మా చుట్టాలోళ్లు సూరత్‌ల ఉంటరు టీచర్! వాండ్లకు అక్కడ బట్టలు చీప్ల దొరుకుతయట
సుమారు ఏడెనిమిదేళ్ల పాటు నేను ట్యూషన్స్ చెప్పిన కాలంలో అరవైమందికి పైగా పిల్లలు నా దగ్గర చదువుకున్నారు. వాళ్లతో ఎన్నెన్నో సంతోషకరమైన అనుభవాలను మూటకట్టుకున్నాను. అప్పుడు చుట్టుపక్కల ఊర్లల్లో పనిచేసే గ్రామ కార్యదర్శులను వీఎల్డబ్ల్యూలు అనేవారు. వాళ్లంతా మా ఊర్లోనే ఇండ్లు కిరాయకు తీసుకుని ఉండేవారు.
రమాయణం, చదువు నేర్పిన రోజుల్లో 7, ప‘రమా’నందమ్మ శిష్యులు
వాళ్ల పిల్లలు నా దగ్గరికి ట్యూషన్ కు వచ్చేవారు. అందులో వెంకటేశం గారి కొడుకు రఘువీర్, రాజయ్య గారి కొడుకు రాజారాం, శివరామిరెడ్డి గారి పిల్లలు మాధవి, మమత.. ఇంకా వాళ్ల బ్యాచ్ లోనే అక్కాతమ్ముళ్లు శైలజ, శ్రీధర్ వీళ్లంతా ఒకే బ్యాచ్ లో వుండేవారు. ఒకసారి రఘువీర్ ట్యూషన్ అయిపోయాక నా చేతికో ప్యాకెట్ ఇచ్చాడు. విప్పి చూస్తే అందులో రెండు చీరలున్నాయి. ఎందుకని అడిగాను.
‘మా చుట్టాలోళ్లు సూరత్‌ల ఉంటరు టీచర్! వాండ్లకు అక్కడ బట్టలు చీప్ల దొరుకుతయట. మా నాన్న కొన్ని తెప్పించిండు. ఇక్కడ అమ్ముదామని! ‘మీ టీచర్‌ను అడుగు.. కొనుక్కుంటారేమో’ అని మా అమ్మ చూపియ్యమన్నది టీచర్!’ అని చెప్పాడు. అప్పటికి నేనింకా చీరలు కట్టుకోవడం లేదు. పైగా మైనర్ని కూడానూ! స్వతంత్య్రం ప్రకటించుకోని సామంతరాణిలా ఉండేదాన్ని. మా అమ్మకు చెప్పకుండా చీర కొనడమా? ‘ధిక్కారమున్ సైతునా?’ అని అమ్మ అంటుందేమోనని భయం. మరో పక్క ఒక వస్త్ర వ్యాపారి నేరుగా నన్నే వస్ర్తాలు కొనమని అడగడం ఎంత ఆనందమో! నా వైపే చూస్తున్న రఘువీర్ ‘రొండు మంచి కలర్స్ మీకోసం ఏరి నేనే తెచ్చిన టీచర్!’ అన్నాడు. ఈ పిల్లాడికి మంచి మార్కెటింగ్ తెలివితేటలున్నాయని నాకు అనిపించింది. ‘చూద్దాంలే’ అన్నాను. ‘మీ దగ్గర్నే పెట్కోని రేపు చెప్పండి టీచర్!’ అన్నాడు. ఒక్కో చీర ధర రెండు వందలుంటుందనీ, కానీ, నా కోసం నూటా ఎనభైకే భలే మంచి చౌక బేరము లాగా ఇస్తామన్నారని చెప్పాడు. ‘వామ్మో’ అనుకున్నాను. ఎందుకంటే నా నెలసరి ఆదాయంలో అది సగం గనుక!
మా ఇంట్లో ఆ చీరల్ని క్షుణ్నంగా పరిశీలించి చూశాం. అందులో పిస్తా కలర్‌కు సిల్వర్ రంగు బోర్డర్ చీర నాకు బాగా నచ్చింది. ఎంతైనా అమ్మాయిని కదా! ఎలాగైనా సరే ఆ చీర కొనాలనే కోరిక నాలో అంతకంతకూ హనుమంతుని తోకలాగా పెరిగిపోసాగింది. మా అమ్మ మటుకుబాగనే ఉన్నది గానీ, ‘గిప్పుడేం పండుగా, పబ్బమా! కొత్త చీర కొనేటందుకు? అయినా నువ్వొక్కదానివి కొనుక్కుంటె అయిపాయేనా? అక్కకు కొనొద్దా?’ అని బ్రేక్ వేసింది. ఇప్పటికీ నూటికి తొంభై శాతం నేనో, అక్కో ఒక్కళ్లం కొనుక్కోవడం ఉండదు. ఇద్దరిలో ఎవరం ఏది కొన్నా ఇద్దరికీ కొంటాం.
