శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 01:21:58

సమ్మెకాలానికి జీతాలు

సమ్మెకాలానికి జీతాలు
  • ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
  • 235 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • ఆర్టీసీ ఉద్యోగుల హర్షాతిరేకాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నది. ఉద్యోగులు ఆనందంగా ఉంటేనే సంస్థ లాభాల బాట పడుతుందనే ఆలోచనతో సమ్మెకాలపు జీతాల కోసం ఏకమొత్తంగా రూ.235 కోట్ల విడుదలకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. త్వరలోనే ఈ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమకానున్నది. దీంతో సీఎం కేసీఆర్‌ గత ఏడాది ఆర్టీసీ ఉద్యోగులతో జనహితలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీని నిలుపుకొన్నట్టయింది. ఉద్యోగుల సమ్మెకాలానికి సంబంధించిన రెండునెలల జీతం వస్తుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సంస్థను ఆదుకొనేందుకు ఇప్పటికే వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.


పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకొని..

సమ్మెకాలం జీతాల విడుదల పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఉద్యోగులు పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకొన్నారు. పలు డిపోల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆర్టీసీ క్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని సంస్థ ఉద్యోగులు కొనియాడారు. బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించడంతోపాటు సమ్మెకాలం జీతాన్ని మాట ప్రకారం విడుదలచేయడం సంతోషంగా ఉన్నదన్నారు. ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌ అండగా ఉన్నారని, ఇక యూనియన్లతో తమకు పనిలేదని, చిత్తశుద్ధితో పనిచేసి సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.


మంత్రి పువ్వాడ హర్షం

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకాలపు జీతాల విడుదలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆర్థికస్థితిని గాడిలో పెట్టడంతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదనే విషయం మరోమారు రుజువైందని చెప్పారు. సమ్మెకాలానికి సంబంధించిన జీతాలను ఒకేసారి విడుదలచేయడం సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుకు నిదర్శనమని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షల మేరకు ఆర్టీసీ అభ్యున్నతి కోసం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, పట్నం నరేందర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి కూడా ఉన్నారు.


logo