ఆట.. పాట… తెలంగాణ ప్రజల సాంస్కృతిక జీవనాడి, జీవధాతువు. ఇక్కడి ప్రజల భాష, యాస మరొక మేలిమి గుర్తింపు. ఇక్కడి కవులు, రచయితలు తమ రచనల్లో తమ భాషను, సంస్కృతిని అక్షరమక్షరాన నిక్షిప్తం చేశారు. చేస్తూనే ఉన్నారు. మహాకవి డా.సి.నారాయణ రెడ్డి ప్రౌఢ గేయ రచనలో తనకు తానే సాటి. కొన్నిసార్లు జానపద గీతాల ఒరవడిలో తనదైన శైలిలో రచనలు చేస్తే, మరికొన్నిసార్లు తాను తన బాల్యంలో విన్న పాటల పల్లవులను, వివిధ సినీ గీతాలలో పొందుపరిచారు… బంగారానికి తావిలాగా ఆయా పల్లవులు ఆ గీతాలకు అందాన్ని తెచ్చాయి.
ఈ కోవలోనే ఇప్పటికీ వినిపించే ఒక అందమైన గీతం ‘గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడీ’ గురించి చెప్పొచ్చు. ఒకనాడు సినారెకు దర్శకుడు బాపు ఫోన్ చేసి తమ కొత్త సినిమా ‘ముత్యాల ముగ్గు’ కోసం రెండు గీతాలను రాయమని చెప్పి, అందుకు కొన్ని సూచనలు, షరతులను చెప్పారట. ఇందులోని కథానాయకుడు ఉన్నత విద్యావంతుడు, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. నాయిక ఒక పల్లెటూరి పడుచు. కొత్తగా పెండ్లయిన ఈ జంట ఒక రోజంతా గడిపిన క్షణాలను యుగళగీతంగా మలచాలన్నది బాపు ఆకాంక్ష. నాయికా నాయకుల అంతస్తులు, చదువు తదితరాల్లో తేడాలు ఉండటంతో గీతాన్ని కూడా వారి కోవలోనే రాయాలన్నది వీరు పెట్టిన మరో పరిమితి. లయబ్రహ్మ సినారె తన గీతాన్ని ఆ కోవలోనే కూర్చారు. వెంటనే తన బాల్యంలో విన్న జానపద గీతం పల్లవి స్మృతిపథంలో మెదలగానే పాట సిట్టింగ్లో కూర్చున్న దర్శకనిర్మాతలకు వినిపించగా అది అక్కడున్న వారందరికీ బాగా నచ్చిందట. అది….
‘గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడీ
గోగులు దులుప ఎవ్వరు లేరు ఓ లచ్చ గుమ్మాడీ’ ఈ పంక్తులను సినారె కింది విధంగా కొద్ది మార్పులతో తన పాటలో ప్రయోగించారు.
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడీ
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడీ
ఓ లచ్చ గుమ్మాడీ ఓ లచ్చ గుమ్మాడీ
ఇది చిత్ర సందర్భంలో పొలాల్లో కర్షక స్త్రీలు నాట్లేస్తూ పాడే పాట. దీనిని వినగానే ఆ పల్లెటూరి కథా నాయిక వెంటనే అదే రీతిలో
‘పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చా గుమ్మాడీ’ అని పాడుతుంది.
బాపురమణలు కోరింది ఇదే కదా! నాయికకు తెలిసిన భాష, తెలిసిన యాసలో పాడటం అనేది ఔచిత్యమే కదా. దర్శకులు, కవి ఆయా రంగాల్లో అగ్రేసరులు… అన్నిటికీ మించి ‘కవిసమయాలు’ సందర్భాలు తెలిసినవాళ్లు. అందుకే ఇంత ‘రామసక్కని’ గీతం వచ్చింది. ఇందులోని ‘లచ్చాగుమ్మడి’ పదం గురించి వివరిస్తూ “లచ్చగుమ్మడి” అంటే “రాచగుమ్మడి” అన్నమాట. ‘రా’ ‘ల’గా మారి దీర్ఘ లోపం వల్ల ‘చ’ వర్ణానికి ద్విత్వమొచ్చి ‘లచ్చ’గా మారింది” అంటారు సినారె. పై పాదాల్లో నాయిక తెలతెలవారిందని, పసిడి మెరుగులు మెరుస్తున్నాయని చెబుతుంది. నాయకుడు నాయిక పలికిన ‘పొద్దు పొడిచె’లోని ‘పొద్దు’ను స్వీకరించి వెంటనే ఇలా అంటాడు.
