పలుకుబడులు
తీట ఉన్నోనికి.. తోట ఉన్నోనికి తీరిక ఉండదు
చెడు తిరుగుళ్లు తిరిగేవారిని, నిత్యం కష్టించి పనిచేసే వారిని పోలుస్తూ చెప్పిన సామెత ఇది. తీట ఉన్నోళ్ల కాళ్లు, చేతులు అస్సలు ఆగవు. పక్కనున్న వారిని ఏదో ఒకటి అంటూనో, గిల్లుతూనో, గిచ్చుతూనో ఉంటారు. ఆ తీటపనులతో రోజుకొకరితో గొడవ పెట్టుకుంటారు. కయ్యంపెట్టుకొని తీట తీర్చుకోనిది వీరికి నిద్రేపట్టదు. ఇక మిరప లాంటి ఏ తోట పని మొదలుపెట్టినా క్షణం తీరిక ఉండదు. మొక్కనాటిన దగ్గర్నుంచి.. కలుపులు, పురుగు మందులు, గుంటుక తోలడం, నీరు పెట్టడం, పంట చేతికొచ్చే వరకూ కంటికి రెప్పలా కాపాడుకోవడం.. కోతలు, కుప్పలు, మార్కెటింగ్ వరకూ పనిచేస్తూనే ఉండాలి. ఇలాంటిదే మరో సామెత ‘తిరిగే కాలు ఆగదు.. పెట్టే చెయ్యి ఆగదు/తినే నోరు ఆగదు’. ఇలా అనుభవపూర్వకంగా ఎన్నో సామెతలు చెప్పారు జానపదులు.
అగ్గిల చెయ్యిపెట్టినట్లు

‘ఏం కొందామన్నా.. ఏం తిందామన్నా.. అగ్గిల చెయ్యిపెట్టినట్లే ఉంది. పెట్రోలైతే మస్తు పిరమై భగ్గుమంటున్నది’ అనే పదబంధం పెరిగిన ధరలను సూచిస్తుంది. ఇందులో ‘అగ్గిల చెయ్యిపెట్టినట్లు’ అంటే కొందామనుకున్న వస్తువు ధర అమాంతం పెరిగినా.. కష్టమైనా నష్టమైనా కావాల్సిన వస్తువును కొనాల్సిన దుస్థితి. అంటే పెరిగిన వస్తువు ధరను అగ్గితో పోల్చడం. ధరల పెరుగుదల అన్ని కాలాల్లోనూ నామ మాత్రంగానే ఉన్నా… గత మూడేండ్ల నుంచీ అన్ని వస్తువులూ మూడింతలు పెరిగిగాయి. ఇక పెట్రోల్, డీజిల్, నూనె వంటి నిత్యావసరాలైతే అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుతో కొనుగోలు శక్తి తగ్గినా.. నిత్యావసరాల ధరలు మాత్రం మస్తు పిరం అవుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించమని రోడ్లెక్కినా మోదీ ప్రభుత్వ తీరు ‘దున్నపోతుమీద వాన పడ్డట్లు’ అన్న చందంగా ఉంది.
ఏడు ఎద్దులోడు.. మూడెద్దులోడి దగ్గర పాలేరైనట్టు

చేతిలో ఉన్న వనరులను సరిగా వాడుకోవడం తెలియని అసమర్థులను ఉద్దేశించిన సామెత ఇది. వ్యవసాయ సంబంధమైనదే అయినా.. అన్ని రంగాలకూ, అన్ని కాలాలకూ అన్వయించుకోవచ్చు. కొంతమంది దగ్గర అపారమైన వనరులు ఉంటాయి. అయితే, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. దీంతో తమకంటే చిన్నవారి దగ్గర, తక్కువ వనరులున్న వారి దగ్గర పనిచేస్తుంటారు. అలాంటి పరిస్థితిని పెద్దలెవరైనా గమనిస్తే.. ‘ఏడు ఎద్దులోడు.. మూడెద్దులోడి దగ్గర పాలేరైనట్టు.. నీ దగ్గర ఇంత సరుకుపెట్టుకొని వాడి దగ్గర పనిచెయ్యడం ఏందిరా?’ అని మందలిస్తుంటారు. నిజమే, తెలివి ఎవరబ్బ సొత్తూ కాదు. ‘ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు’ అని కూడా వివరణాత్మకంగా చెప్పారు పెద్దలు.
అర్థ వివరణ

కడుపునిండ మాట్లాడుకొనుడు = మనస్ఫూర్తిగా/ తనివితీరా మాట్లాడుకోవడం (మా యారాలు రాకరాక ఇంటికొస్తే.. ఊరినాటి ముచ్చట్లన్నీ కడుపునిండా ట్లాడుకున్నం)
పేర్నాలవెట్టుడు = మారుపేర్లు పెట్టి హేళన చేయడం (పేర్నాలవెట్టుడులో రాజయ్య తాత తోపు)
మొకం తెలివి = తలెత్తుకొని తిరగడం (మా చిన్నోడు కొలువు తెచ్చుకోవడంతో.. మా అయ్యకు నలుగురిలో మొకం తెలివైంది)
మంచంనేసుడు = మంచం వదలకపోవడం/ రోగంతో మంచానికే పరిమితం కావడం (మా ముసలోడు వారంసంది మంచంనేసిండు.. ఎప్పుడు బాగయితడో ఏమో..)
నోట్లెపండు = తలలో నాలుకలా (బిడ్డా ఏ పనిజేసినా నలుగురికి ఉపయోగపడాలె. అందరికీ నువ్వు నోట్లెపండులా ఉండాలె)
-డప్పు రవి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

