మునుపటి స్థితిలోకి వచ్చిన ఆ ఏడు చిన్న పెట్టెల్లో మొదటి పెట్టెపై మళ్లీ అక్షరాలు కనిపించాయి. దాన్ని డిటెక్టివ్ రుద్ర తీక్షణంగా చదవడం ప్రారంభించాడు. ‘నవ రత్నాల గురించి వినే ఉంటారు. అందులో ఏడు రత్నాలు ఈ ఏడు పెట్టెల్లో దాగున్నాయి. ఒక్కో పెట్టెలో ఒక్కో రత్నం ఉందన్నట్టు. అయితే, మొదటి పెట్టెలోని రత్నాన్ని దక్కించుకోవాలంటే, పెట్టె మీద రాసి ఉన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని పెట్టె ముందుకు వచ్చి చెప్పాలి’ అని చదువుతూ పోయాడు రుద్ర.
ఇంకా ‘సమాధానం సరైంది అయితే, శబ్ద బంధనం వేసిన ఆ మొదటి పెట్టె తెరుచుకొని అందులోని రత్నం మీ సొంతం అవుతుంది. అలా మీ సొంతమైన రత్నాన్ని రెండో పెట్టె మీద ఉంచితే, అప్పుడు ఆ పెట్టెపై మరో ప్రశ్న కనిపిస్తుంది. దానికి సరైన సమాధానం చెప్తేనే, ఆ రెండో పెట్టె తెరుచుకుంటుంది. అందులోని మరో రత్నంతో మూడో పెట్టెకు కూడా ఇలాగే చేయాలి. అలా 7 పెట్టెలను తెరిచి 7 రత్నాలను సంపాదించాక.. వాటిని ఒక దగ్గరకు చేరిస్తే, వాటి నుంచి మరో రెండు రత్నాలు ఉద్భవిస్తాయి. అలా వచ్చిన నవ రత్నాలను ఒకదగ్గర చేర్చగానే అది ఓ బృహత్తర మణిగా మారుతుంది. ఆ మణిని ఈ భారీ పెట్టె ముందరి భాగంలో ఉంచి.. ఆ మణిపై సూర్యకాంతి పడేలా చేస్తే, అప్పుడు ఈ భారీ పెట్టె మర్మం ఏమిటో, దీన్ని ఎవరు? ఎందుకు? సిద్ధం చేశారోనన్న విషయం బయటపడుతుంది. ఈ ప్రక్రియంతా 70 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. ప్రయత్నం వికటిస్తే, మొత్తం నాశనం అవుతుంది. ప్రక్రియను ప్రారంభించడానికి మొదటి పెట్టెను మూడు సార్లు చేయితో తడమండి’ అని రాసి ఉంది. దాన్ని చదివిన రుద్రకు ఏం చేయాలో తెలియలేదు.
అక్కడే ఇదంతా గమనిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామస్వామి.. ‘సార్.. ఇదంతా ఏంటీ? ద్వాపరయుగం నాటి ఈ పెట్టెలో కూడా ఇలాంటి పజిల్స్, గేమ్స్, శబ్ద బంధనాలు, డెడ్లైన్లు ఉండటం ఏంటీ? ఇదంతా ఎవరో మనల్ని తప్పుదోవ పట్టించేందుకే చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అనవసరంగా మనం శ్రమ పడిపోతున్నాం’ అంటూ ఆయాసపడుతూ అన్నాడు. ఇంతలో కలుగజేసుకొన్న ఆర్కియాలజీ టీమ్ హెడ్ ధరణి.. ‘లేదు సార్.. మీరు పొరబడుతున్నారు. ఈ పెట్టె ద్వాపర యుగం-కలియుగం మధ్యనాటిదని మా పరిశోధనల్లో తేలింది. మరోవిషయం.. దీనిపై ఇలాంటి పజిల్స్, శబ్ద బంధనాలు ఇప్పటి మామూలు మనుషులు చేసే ఆస్కారం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే, దాదాపు 5 వేల ఏండ్ల క్రితం ఈ పెట్టెను మూసేసినట్టు మా టీమ్ అంచనా వేస్తోంది’ అంటూ ధరణి ఇంకా ఏదో చెప్పబోతుండగా.. మధ్యలో కలుగజేసుకొన్న రుద్ర కజిన్ స్నేహిల్.. ‘అసలు ఈ పెట్టె ద్వారా ఏం ప్రయోజనం దొరుకుతుందని మీరు అనుకొంటున్నారు?’ అని ధరణిని సూటిగా ప్రశ్నించాడు. మధ్యలో కలుగజేసుకొన్న ఎథికల్ హ్యాకర్ హరిశ్వ.. ‘కార్తికేయ మూవీలో చూపించినట్టు శ్రీకృష్ణుడి కాలికి ఉండే కంకణంలో ఎన్నో వైరస్‌లకు వ్యాక్సిన్ల గురించి రాసినట్టు ఈ పెట్టె ద్వారా అలాంటిది ఏదో దొరుకుతుందని మాత్రం చెప్పొద్దు’ అంటూ నవ్వాడు. స్నేహిల్, రామస్వామి జతకలిశారు. కంటి చూపుతోనే వాళ్లపై కొంచెం కోపాన్ని ప్రదర్శించిన రుద్ర.. ఇప్పుడు ఏం చేద్దామంటూ ధరణిని అడిగాడు.
