Andhra Pradesh Elections | ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్.. ఎన్నికల ఘర్షణలతో రాష్ట్రం రణరంగం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
- 76.50% దాటిన పోలింగ్..
- అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత
- 11 కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసం
- తెనాలిలో లైన్లో రమ్మన్న వ్యక్తిని కొట్టిన అభ్యర్థి.. చెంప చెళ్లుమనిపించిన ఓటరు
- నరసరావుపేటలో పోలీసుల ఫైరింగ్
- తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై ఎటాక్
- ఉద్రిక్తతలపై ఎన్నికల సంఘం సీరియస్
Andhra Pradesh Elections | హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఓ చోట ఏకం గా రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఏ నియోజకవర్గమనే తేడా లేకుండా ఘర్షణలు జరిగాయి. ఘటనలపై టీడీపీ, వైసీపీ పోటీ పడి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఘర్షణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇరు పార్టీలను హెచ్చరించింది.
అంతటా రెండు పార్టీల వీరంగం
నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో అడ్డుకునేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. గజపతినగరం నియోజకవర్గంలోని కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ అధికారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెంలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేయడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. తర్వాత కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగించాల్సి వచ్చింది. పాయకరావుపేట నియోజకవర్గం కొత్తరేవు పోలవరం గ్రామంలో టీడీపీ-వైసీపీ శ్రేణులు కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. పల్నాడు రాజుపాలెం మండలం గణపవరంలో వైసీపీ నేత మర్రి సుబ్బారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు గౌతమ్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో పరిస్థితి అదుపుతప్పడంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైసీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి జరిగింది. హిందూపురంలో పరస్పర దాడులకు దిగారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు తగులబెట్టారు. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపై వైసీసీ నేతలు దాడికి దిగారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రిలో వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంపై దాడి చేశారు. దాడిలో 20మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఓటర్లు పోలింగ్ కేంద్రంలో తలదాచుకున్నారు. దాచేపల్లి మండలం ఇరికేపల్లి, నడికుడిలోనూ ఘర్షణలు జరిగాయి.
ఈసీకి ఫిర్యాదుల వెల్లువ
పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలపై టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. స్పందించిన ఈసీ పలు అంశాలపై తక్షణ చర్యలు తీసుకున్నది. పుంగనూరు ఘటనలో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి ఎలాంటి అనుమతి లేకుండానే వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్‌నకు గురయ్యారంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, వెంటనే పోలీసులను ఆదేశించగా వారు ఏజెంట్ల జాడ కనిపెట్టి తీసుకొచ్చారు. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓటరు స్లిప్పులపై వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్‌రెడ్డి ఫోటో ముద్రించడంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీకి మద్దతివ్వాలంటూ పోలీస్ అధికారులను అడుగుతున్నారంటూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం ఏపీ ఎన్నికలపై ప్రముఖ వ్యూహకర్త ఆర్టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడంపైనా వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ వ్యాప్తంగా 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి పోలింగ్‌ను కొనసాగించినట్లు తెలిపింది. పలు చోట్ల దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు.
పోలింగ్ 76.69 శాతం
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల వద్ద బారులు తీరారు. రాత్రి 6 తర్వాతా ఇదే పరిస్థితి కనిపించింది. ఎండా, వానను లెక్క చేయకుండా గంటల తరబడి క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌పై ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఆసక్తి చూపారు. 76.69 పోలింగ్ శాతం నమోదైనట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 79.35శాతం, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో 63.88శాతం పోలింగ్ శాతం నమోదైంది.
ఓటేసిన ప్రముఖులు
విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్‌హాల్ పోలింగ్ కేంద్రంలో ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి దంపతులు, పులివెందుల నియోజకవర్గ కేంద్రంలోని బాకరాపురంలో సీఎం జగన్, భారతి దంపతులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. రాజమహేంద్రవరంలోని వీఎల్‌పురంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఇడుపులపాయలో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాత్రి 10 దాకా ఓటింగ్
సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసేందుకు రాత్రి 10దాకా అవకాశం కల్పించారు. పలు నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణలపై ఎన్నికల సంఘానికి నివేదిస్తామని, ఆ నివేదిక ఆధారంగా ఎక్కడైనా రీ పోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారి మీనా తెలిపారు. తెనాలి, మాచర్ల, అనంతరపురంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయని, 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని తెలిపారు. మంగళవారం ఉదయం వరకు ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

