫ్రా పేరిట బదలాయింపు జరిగింది.
- అనంతరం కేవలం నాలుగు రోజుల్లోనే అంటే 23.6.2026న గూడె వెంకటేశ్వరరావు, కె సాస్ ఇన్ఫ్రా నుంచి 1,200 చదరపు గజాల భూమి కంభంపాటి షణ్ముఖేశ్వరదాస్కు సేల్‌డీడ్ (డాక్యుమెంట్ నం.11245/2026) జరిగింది.
- వాస్తవానికి సర్వేనంబర్ 20/1లోని 3.17 ఎకరాల ప్రభుత్వ భూమికి దారి లేదు. ఇదే విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ సైతం ఒక లేఖలో స్పష్టం చేసింది. కానీ జూన్ 23న జరిగిన రిజిస్ట్రేషన్‌లో 1,200 చదరపు గజాలకు ఉత్తరం, పశ్చిమాన ఏకంగా వంద ఫీట్ల రహదారులు వచ్చాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్తే ఈ భూమి సరిహద్దులుగా సాస్ ఐటవర్, గ్రీన్‌గ్రేస్ అపార్ట్మెంట్, తౌతోనికుంట, సర్వేనంబర్ 21 ఉంటాయి.
- అదే జూన్ 23న 1,200 చదరపు గజాలు క్షణాల్లో షణ్ముఖేశ్వరదాస్ సాస్ ఐటవర్కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ (డాక్యుమెంట్ నెం.11308/2026) చేశారు.
- దీంతోపాటు మరో డాక్యుమెంట్ (నంబర్ 11309/2026) ద్వారా సాస్ ఇన్ఫ్రా తరఫున గూడె వెంకటేశ్వరరావు 15,256 చదరపు గజాలు సాస్ ఐటవర్ తరఫున ఉన్న వడ్లమూడి వంశీకృష్ణకు అగ్రిమెంట్ చేశారు.
- ఒకేరోజు ఒకే భూమి రిజిస్ట్రేషన్‌పై జరిగిన మూడు లావాదేవీల్లో చదరపు గజానికి మార్కెట్ విలువ మూడు రకాలుగా ఉండటం గమనార్హం. మొదట.. 1,200 చదరపు గజాలను సాస్ ఇన్ఫ్రా, గూడె వెంకటేశ్వరరావు నుంచి షణ్ముఖేశ్వరదాస్కు సేల్‌డీడ్ జరిగినప్పుడు మార్కెట్ విలువ రూ.9,43,20,000గా (చదరపు గజానికి రూ.78,600) చూపారు. రెండోది అదే షణ్ముఖేశ్వరదాస్ సాస్ ఐటవర్ (వడ్లమూడి వంశీకృష్ణ)కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసినపుడు మార్కెట్ విలువను రూ.16.12 కోట్లుగా(చదరపు గజానికి రూ.1,34,340) చూపారు. ఇక మూడోది.. సాన్ ఇన్ఫ్రా (గూడె వెంకటేశ్వరరావు) నుంచి సాస్ ఐటవర్ వడ్లమూడి వంశీకృష్ణకు 15,256 చదరపు గజాలను డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసినప్పుడు మార్కెట్ విలువ రూ.123.75 కోట్లుగా (చదరపు గజానికి రూ.81,100) చూపారు.

సీన్-7
తౌతోనికుంట.. చెరసాలలో వేస్తారా?
సాస్ ఇన్ఫ్రా థ్రిల్లర్ భూ హారతిలో మరో కీలకమైన అంకం తౌతోనికుంట. కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పుగా చూపుతున్న హైడ్రా సైతం ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లో తన పాత్ర పోషించింది. వాస్తవానికి సర్వేనంబర్ 17లో ఉన్న తౌతోనికుంట 4.01 ఎకరాల (3.14 ఎకరాలు ఎఫ్టీఎల్ ప్రభుత్వ భూమి, 27 గుంటల బఫర్‌జోన్ ప్రభుత్వ భూమి) ప్రభుత్వ భూమిలో విస్తరించి ఉన్నది. ఇప్పుడు అదెంత విస్తీర్ణంలో ఉన్నదనేది దేవుడికే తెలియాలి.
- ఈ చెరువు మధ్యలోంచి 24 మీటర్ల (60 ఫీట్లు) రహదారి ఉన్నది. దీనిని 2007-08లో గ్రీన్‌గ్రేస్ అపార్ట్మెంట్ వారి కోసం హెచ్ఎండీఏనే మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా నిర్మించింది. ఈ మేరకు ప్రభుత్వ జీవోలు, హెచ్ఎండీఏ ఉత్తర్వులు, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ) మాస్టర్‌ప్లాన్‌లో ఈ రోడ్డుకు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. కానీ అనధికారికంగా సాస్ ఇన్ఫ్రా ఈ రోడ్డుకు అనుసంధానిస్తూ సాస్ ఐటవర్-గ్రీన్‌గ్రేస్ అపార్ట్మెంట్ మధ్యలో నుంచి తౌతోనికుంటలో సుమారు 30-40 ఫీట్ల రహదారిని మట్టితో వేసింది. అంటే చెరువులను చెరబడితే చెరసాల అని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ప్రకటించడంతో పాటు చెరువులను కాపాడేందుకు ఏర్పడ్డామన్న హైడ్రా దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది.
- హైడ్రా అధికారులు హఠాత్తుగా తౌతోనికుంట దగ్గరికి వెళ్లి 2007-08లో ప్రభుత్వ అనుమతితో, మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా చెరువు మధ్యలో నుంచి వేసిన రోడ్డును మూసివేసేందుకు ప్రయత్నించారు. ఇదెక్కడి అన్యాయమంటూ గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంటువాసులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఈ చెరువును తాము అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, అసలు చెరువు మధ్యలో రోడ్డు ఎలా ఉంటుందంటూ హైడ్రా అధికారులు కన్నెర్రజేశారు.