‘మీరే చెప్పాలి రుద్ర సార్. ఈ పజిల్లో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయో తెలియదు. వాటికి సమాధానాలు ఇచ్చే స్థాయి కూడా మనకు ఉందో లేదో అంచనాకు రాలేకపోతున్నా. మీ నిర్ణయమే మా నిర్ణయం’ అంటూ ధరణి నిస్సహాయంగా చెప్పింది. తన పక్కనున్న ఫోరెన్సిక్ ఇంచార్జీ జయ, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కరణ్‌ను ఒకసారి చూశాడు రుద్ర. ప్రయత్నిద్దాం అన్నట్టుగా వారి చూపు ఉన్నది. అయితే, రామస్వామి, స్నేహిల్, హరిశ్వతో పాటు ధరణి టీమ్ మెంబర్స్ శివ, రుత్విక్, శ్రియాన్ష్ కూడా వద్దన్నట్టు ముఖం పెట్టారు. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన రుద్ర.. ఊపిరిని పీల్చి వదిలాడు. పజిల్‌కు సిద్ధపడుతున్నట్టు ధరణికి చెప్పాడు. నీకు మేమున్నామన్నట్టు జయ, కరణ్ చూపులతోనే రుద్రకు సపోర్ట్ ఇచ్చారు. చేసేదేమి లేక నిట్టూరుస్తూ.. ‘మీ వెంటే మేము’ అని మిగతావారు నోరు కలిపారు.
మొదటి పెట్టెను చేతితో రుద్ర మూడు సార్లు తడిమాడు. అంతే, ఓ ప్రశ్న కనిపించింది. “తండ్రీ-కొడుకులు పొలానికి వెళ్లారు. అత్తా-కోడళ్లు భోజనం తీసుకువెళ్లి.. ఎవరి నాన్నకు వాళ్లు అన్నం పెట్టారు. ఇది ఎలా సాధ్యం??’ పది నిమిషాల్లో సరైన సమాధానం చెప్పాలి. లేకపోతే, ఈ పెట్టె నుంచి వచ్చే భీకర శబ్దంతో మీ కపాలాలు ఛిద్రమైపోతాయి. ఇది తథ్యం’ అని రాసి ఉంది. అది చదవగానే.. రామస్వామి భయపడుతూ.. ‘సార్.. నేను ముందే చెప్పాను ఇలాంటిదేదో జరుగుతుందని! ఇప్పుడు చూడండి మధ్యలో ఇరుక్కుపోయాం. ఇదంతా ప్రీప్లాన్డ్. ప్రయత్నం వికటిస్తే, మొత్తం నాశనం అవుతుంది అని ముందు చెప్పారు. పెట్టె నాశనం అవుతుంది అని నేను అనుకొన్నా. ఇప్పుడు మన కపాలాలు పేలిపోతాయట. ఛిద్రమవుతాయట!’ అంటూ రామస్వామి కంగారుపడుతుంటే, అతన్ని నిలువరించిన రుద్ర.. మొదటి పెట్టె దగ్గరకు వెళ్లి ఒకటి చెప్పాడు. ఆశ్చర్యం. అదే సరైన సమాధానం. అంతే, మొదటి పెట్టె తెరుచుకొని అందులో ‘గోమేధికం’ కనిపించింది. దాని వెలుగు చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. అది పక్కనబెడితే, రుద్ర ఇచ్చిన సమాధానమేంటో మీరు కనిపెట్టారా?
సమాధానం : తాత, తండ్రి, కూతురు, మేనత్త.