గురుకులంలో భారీగా డ్రాపౌట్లు!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడేవారు. కానీ, కాంగ్రెస్ నిర్లక్ష్య విధానాలతో విద్యార్థుల డ్రాపౌట్ల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతున్నది. ఈ ఏడాది ఒక్క ఎస్సీ గురుకులాల్లోనే అడ్మిషన్ తీసుకున్నా దాదాపు 8వేల మంది విద్యార్థులు బడిలో చేరని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్ఏ-1 (సమ్మేటివ్ అసెస్మెంట్) పరీక్షల నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
- ఎస్సీ గురుకులంలో చేరని విద్యార్థుల సంఖ్య 8వేలు
- అడ్మిషన్ తీసుకున్నా రాని వైనం
- అన్ని గురుకులాల్లో ఇదే వైనం
- ఎస్ఏ-1 పరీక్షల్లో వెలుగులోకి..
- ఇంటర్, డిగ్రీలోనూ భారీగా ఖాళీ
- మరోవైపు సీట్ల కోసం ప్రదక్షిణలు
- ఇప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడేవారు. కానీ, కాంగ్రెస్ నిర్లక్ష్య విధానాలతో విద్యార్థుల డ్రాపౌట్ల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతున్నది. ఈ ఏడాది ఒక్క ఎస్సీ గురుకులాల్లోనే అడ్మిషన్ తీసుకున్నా దాదాపు 8వేల మంది విద్యార్థులు బడిలో చేరని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్ఏ-1 (సమ్మేటివ్ అసెస్మెంట్) పరీక్షల నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్తున్నారు.
సగటున ఒక్కో గురుకులంలో 40 మంది విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారని తెలుస్తున్నది. ఇంటర్, డిగ్రీ గురుకుల కళాశాలల్లోనూ భారీగా సీట్లు మిగిలిపోయాయి. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా రేవంత్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. మిగిలిన సీట్ల భర్తీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకొన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అన్నీ కలిపి దాదాపు 1,027 గురుకులాలు ఉన్నాయి. అందులో 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మైనారిటీ గురుకులాలు మినహాయించి ఇతర సొసైటీలకు సంబంధించి 643 గురుకులాల్లో 5వ తరగతిలో 51,924 సీట్లు ఉన్నాయి. ప్రతి ఏటా కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు అడ్మిషన్లను కల్పిస్తారు.
మిగిలిన తరగతుల్లో ఖాళీ అయ్యే సీట్లను బ్యాక్లాగ్ కింద ఆయా గురుకుల సొసైటీలే స్వతహాగా భర్తీ చేసుకుంటాయి. ఒక్కో గురుకులంలో సగటున 640 మంది విద్యార్థులు ఉండాలి. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలు అధ్వానంగా మారాయి. ప్రస్తుతం ఎస్ఏ-1 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక్క ఎస్సీ గురుకులాల్లోనే ఈ ఏడాది దాదాపు 8 వేల మంది గురుకుల విద్యార్థులు డ్రాపౌట్లుగా తేలినట్టు సమాచారం. సగటున ఒక్కో గురుకులంలో 20 నుంచి 40 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలుస్తున్నది. వారిలో అనారోగ్య కారణాలతో గైర్హాజరైన వారికంటే అడ్మిషన్ తీసుకుని, ఇంటికి వెళ్లి ఇప్పటికీ రాని విద్యార్థులే 80 శాతం మంది ఉన్నారని సమాచారం. ఓ గురుకులంలో ఏకంగా 120మంది విద్యార్థులు హాజరు కాకపోవడం గమనార్హం.
డ్రాపౌట్లపై పట్టింపేలేదు
సాధారణంగా గురుకులాల్లో చేరిన అనంతరం విద్యార్థులు రాకుంటే ఆ సంస్థ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు ఆరా తీస్తారు. కానీ, ఇప్పటికీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎస్సీ గురుకులాలే కాదు, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఇంటర్, డిగ్రీ గురుకుల కాలేజీల్లోనైతే పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని అంటున్నారు. డిగ్రీ గురుకుల కాలేజీల్లో 24 వేల సీట్లు అందుబాటులో ఉండగా, అందులో సగం కూడా నిండలేదని తెలుస్తున్నది. కొన్ని కాలేజీల్లో, గ్రూపుల్లో కేవలం ఒకరిద్దరు మాత్రమే చేరారు. ఇంటర్ కాలేజీల్లోనూ పరిస్థితి అదేవిధంగా ఉన్నదని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి.
గోప్యంగా ఖాళీలు.. దళారుల దందా
గురుకులాల్లో ఖాళీలన్నింటినీ గోప్యంగా ఉంచుతున్నారు. దళారుల దందాయే అందుకు కారణమని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒక్కో సీటుకు రూ.25 వేల నుంచి రూ.50 వేలకుపైగా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో గురుకులంలో మిగిలిన సీట్లను ఆయా సొసైటీలే రాష్ట్రస్థాయిలో ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండేవి. దరఖాస్తులను స్వీకరించి, మెరిట్ ప్రకారం బ్యాక్లాగ్ వేకెన్సీలన్నింటినీ భర్తీ చేస్తుండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది బ్యాక్లాగ్ సీట్ల భర్తీ బాధ్యతలను సొసైటీ ఉన్నతాధికారుల నుంచి తొలగించి జిల్లాల కలెక్టర్లకే అప్పగించింది. అనేక జిల్లాల్లో ఇప్పటికీ ఖాళీ సీట్ల భర్తీకి ఏ కలెక్టర్ కూడా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవనే తెలుస్తున్నది.
ఖాళీల వివరాలు ఎన్నిసార్లు అడిగినా చెప్పడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఖాళీలు అన్నిటిని గోప్యంగా ఉంచుతున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ పాఠశాలలో, ఏ తరగతిలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి? అనే వివరాలు స్పష్టంగా ప్రకటించడమే లేదు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల సిఫార్సులతోపాటు, కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ వసూళ్ల దందాకు తెరలేపారని తెలుస్తున్నది. సీటు ఇవ్వకుంటే ఆ గురుకుల ప్రిన్సిపాళ్లపైనే తీవ్ర ఒత్తిడి తేవడమే కాకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను వెల్లడించడమే లేదని వివరిస్తున్నాయి. అదీగాక మరోవైపు సీట్ల కోసం తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ తదితర జిల్లాల నుంచి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాలకు క్యూ కడుతున్న దుస్థితి నెలకొన్నది.
ఫుడ్‌పాయిజన్ కేసులూ కారణమే
విద్యార్థుల అప్లికేషన్లు గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా గురుకులాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్‌పాయిజన్ కేసులు, విద్యార్థుల మరణాలూ కారణమేనని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ రాకతో ప్రతి గురుకులంలో నిత్యం ఎక్కడో ఒకచోట, ఏదో ఘటన జరుగడం పరిపాటిగా మారింది. ఆహార కలుషితం, విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దే చర్యలు చేపట్టకపోవడంతోనే విద్యార్థులు జంకుతున్నారని విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. గురుకులాలపై ప్రభుత్వ పర్యవేక్షణే లేకుండాపోయింది. అందుకే విద్యార్థులు గురుకులం నుంచి ఇండ్ల బాట పడుతున్నారని విద్యావేత్తలు, గురుకుల ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు సైతం నొక్కిచెప్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ సత్వరం స్పందించాలని, నివారణా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