- ఉలిక్కిపడిన అపార్ట్‌మెంటువాసులు గతంలోని ప్రభుత్వ ఉత్తర్వులు అన్నింటినీ తీసుకొని హైడ్రా కార్యాలయానికి వెళ్లారు. ఆదిలో చెరువు మధ్యలో రోడ్డు ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేసిన అధికారులు.. చివరికి సాస్ ఇన్ఫ్రా (3.17 ఎకరాల ప్రభుత్వ భూమి) ఈ 60 ఫీట్ల రోడ్డును వాడుకునేందుకు అనుమతించాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అలా కుదరకుంటే ఈ రోడ్డును మూసేస్తామని బెదిరించారు.
- దీంతో గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంటువాసులు ఇక న్యాయపరంగా పోరాటమే శరణ్యమని హైకోర్టును ఆశ్రయించారు. అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచడంతో కోర్టు స్టేటస్కో ఇచ్చింది. ప్రస్తుతానికి వ్యవహారం అలా అక్కడే ఆగింది. గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌వాసుల వాదన ఏందంటే… గతంలో తాము అనుసరించినట్టుగా చెరువులోంచి రోడ్డు వేసేందుకు ప్రభుత్వపరంగా అనుమతులు, మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్తున్నారు.

సీన్-8
సాస్ సేవలో ‘రెరా’ పునీతం
రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, డెవలప్మెంట్ చట్టం (రెరా) నిర్మాణ సంస్థల ఉల్లంఘనలు, అరాచకం నుంచి సామాన్య కొనుగోలుదారులను రక్షించాలి. కానీ మన రెరా మాత్రం ‘మేము సైతం’ అంటూ సాస్ సేవలో పునీతమవుతున్నది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెరాలో రెండు ఫిర్యాదులున్నాయి. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి కావడంలేదని, ఇందుకు భూయజమానులు ఒక కారణంగా పేర్కొంటూ సాస్ ఐటవర్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ రెరాకు ఫిర్యాదు చేయగా రెరా చట్టం-2016లోని సెక్షన్ 31, 2017-34(1) కింద కేసు (71/2025) నమోదైంది. ఆతర్వాత రెరా సుమోటాగా మరో కేసు (208/2025) నమోదు చేసింది. మూడేండ్లలో పూర్తి కావాల్సిన సాస్ ఐటవర్ ఏడేండ్లకు కూడా పూర్తికాలేదని, ప్రధానంగా డెవలపర్ ప్రాజెక్టులోని స్పేస్ విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నందున ఇన్వెస్టర్లు (కొనుగోలుదారులు) తీవ్రంగా నష్టపోయే అవకాశమున్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రెరా చట్టంలోని సెక్షన్ 35(1) కింద కేసు నమోదు చేశారు. దీనిపై రెరాలో విస్తృతంగా వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. చివరికి రెరా 23.8.2025న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- అందులో ఇన్వెస్టర్లు, డెవలపర్, భూయజమానులకు అనేక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకుగాను ప్రాజెక్టు ప్రత్యేక ఖాతా తెరువాలని, ఇన్వెస్టర్ల ద్వారా వచ్చే మొత్తాన్ని అందులో ఉంచి 70 శాతం నిధులను కచ్చితంగా ప్రాజెక్టు పురోగతికి వెచ్చించాలని స్పష్టంచేసింది.
- డబ్బులు డ్రా చేయాలంటే ప్రాజెక్టు ఇంజినీర్, ఆర్కిటెక్చర్, చార్టర్డ్ అకౌంటెంట్ అనుమతులు ఉండాలని చెప్పింది. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి, ఆదాయ-వ్యయాలు రెరాతో పాటు అసోసియేషన్ ఆఫ్ అలాటీస్ (ఇన్వెస్టర్లకు) కూడా ఇవ్వాలని సూచించింది.
- విక్రయాల సమయంలో భూ యజమానులకు ఏడు రోజుల ముందు వాటికి సంబంధించిన నోటీసు ఇవ్వాలని, వారంలో వాళ్ల నుంచి అభ్యంతరాలుంటే స్వీకరించాలని, లేకపోతే అంగీకారంగా భావించాలని పేర్కొన్నది. భూయజమానులు చదరపు అడుగు ఎక్కువ ధరకు విక్రయిస్తే సరేగానీ తక్కువ ధరకు విక్రయించినప్పుడు, ఆస్తిపై హక్కుల బదలాయింపు జరిగే అవకాశం ఉంటే అభ్యంతరాలు చెప్పాలని రెరా స్పష్టంచేసింది.
- రెరా మధ్యంతర ఉత్తర్వులపై భూయజమానులకు అభ్యంతరం ఉండటంతో వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 24, సెప్టెంబర్ 25లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇందులోనూ భూయజమానులు, డెవలపర్స్‌కు సంబంధించి పలు ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా రెరాకు కూడా హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నా ఆ సంస్థ వాటిని అమలు చేయడంలేదని, సాస్ ఐటవర్ ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఉదాసీనంగా ఉన్నదనే ఆరోపణలున్నాయి. గతంలో అనేక ఫిర్యాదులు… స్వయానా రెరా సుమోటగా కేసు నమోదు వంటి పరిణామాలు ఉన్నప్పటికీ రెరా మాత్రం ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు పురోగతి, గతంలోని ఆదేశాలు వాటి అమలును పట్టించుకోవడంలేదని తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