‘పొద్దు కాదది నీ ముద్దు మోమున
దిద్దిన కుంకుమ తిలకమే సుమా!
వెలుగులు కావవి నీ పాదాలకు
అలదిన పారాణి జిలుగులే సుమా!’
నాయిక చదువుకోని పల్లెటూరి స్త్రీ కదా! అందుకే తాను విన్న జానపదుల బాణీలో పాడితే, ఆమె పేర్కొన్న పొద్దును మామూలు పొద్దు కాదని, అది ‘కుంకుమ తిలకం’ అంటాడు నాయకుడు ప్రౌఢంగా చెబుతాడు. ఇంకా వెలుగుతున్న ఆ వెలుగులన్నీ కొత్త పెండ్లికూతురైన తన నాయిక పాదాలకు అలదిన ‘పారాణి జిలుగులు’ అంటాడు. తాను మొదట పాడిన పల్లవి కోవలోనే మరో పల్లవి పాడుతుంది నాయిక. అది
‘ముంగిట వేసిన ముగ్గులు చూడు
/ ఓ లచ్చా గుమ్మాడీ
ముత్యాల ముగ్గులు చూడు/
ఓ లచ్చా గుమ్మాడీ’
హనీమూన్ సమయంలో నాయికా నాయకులు బస చేసిన అతిథి గృహం ముందు వేసిన ముగ్గులను చూపిస్తూ పాడుతుంది నాయిక. సినిమా పేరు ‘ముత్యాలముగ్గు’. ఈ పల్లవిలో ఆ పదం వచ్చేట్టు రాశారు సినారె. సమాధానంగా మొదటి పల్లవిలోని తొలి పదం స్వీకరించి పాడినట్టుగానే ‘ముంగిలి’ పదాన్ని ఎత్తుకొని పాడుతాడు నాయకుడు ఇక్కడ కూడా.
‘ముంగిలి కాదది నీ అడుగులలో
పొంగిన పాల కడలియే సుమా
ముగ్గులు కావవి నా అంతరంగాన
పూచిన రంగవల్లులే సుమా’
నాయిక మొదట చెప్పినట్టు ఆ ముగ్గులన్నీ ముత్యాల ముగ్గులు. తెల్లగా మెరుస్తున్నాయి. తన నాయిక, ప్రియతమ ముగ్గులు వేస్తే అక్కడంతా పాల సముద్రంగా మారిందట. ఆ ముగ్గులు నాయకుని అంతరంగాన విరిసిన రంగుల రంగవల్లులుగా మారిపోయాయట! ఎంత చక్కని ఊహ కవిది. తనదైన శైలిలో నాయిక మళ్లీ ‘మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చా గుమ్మాడీ/ వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చా గుమ్మాడీ’ నాయికతో చెప్పిస్తాడు. సరళ సుందరంగా పూచే మల్లెలను, కాచే వెన్నెలను వస్తువులుగా నాయిక స్వీకరిస్తే, నాయకుడు ఇలా అంటాడు.
మల్లెలు కావవి నా మహలక్ష్మి
విరజల్లిన సిరినవ్వులే సుమా
వెన్నెల కాదది వేళ తెలిసిన
ఆ జాబిలి వేసిన పానుపే సుమా
ఆ లక్ష్మిని తన గృహలక్ష్మిగా సంభావిస్తాడు నాయకుడు. సినారె సినీ గీతాలన్నీ అలంకార శోభితాలుగా, అద్భుత పద సౌందర్య దీపికలుగా విరాజిల్లడం మనకు తెలుసు. అయితే ఈ గీతమంతా పాటై పల్లవించిన ప్రకృతి మనకు కనిపించడం విశేషం. సినారె అన్నట్టు “జానపద గేయసరళిని, గజల్ గీతరీతిని మేళవించుకున్న” పాట ఇది. జయహో! సినారె!!
– పత్తిపాక మోహన్