Toys and Tales | చిన్నపిల్లలు ఏడ్చిన ప్రతీసారి ఆకలేస్తుందనే అనుకోవడానికి వీల్లేదు.. అమ్మ కోసమో, బొమ్మ కోసమో కావచ్చు. అమ్మ నీడైతే, బొమ్మ తోడు! ఆడొచ్చు, పాడొచ్చు. కోపం వస్తే విసిరేయొచ్చు. అలా అని అమ్మానాన్నలు కనిపించిన వస్తువులన్నీ పడేసి ‘ఇదే బొమ్మ! ఆడుకో’ అంటే మాత్రం కుదర్దు. బొమ్మంటే బొమ్మలానే ఉండాలి. ఆ పసివాడు డైరెక్టర్ అయితే, ఆ బొమ్మ ఓ పాత్ర. చెప్పినట్టు ఆడాలి. ప్యాకప్ చెప్పేయగానే డబ్బాలోకి వెళ్లిపోవాలి. అలాంటి అందమైన, ఆకర్షణీయమైన బొమ్మలను అద్దెకిచ్చేవాళ్లూ ఉన్నారు!
చిన్న పిల్లలకు బొమ్మలే ప్రపంచం. ఆడుకున్నంత సేపూ ఆడుకుంటారు. అంతలోనే ఏడుపు మొదలు పెడతారు. సరిగ్గా ఆ సమయంలోనే చేతికి ఓ కొత్త బొమ్మ ఇస్తే సరిపోతుంది. అంతే, ఆ కొద్దిసేపు అమ్మనూ సైతం మరిచిపోతారు. గమ్మున ఆడుకుంటారు. కానీ, ఇక్కడో చిక్కు ఉంది. ప్రతిసారీ కొత్తకొత్త బొమ్మలంటే కష్టమే. బడ్జెట్ సమస్య. ఇంట్లో జాగా సమస్య. అందులోనూ బొమ్మల ధరలు పెరిగిపోయాయి. కొత్త బొమ్మ కొనకుండానే, పిల్లల ఏడుపు ఆపడానికి ఒకటే దారి.. అద్దె బొమ్మలు! అందమైన అద్దె బొమ్మలను అందించే ‘టాయ్స్ అండ్ టేల్స్’ హైదరాబాద్లోనే ఉన్నది.
టాయ్స్ అండ్ టేల్స్.. అద్దెకు ఆట వస్తువులను అందించే దుకాణం. నిర్వాహకుల పేర్లు త్రిష, హర్ష. ముద్దు బిడ్డ మూడేండ్ల పృథ్వీ కోసం అమెరికా నుంచి ఖరీదైన బొమ్మను ఆర్డర్ చేశారు. మూడు నెలలు పట్టింది రావడానికి. ఆలస్యమైనా పిల్లాడు సంతోషిస్తాడని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. పృథ్వీ ఓ ఐదు నిమిషాలు ఆడుకున్నాడంతే. తర్వాత దాన్ని ఓ మూలకు విసిరేశాడు. అసలే ఖరీదైన బొమ్మ. బిడ్డ కండ్లలో సంతోషం చూడలేకపోయామనే నిరాశ. ఎలాంటి బొమ్మలు నచ్చుతాయా అని ఆలోచించారు. బొమ్మల గురించి ఓ మోస్తరు పరిశోధన మొదలుపెట్టారు. తమలా ఎవరూ ఆందోళన చెందొద్దనే ఉద్దేశంతో ఏకంగా పిల్లల అద్దె బొమ్మల దుకాణం ప్రారంభించారు. టాయ్స్ అండ్ టేల్స్ను ఎంచుకోవడం వెనక మరో పెద్ద కారణమూ ఉన్నది. పాత బొమ్మలను పారేయడం ద్వారా మనం ప్రకృతికి కొంత విఘాతం కల్పిస్తున్నాం. అద్దె బొమ్మలు ఈ సంక్షోభానికి ఓ పరిష్కారం. అద్దెకు తీసుకెళ్తారు కాబట్టి, వాటి నిర్వహణ విషయంలో పిల్లలు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. దీంతో బాధ్యత తెలిసి వస్తుంది. మన నుంచి ఆర్డర్ వెళ్లగానే.. పర్యావరణ హితమైన ఇ- వెహికిల్స్లోనే బొమ్మలను పంపుతారు. ఇక్కడ అద్దెకిచ్చే బొమ్మల తయారీలో సాధ్యమైనంత వరకూ హానికర రసాయనాలు వాడరు. బొమ్మ ధరను బట్టి అద్దెలు ఉంటాయి.
త్రిష, హర్ష దంపతుల దృష్టిలో బొమ్మలను అద్దెకు ఇవ్వడం కేవలం వ్యాపారం కాదు. పిల్లల మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. ఏదో ఓ బొమ్మను ముందు పడేసి ‘దీంతోనే ఆడుకో’ అని పిల్లలను బలవంతం చేయలేం. ఏది ఇష్టమైతే అదే చేస్తారు వాళ్లు. కానీ ఎదిగే క్రమంలో బొమ్మల పాత్ర కూడా కీలకమైందే. మానసిక, శారీరక అభివృద్ధిలో భాగంగా ఏ వయసులో చేయాల్సిన పనిని ఆ వయసులో చేసుకునే అవకాశం కల్పించడమే మనం వాళ్లకిచ్చే అమూల్యమైన కానుక. పిల్లలకు ఆహారం ఎంత ముఖ్యమో, ఉల్లాసమూ అంతే అవసరం. ఉల్లాసం ఒక్క ఆటలోనే దొరుకుతుంది. చిన్న పిల్లలు ‘ఆడుకుంటాం’ అనగానే చాలామంది తల్లిదండ్రులు ముఖం తిప్పేసుకుంటారు. ఈ ధోరణి మారాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు కూడా ఆటల పట్ల అవగాహన కల్పిస్తున్నారు త్రిష, హర్ష. ‘బొమ్మలు అద్దెకు ఇస్తాం’ అని ప్రకటించిన తొలినాళ్లలో వీరి ప్రయత్నాన్ని తప్పుపట్టినవాళ్లూ ఉన్నారు. అవేవీ పట్టించుకోకుండా హైదరాబాద్లోని పంజాగుట్ట కేంద్రంగా టాయ్స్ అండ్ టేల్స్ను విజయవంతంగా నడిపిస్తున్నారు.
“చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే.. వీటిని ఇలా గుర్తించొచ్చు”
“బిడ్డకు సర్ది అయ్యిందా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!”
children crying | పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?”
“పిల్లలను ఎప్పుడు స్కూల్కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..”