ఇన్సులిన్ ఇంజెక్షన్… వారానికోసారి!
టైప్ 2 డయాబెటిస్ రోగులకు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరమవుతుంది. ఈ దుస్థితి నుంచి సమీప భవిష్యత్తులో విముక్తి దొరకనుంది. వారంలో ఒక్కసారి తీసుకుంటే సరిపోయే ఇంజెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇన్సులిన్ ఐకోడెక్గా పిలిచే ఈ ఇంజెక్షన్లు సుదీర్ఘకాలంపాటు డయాబెటిస్ రోగులకు సాంత్వనను చేకూరుస్తాయి. క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ప్రభావం కనిపించడంతో ఇన్సులిన్ ఐకోడెక్ను అభివృద్ధి చేసిన సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నది. ఇక ఈ ఇంజెక్షన్ వారానికి ఒకసారి తీసుకున్నా రోజువారీ ఇంజెక్షన్లంత ప్రభావాన్నే చూపుతుందట. త్వరలోనే డయాబెటిస్ రోగులకు రోజువారీ ఇంజెక్షన్ల బాధ తప్పనుందన్నమాట!
బహిరంగ ప్రదేశాల్లో గుండెపోటుతో ఎవరో ఒకరు కుప్పకూలిపోయారనే వార్తలు రోజూ వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు అంబులెన్స్ అందుబాటులో లేకపోతే బాధితుడి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాపాయం సంభవిస్తుంది. దీనికి పరిష్కారమే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్ (ఏఈడీ). గుండె సాధారణ స్థాయిలో కొట్టుకోవడానికి డీఫైబ్రిలేటర్ ఉపకరిస్తుంది. గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)కు గురైనవారికి ప్రాణగండం తప్పడంలో వీటిపాత్ర కీలకమని డెన్మార్క్ దేశం చేసిన పరిశోధనలో వెల్లడైంది. కమ్యూనిటీ సెంటర్లు, వ్యాయామశాలలు, విమానాశ్రయాల్లో ఏఈడీలు ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరి. కానీ అన్నిచోట్లా ఇవి అందుబాటులో ఉండవు. అయితే, యాభై వేలు మొదలుకుని రెండు లక్షల రూపాయల వరకు ఉండే ఏఈడీలను ఉమ్మడిగా కొనుక్కుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
మంచి ఫిట్నెస్తో ఉన్నవాళ్లు చక్కెరలు అధికంగా ఉన్న రంగురంగుల పానీయాలు తాగుతూ ఉల్లాసంగా కనిపించే వ్యాపార ప్రకటనలు మనకు బాగా పరిచయమే. కానీ, వ్యాయామం చేసినంత మాత్రాన అధిక చక్కెరలు ఉన్న పానీయాలు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామం తప్పనిసరి. అయినప్పటికీ వారంలో రెండుసార్లకు మించి చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలు సేవిస్తే మాత్రం వ్యాయామంతో సంబంధం లేకుండా గుండె రక్తనాళాల వ్యాధి ముప్పు ఎక్కువేనట. ఈ పరిశోధన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించింది.