పడమటి కనుమల్లో పచ్చల పతకంలా ఉండే మలబారు తీరం వానకాలం వచ్చిందంటే మరింత మెరిసిపోతుంది. అందులోనూ.. ఆగస్టు నెలలో ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ సమయంలోనే తనకే ప్రత్యేకమైన కొన్ని వేడుకలకు కేరళ రాష్ట్రం వేదికగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెహ్రూ ట్రోఫీ బోట్రేస్తోపాటు కేరళ సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ‘అథాచమయం’ వేడుకకు మలబారు తీరం ముస్తాబవుతున్నది. మరెందుకు ఆలస్యం! వెంటనే బ్యాక్‌ప్యాక్ సర్దేయండి. రెక్కలు కట్టుకొని మలయాళసీమలో వాలిపోండి.
కేరళలో జరిగే పడవ పందేలు.. కనువిందు చేస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్’తోపాటు అనేక చిన్నాచితకా బోట్‌రేస్‌లు కూడా ఆగస్టులోనే జరుగుతాయి. అలెప్పీ సమీపంలోని పున్నమడ సరస్సులో జరిగే ఈ సంప్రదాయ పడవ పందెం చూసేందుకు వేలాది మంది స్థానికులు, పర్యాటకులు పోటెత్తుతారు. దేశ విదేశాల్లో స్థిరపడిన స్థానికులు ఈ వేళకు స్వస్థలాలకు తరలివస్తారు. పెద్దపెద్ద వ్యాపారాలు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారూ.. సంప్రదాయాన్ని పాటిస్తూ బోట్రేస్లోకి దిగుతారు. అయితే.. ఈ పందెం కేవలం క్రీడ మాత్రమే కాదు… కేరళ సంప్రదాయానికి ప్రతీక కూడా! ఈ ఏడాది ఆగస్టు 30న బోట్ రేస్ జరనగుంది.
కేరళవాసుల సంవత్సరాది ఓనం. ఈ పండుగ ప్రారంభానికి గుర్తుగా.. ఎర్నాకుళంలోని త్రిపుణితురలో ‘అథచామయం’ అని పిలిచే సంప్రదాయ వేడుకను నిర్వహిస్తారు. ఘనమైన కేరళ సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కట్టే ఈ ఊరేగింపు.. పది రోజులపాటు ఎంతో ఉత్సాహభరితంగా సాగుతుంది. అందంగా అలంకరించిన ఏనుగులు, కథకళి, తెయ్యం లాంటి సాంప్రదాయ కళారూపాలు, వివిధ ఇతివృత్తాలను వర్ణించే ప్రదర్శనలతో.. ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారిపోతుంది. ఈ సంబురాలకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు పోటెత్తుతారు. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటివారంలో ఈ వేడుక సాగనున్నది.