హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ టెస్టుకు హీరోలు కాకపోయినా తాను రెడీ అని, మీరు లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా..? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి నటుడు రాహుల్ రామకృష్ణ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రగ్స్ యాక్టివిటీ ఎక్కువ సినిమా పరిశ్రమలోనే జరుగుతుందని, స్టార్ హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారీ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
డ్రగ్స్ టెస్టులో క్లీన్‌చీట్ పొందితే హీరోల అభిమానులు కూడా డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉంటారని సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యల వీడియోను రాహుల్ రామకృష్ణ షేర్ చేసి.. డ్రగ్స్ టెస్టు అంశంలో వెంటనే జీవో జారీ చేస్తే అందరం కలిసి పరీక్షలు చేయించుకుందామని స్పష్టంచేశారు. సినిమా వాళ్లంతా డ్రగ్స్ టెస్టులు, మీరు లై డిటెక్టర్ టెస్టులు చేసుకుంటే.. ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం పెట్టుకుందామని సూచించారు. అప్పుడే ప్రజలు మీ మాటలు నమ్ముతారని చురకలు అంటించారు.