ఫాక్స్‌కాన్ గ్రూప్ ముందు ప్రకటించిన 150 మిలియన్ డాలర్లకు మరో 400 మిలియన్ డాలర్లు జోడించి మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడి వాగ్దానాన్ని నెరవేర్చుతున్నందుకు సంతోషం. ఇది తెలంగాణ వేగాన్ని, పెట్టుబడిదారుల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని రుజువు చేస్తున్నది.
– కేటీఆర్
Foxconn | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ (ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్ఐటీ) దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఓ వైపు నిర్మాణపనులు శరవేగంగా సాగుతుండగా, మరోవైపు కంపెనీ ముందు ప్రకటించిన విధంగానే మరో రూ.3,318 (400 మిలియన్ డాలర్లు) కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది. ఇది మొదలు ప్రకటించిన రూ.1,244 (150 మిలియన్ డాలర్లు) కోట్లకు అదనం. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ పెట్టుబడి రూ.4,562 (550 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరింది. 400 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడి ప్రణాళికను భారత్‌లో ఫాక్స్‌కాన్ ప్రతినిధి వీ లీ తాజాగా వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ ఫోన్ల సంస్థ యాపిల్‌కు ఫాక్స్‌కాన్ అతిపెద్ద సరఫరాదారు. మొబైల్ ఫోన్లు, యాపిల్‌కు సుమారు 70 శాతం ఉత్పత్తులను ఈ సంస్థే సరఫరా చేస్తున్నది. ఇటీవలే యాపిల్ ఐపాడ్, వైర్లెస్ ఇయర్ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్ సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏర్పాటుచేస్తున్న పరిశ్రమలో సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కొంగరకలాన్‌లో 196 ఎకరాల భూమిని వెంటనే కేటాయించడంతోపాటు అవసరమైన అనుమతులు మంజూరుచేసింది. మే 15వ తేదీన పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ఇప్పటికే ఫౌండేషన్ పూర్తయింది. ఈ ఏడాది మొదట్లో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై పెట్టుబడి ప్రణాళికపై చర్చించారు. ఈ పరిశ్రమలో 35 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
అదనంగా రూ.3,318 కోట్ల పెట్టుబడి: వీ లీ
తెలంగాణలో మరో 400 మిలియన్ డాలర్ల (రూ.3,318 కోట్లు) అదనపు పెట్టుబడికి ఫాక్స్‌కాన్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్టు వీ లీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు చేపట్టిన చాంగ్ యీ ఇంటర్నేషనల్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్స్చేంజీకి తెలిపినట్టు వెల్లడించారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో తెలంగాణ హవా
ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా రాష్ట్రం లో ఎలక్ట్రానిక్స్ రంగానికి కొత్త ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజ సంస్థలు వస్తే, వాటికి అనుబంధంగా అనేక యాన్సిలర్ యూనిట్లు ఏర్పాటవుతాయి. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీంతో తెలంగాణ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా మారే వీలు కలుగుతుంది. రానున్న పదేండ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
తెలంగాణ వేగానికి నిదర్శనం
ఫాక్స్‌కాన్ గ్రూపుతో మా స్నేహం స్థిరంగా ఉన్నది. ఇరువురం పరస్పర ఒప్పందాల ప్రకారం ముందుకు సాగుతున్నాం. తెలంగాణలో ముందు ప్రకటించిన 150 మిలియన్ డాలర్లకు మరో 400 మిలియన్ డాలర్లు జోడించి మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడి వాగ్దానాన్ని ఎఫ్ఐటీ నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్ర వేగాన్ని, పెట్టుబడిదారుల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని, రాష్ర్టాభివృద్ధిపట్ల ప్రభుత్వ నిబద్ధతను మరోసారి రుజువు చేస్తున్నది.
-మంత్రి కేటీఆర్.