హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అ రుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బ్రాండ్ ‘హాల్స్’ సంస్థ.. సామాజిక సేవలో విశేష కృషిచేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని ‘వింటర్ హీరోస్’గా ఎంపికచేసింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో దేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా తెలంగాణవాసి గుర్రాల నాగరాజుకు చోటు ద క్కింది. 18 ఏండ్లుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి, సమాజసేవలో నిబద్ధతతో పనిచేస్తూ నాగరాజు అనేక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి ఆహారం పంపిణీ, అత్యవసర పరిస్థితుల్లో తెలుగు ప్రజలకు సహాయం చేయడం, పేదలు, అనాథలు, మానసిక వికలాంగులకు చే యూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల సాధికారత కోసం మహిళా కిట్ల పంపిణీ, పోలీస్ స్టేషన్లలో బ్లాంకెట్డ్రైవ్లు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయ కార్యక్రమాలు, అవయవదానంపై అవగాహన వంటి అనేక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం అందించారు. ప్రస్తుతం జేఎన్ఎస్ క్లౌడ్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకుడిగా, అప్లిఫ్ట్ ఏ చైల్డ్ సౌత్ ఆఫ్రికా డైరెక్టర్‌గా సేవలందిస్తూ సాంకేతిక రంగంలోనూ, సామాజిక సేవలోనూ నాగరాజు తనదైన ముద్ర వేస్తున్నారు. జగిత్యాల నేల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం.. నేడు అంతర్జాతీయ స్థాయిలో సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలువడం తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం.