శ్రుతిలయలు సినిమాలో ‘శ్రీ శారదాంభ నమోస్తుతే’ పాడుతూ, నర్తించిన అబ్బాయి ఇతనే. ఆంధ్రనాట్యంలో అబ్బాయిగా రంగప్రవేశం చేసి, అమ్మాయిగా రాణించి, సత్యభామగా కీర్తి గడించి.. బహుళజాతి బ్యాంక్‌లో అసోసియేట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగి.. ఆంధ్రనాట్యం కోసం మళ్లీ తెలుగు నేలకు చేరారు. నాటరాజ రామకృష్ణ కీర్తిని, పేరిణి నాట్య వైభవాన్ని చాటేందుకు హాంకాంగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సత్యభామ సంజయ్ బాల్య జ్ఞాపకాల నుంచి (అభినవ) సత్యభామా కలాపాలను ఇలా గుర్తు చేసుకున్నారు.
‘అప్పట్లో మంచిగా వచ్చిన ఫొటోలను స్టూడియోల్లో డిస్ప్లే చేసేవాళ్లు. ఫొటో స్టూడియోలో నా ఫొటోలు ఉంటే చూసి.. ‘ఈ అమ్మాయి భలే ఉంది. మా వాడికి జోడీగా సరిపోతుంది’ అనుకుని కొంతమంది పెళ్లిళ్ల పేరయ్యలను మా ఇంటికి పంపారు. చివరికి అబ్బాయినని తెలుసుకుని, నవ్వుకుని వెళ్లిపోయారు. అలా నాలుగు సంబంధాలొచ్చాయ్!’
మా కుటుంబంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నవాళ్లు ఎవరూ లేరు. ఇంట్లో టీవీ చూస్తూ నేనే డ్యాన్స్ చేస్తుంటే మా అమ్మ వీడికి నాట్యం అంటే ఆసక్తి ఉందనుకుంది. మా నాన్న శాస్త్రీయ నృత్యం గురించి, మంచి గురువు గురించి ఆరా తీసి, నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఆయనప్పుడు అశోక్ నగర్లో ఉంటూ, శిక్షణ ఇచ్చేవారు. ఎనిమిదో ఏట ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అమ్మా నాన్న నా కోసం ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచేవాళ్లు. నాన్న నన్ను నాట్యశాల దగ్గర దింపేవారు. నా కోసం అక్కడే వేచి ఉండి, క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను తీసుకువెళ్లేవారు. ఇంటికి వచ్చేసరికి అమ్మ నా కోసం వంట చేసి, లంచ్ బాక్స్ కట్టి ఉంచేది. నన్ను రెడీ చేసి స్కూల్‌కి పంపేది. మా నాన్న ఆర్గనైజర్స్‌ని పట్టుకుని అవకాశాలు అడిగి నాతో ప్రదర్శనలు ఇప్పించేవారు. నా ప్రదర్శన ఎక్కడుంటే అక్కడికి అమ్మ వచ్చేది. నా కోసం అమ్మానాన్న ఎన్ని కష్టాలు పడ్డారో?!
రవీంద్రభారతి (హైదరాబాద్)లో ఓసారి నా ప్రదర్శన జరిగింది. దాని కోసం నా ఫొటోలతో ఒక ఆహ్వాన పత్రం ముద్రించారు. నాన్న తన స్నేహితుడికి ఆహ్వానం పంపారు. ఆయనకు దర్శకుడు కె.విశ్వనాథ్ గారు పరిచయం. ‘మీ సినిమాకు ఈ అబ్బాయి పనికొస్తాడేమో చూడండి’ అని వారికి చూపించారట. ఆరు నెలల తర్వాత.. విశ్వనాథ్ గారు ‘శ్రుతిలయలు’ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నారు. అందులో ఓ బాలనటుడి పాత్ర నాకు ఇవ్వాలని ఆయన అనుకున్నారట. కానీ, నేను ఎవరో? ఎక్కడుంటానో? ఆయనకు తెలియదు. ఆ ఆహ్వాన పత్రిక ఎక్కడో పడేశారట. ఇచ్చిందెవరో కూడా గుర్తులేదట. ‘ఈ అబ్బాయి వాళ్ల నాన్న వోల్టాస్ కంపెనీలో పని చేస్తారు’ అనే మాటలే గుర్తున్నాయట. ఆ మాట పట్టుకుని హైదరాబాద్ వోల్టాస్ కంపెనీ ఆఫీస్‌కి ఫోన్ చేశారు. ‘మీ కంపెనీలో ఒక ఉద్యోగి కొడుక్కి క్లాసికల్ డ్యాన్స్ వచ్చు. అతను ఎవరో కనుక్కుని మాతో మాట్లాడించండి’ అని అడిగారట. కంపెనీవాళ్లు ఆరా తీసి మా నాన్నకు విషయం చెప్పారు. వెంటనే ఫోన్ చేస్తే విశ్వనాథ్ గారు ఈ రాత్రే బయలుదేరమని మద్రాస్‌కు ఆహ్వానించారు. వెళ్లి కలిశాం. శ్రుతిలయలు సినిమాలో నటించాలని అడిగారు. అందులో నాది గాయకుడి పాత్ర.
‘శ్రీశారదాంబ నమోస్తుతే’ పాట పాడేది నేనే. ‘మా అబ్బాయి డ్యాన్సర్. గాయకుడి పాత్ర కంటే డ్యాన్స్ ప్రాధాన్యం ఉన్న వేషం ఇవ్వాలని అడిగారు నాన్న. ఆ గోల్డెన్ ఏజ్‌లో విశ్వనాథ్ గారికి చాలా పేరుంది. అంత పెద్దాయన మా నాన్న మాట మన్నించి నా పాత్రకు కొన్ని మార్పులు చేశారు. ‘రాగాలాపనే ఆవాహనం’ అని ఆలపించే పాటలో ఆంధ్రనాట్యాన్ని ఆవాహన చేసుకునేట్లుగా చేసి, స్క్రీన్‌ప్లేని దేవతార్చనగా మార్పులు చేశారు.
ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు.. స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా తీయాలనుకున్నారు. ఆ సినిమాకు సరిపోయే నటుల కోసం రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆరా తీయమని తన పీఏని పంపేవారట. అప్పుడు రవీంద్ర భారతిలో నా ప్రదర్శన జరిగింది. ఆ వార్త ఫొటోతో ఓ పత్రికలో ప్రచురితమైంది. ఆ పీఏ ఈ వార్తను ఎన్టీఆర్‌కు చేరవేశారు. ‘శకుంతల పాత్రకు సరిపోయే అమ్మాయి దొరికింది’ అని ఎన్టీఆర్ అనుకున్నారట. ఆ న్యూస్ క్లిప్పింగ్ పట్టుకుని పీఏ చిక్కడపల్లిలో మా ఇంటి అడ్రస్ వెదుకుతూ తిరుగుతున్నాడు. మా ఇంటి ముందుకు వచ్చి ‘ఈ ఫొటోలో ఉన్న ఈ అమ్మాయి ఈ ఏరియాలో ఉంటుందట. మీకు తెలుసా?’ అని మా అమ్మను అడిగాడు. ‘అదుగో ఆ అబ్బాయే.. ఈ అమ్మాయి! మా అబ్బాయేనండి’ అని వీధిలో ఆడుకుంటున్న నావైపు చూపించింది. ‘అబ్బాయా? అమ్మాయి కాదా?’ అని ఆయన ఆశ్చర్యపోయారు. అయినా ఓసారి ఆఫీస్‌కి వచ్చిపొమ్మన్నారు. వెళ్లి ఎన్టీఆర్‌ని కలిశాం. అమ్మాయిని కాకపోవడం వల్ల ఆ పాత్ర చేజారింది.
సినిమాల్లో అవకాశాలు నా టార్గెట్ కాదు. అప్పటికి నాది చిన్న వయసు. ఆ వయసుకు తగ్గ డ్యాన్సర్ పాత్రలు సినిమాల్లో ఉండవు. కాబట్టి సినిమా అవకాశాలు రాలేదు. స్కూల్‌కి వెళ్లే రోజుల్లో ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావాలనే ఆలోచన నాకు లేదు. ఆ రోజుల్లో డ్యాన్స్ కెరీర్లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అప్పట్లో సీడీలు, పెన్ డ్రైవ్‌లు లేవు. ప్రదర్శనలో లైవ్ ఆర్కెస్ట్రానే ఉపయోగించేవాళ్లు. దాంతో ఒక ప్రదర్శనకు పెద్ద మొత్తంలో ఖర్చు ఉండేది. అందువల్ల ఇప్పుడున్నన్ని పోటీలు, అవకాశాలు అప్పట్లో లేవు. కాబట్టి నేర్చుకునేవాళ్లు చాలా తక్కువ. మాది మధ్య తరగతి కుటుంబం. బతకడానికి ఓ ఉద్యోగం అవసరమని ‘నువ్వు డ్యాన్స్ నేర్చుకో. కానీ, బేసిక్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. చదువుని నిర్లక్ష్యం చేయొద్దు’ అని నాన్నగారు చెప్పేవారు. నాన్నకు ప్రపంచం తెలుసు. కళాకారుల కష్టాలు చూశాడు. డ్యాన్స్‌తోపాటు చదువులోనూ బాగానే ఉండేది. ప్రాక్టీస్‌తో చదువుకు తక్కువ సమయం కేటాయించినా, ప్రదర్శనల వల్ల బడికి వెళ్లకపోయినా.. క్లాస్‌లో ఎప్పుడూ టాప్ టెన్‌లోనే ఉండేవాడిని. బీఎస్సీలో ఉన్నప్పుడు చదువు మీద ఫోకస్ పెట్టాను. డిస్టింక్షన్లో పాసయ్యాను. ఎంబీఏలో డ్యాన్స్ పక్కనపెట్టి కెరీర్ మీద ఫోకస్ చేశాను.
ఎంబీఏ అయిపోగానే హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం. ఆ ఉద్యోగంలో చాలా బిజీ అయిపోయాను. అమెరికా, యూకే ప్రాజెక్ట్ పనుల్లో బాగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. పరిసరాలు మారాయి. ప్రాధాన్యాలు మారాయి. జనంలో రకరకాల వాళ్లుంటారు. అన్ని రకాల మనుషుల మధ్య తిరుగుతున్నాను. వేదికెక్కి ఆంధ్రనాట్య ప్రదర్శన చేయాలని ఉంది. ‘అబ్బాయిగా చేయాలా? అమ్మాయిగా చేయాలా?’ అనే సందేహం వచ్చింది. ‘ఆడవేషం కట్టి, నృత్య ప్రదర్శన చేస్తే ఏమనుకుంటారో?’ అనే సందేహంతో చాలాకాలం ఏ ప్రదర్శనా ఇవ్వలేదు. పదేళ్ల తర్వాత మళ్లీ వేదిక ఎక్కాను. ఎప్పటిలా కాకుండా అబ్బాయిగా దశావతారాలు, తరంగం ప్రదర్శించాను.
నా రంగ ప్రవేశం అబ్బాయిగానే జరిగింది. కానీ, ఓ రోజు నటరాజ రామకృష్ణ గారు ‘వీడికి ఆడవేషం వేసి.. ‘నవ జనార్దన పారిజాతం’లో సత్యభామను చేద్దాం’ అన్నారు. త్యాగరాయ గానసభలో ఆ ప్రదర్శన చాలా బాగా చేశాను. ఎక్కడికి వెళ్లినా సత్యభామ ప్రదర్శనే కావాలనేవారు. నాకూ సత్యభామ ఇష్టమైన పాత్ర. ఏడాది తర్వాత సత్యభామ వేషం వేశాను. హాంకాంగ్‌తోపాటు బ్రిటన్, అమెరికాల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చాను.
విదేశీయులు కళల్ని అభిమానించినంతగా మనవాళ్లు అభిమానించరు. ఇక్కడ ‘నేను కళాకారుడినని’ చెప్పుకొంటే… ‘నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు? ఎన్ని లైక్స్ వచ్చాయి?’ అని అడుగుతున్నారు. కళాకారుడిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో తూకం వేస్తున్నారు. ఇది చెడ్డ ధోరణి. మనవాళ్ల కంటే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్ ప్రజలే నయం. విదేశీ కళ అయినా ఆంధ్ర నాట్యాన్ని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మన ఆహార్యం, ఆభరణాలు చూసి ముచ్చటపడతారు. ఇక్కడ జనం పిల్లలకు డ్యాన్స్ నేర్పించేటప్పుడే ‘ఎప్పటికల్లా స్టేజ్ ఎక్కిస్తారు?’ అని అడుగుతున్నారు.

Satyabama1
హాంకాంగ్‌లో పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్నాను. శనివారం, ఆదివారం క్లాసులు చెబుతాను. నా దగ్గర పది మంది ఎన్నారైల పిల్లలు ఆంధ్రనాట్యం నేర్చుకుంటున్నారు. వాళ్లకు తెలుగు భాష, నుడికారం తెలియదు. పురాణాలూ తెలియవు. భంగిమల గురించి చెప్పే ముందు కొన్ని కథలు చెబుతాను. రాముడు, కృష్ణుడు గురించి చెబుతుంటే వింటారు. తుమ్మెద, ఏనుగు, పక్షికి సంబంధించిన భంగిమలు చెబుతుంటే ‘ఖడ్గమృగం భంగిమ ఏమిటి? డైనోసార్ భంగిమ ఎలా ఉంటుంది? జిరాఫీని ఎట్లా చెప్పాలి’ అని అడుగుతారు. ఆ ప్రశ్నలు వింటే నవ్వు వస్తుంది. వాళ్ల ప్రశ్నలు సరైనవే. మనమే కొత్తగా చేయాలి కదా! పిల్లలకు నేర్పిస్తూ నేనూ నేర్చుకుంటున్నాను.
‘నవజనార్దన పారిజాతాన్ని’ ఒకప్పుడు వరుసగా తొమ్మిది రాత్రులు ప్రదర్శించేవారు. వేసిన దరువు వేయకుండా ప్రదర్శన చేయడం అద్భుతం! కళా సంపద మనకుంది. దానిని కాపాడుకోవాలి. ఆ పాటలను సేకరిస్తున్నాను. పాటలు, దరువులు భద్రపరచాలని, భవిష్యత్ తరాలకు అందించాలన్నది నా ఆకాంక్ష. మూడేళ్లుగా కళాకృష్ణ గారి సహకారంతో ప్రాక్టీస్ చేస్తూ, రికార్డ్ చేస్తున్నాను. కళారంగానికి సేవ చేయాలని ‘నటరాజ రామకృష్ణ నృత్య రత్న అవార్డ్’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ ఏడాది నటరాజ రామకృష్ణ కళాస్ఫూర్తిని కొనసాగిస్తున్న కళాకృష్ణ గారికే ఈ అవార్డ్ ఇచ్చాను. ఇక ముందు ఆంధ్రనాట్యానికి, పేరిణి ప్రాచుర్యానికి పాటుపడే కళాకారులకు ప్రోత్సాహం అందిస్తాను.
ఇదే నా గురుదక్షిణ.
‘అమ్మానాన్న నాకు పేరిణి నేర్పించారు. ప్రదర్శనలకు ప్రోత్సహించారు. ఇప్పటికీ వాళ్ల ప్రోత్సాహం వల్లే ప్రదర్శనలు చేస్తున్నాను. నా ప్రదర్శన ఉంటే నా కంటే ఎక్కువగా సంతోషిస్తారు. అమ్మానాన్న ముందు కూర్చుని చప్పట్లు కొడుతూ చిన్నపిల్లలైపోతారు. నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం మా అమ్మానాన్నలు’
– సత్యభామ సంజయ్
– నాగవర్ధన్ రాయల