అక్కకు నచ్చితె అక్కకే ఇస్త తియ్యరాదు అన్నాను. రేటు విషయంలో కూడా ఆ చీరకు అంత రేటుండే అవకాశం లేదనీ, అంతకు ముందు అలాంటి చీరలు ఇంకా తక్కువలో దొరికేవనీ, తేదీలు, షాపులు, ఎవరు కొన్నారో సందర్భాల వంటి గణాంకాలతో మా అమ్మ రిపోర్టు ఇవ్వడమే కాక ఆ చీర ఆఖరుకు నూటా యాభై, అరవైకి మించి ఒక్క రూపాయికి కూడా అర్హమైనది కాదనీ తేల్చేసింది. అప్పటికి బాహుబలి సినిమా రాకపోయినా మా అమ్మ మాటే శాసనం! ఆ మర్నాడు రఘు వచ్చీ రాగానే ‘ఏ చీర తీసుకున్నరు టీచర్!’ అనడిగాడు. ‘ఏ లెక్క రాలేదు?’ అని నేను కదా అడగాలి! నేను ఆ టాపిక్‌ను అక్కడితో ఆపి కొంత గ్యాప్ తీసుకున్నాను. ఇంటికెళ్లేటప్పుడు మళ్లీ అడిగాడు. నేను నిస్సహాయంగా రెండు చీరలూ తెచ్చిచ్చి ‘సారీ రఘూ! ఈ చీర బాగుంది గానీ, మా అమ్మ నూటా అరవైకి ఇస్తే తీసుకుందాం అన్నది. ఒద్దులే!’ అని ఇచ్చేశాను. మొహం చిన్నబుచ్చుకుని తీసుకెళ్లాడు.
ఆ తరువాత రెండు మూడు రోజులు రఘు చాలా దిగులుగా కనిపించాడు. నేనూ హెల్ప్ లెస్ మరి! చివరికి ఓ రోజు వాళ్లమ్మ సరోజిని మా ఇంటికొచ్చింది. ‘అమ్మా! రఘు మా మీద అలిగి రాత్రి అన్నం గూడా తినలేదు. మా టీచరుకు నచ్చిన చీర ఎందుకిస్త లేరు? తక్వ పైసలకు ఇయ్యొచ్చు గద! అని జిద్దు జేస్తున్నడు. మా ఆయినేమో ఆ చీరకు గంతే పడ్తది అంటున్నడు. మీరన్న రఘుకు చెప్పండమ్మా!’ అంటూ బాధపడింది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ చాలా ఆప్యాయంగా మాట్లాడేది. అలాంటిది కొడుకు అన్నం తినడం లేదని ఎంతో బాధపడుతుంటే నాకు ఎలాగో అనిపించింది. తల్లులంటే అంతే కదా! చివరికి మా అమ్మ కల్పించుకుని ‘అయితె మానే తియ్యమ్మా! బాధపడకు మీరు చెప్పిన రేటుకే తీసుకుందాం లెండి. రఘుకు మాత్రం మేమడిగిన ధరకే ఇచ్చినమని చెప్పండి. ఆ పిలగానికి సంతోషం అనిపిస్తది. మీకు కూడా ఇబ్బంది ఉండదు’ అన్నది. అమ్మ ఆ సమస్యను అంత తేలిగ్గా పరిష్కరించడం చూసి నాకు ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. రఘు వాళ్లమ్మ ఎంతో తేలికపడి వాళ్లింటికి వెళ్లిపోయింది.
మర్నాడు రఘు ముఖంలో సంతోషం తాండవిస్తుండగా నాకు చీర ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. ‘ఎందుకు రఘూ! మీ అమ్మ మీద అలిగినవట? ఈ చీర కోసం అంత పట్టుదల ఎందుకూ?’ అన్నాను. రఘు చాలా సిగ్గుపడి ‘ఎమ్మో టీచర్! చీర కావాల్నని మీరు అడుగలే గద! నేనే తెచ్చి చూపిచ్చిన. మీకు నచ్చినంక మళ్లా ఇయ్యకపోతె నాకే మంచిగనిపియ్యలే!’ అన్నాడు. నేను ఫిదా అని వేరే చెప్పాలా? రఘువీర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇక రాజారాం గవర్నమెంట్ టీచర్ అయ్యాడు. నర్సింగం నాలాగే బ్యాంకు ఉద్యోగి. తిమోతి ఇప్పుడు లాయర్. వీళ్ల ముగ్గురితో మొన్నీ మధ్యనే సురేశ్ కొడుకు పెళ్లిలో ఫోటో దిగాను కూడా! కుమారస్వామి మా ఇంటి దగ్గర్లోనే ఉండేవాడు. మ్యాథ్స్‌లో ఫస్ట్. అతను కొన్నాళ్లే నా దగ్గరికి వచ్చాడు. ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ ఊరికి వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చిపోతుంటాడు. మొత్తానికి ఈ పరమానందమ్మ శిష్యుల్లో చాలామంది సెటిల్ అయ్యారు.
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

