నమస్తేస్తు మహాదుర్గ!
ఆ తల్లిని స్మరించుకోవడం అంటే.. మనల్ని మనం సంస్కరించుకోవడమే! మనలోని అసుర ప్రవృత్తులపై విజయం సాధించడమే!! అమ్మవారి ఆరాధనకు ఉన్నతమైనదిగా పేర్కొనే శరన్నవరాత్రి శోభ అంతటా వెల్లివిరిసి ఉన్నది. విజయదశమి నాడు అమ్మవారు విశేష పూజలు అందుకోనుంది.
అతిసౌమ్యాతిరౌద్రాయై
నతాస్తస్యై నమో నమః
నమో జగత్ప్రతిష్ఠాయై
దేవ్యై కృత్యై నమో నమః॥
అంటుంది దేవీ సప్తశతిలోని అపరాజితా స్తోత్రం. అతి సౌమ్యం ఆ తల్లే! మహా రౌద్రమూ ఆవిడే!! మంచిని లాలించేటప్పుడు గౌరి. చెడును దునుమాడేటప్పుడు చండి. ఈ కలిలో.. మంచి, చెడు రెండూ మనలోనే ఉన్నాయిగా! ఆ మంచిని పెంపొందించేలా ప్రోత్సహించే యుక్తిని లలితగా ప్రసాదిస్తుంది. మనలో పడగలు విప్పే చెడును తుదముట్టించే శక్తిని కాళిగా అనుగ్రహిస్తుంది. ఆ తల్లిని స్మరించుకోవడం అంటే.. మనల్ని మనం సంస్కరించుకోవడమే! మనలోని అసుర ప్రవృత్తులపై విజయం సాధించడమే!! అమ్మవారి ఆరాధనకు ఉన్నతమైనదిగా పేర్కొనే శరన్నవరాత్రి శోభ అంతటా వెల్లివిరిసి ఉన్నది. విజయదశమి నాడు అమ్మవారు విశేష పూజలు అందుకోనుంది. ఆ అపరాజితను కొలిచి.. విజేతలుగా నిలవడానికి ఇదే గొప్ప సందర్భం!
సృష్టికి ముందు..
యోగనిద్రలో ఉన్నాడు విష్ణుమూర్తి. ధ్యానముద్రలో ఉన్నాడు రుద్రుడు. శ్రీహరి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో ఇద్దరు అసురులు బ్రహ్మ సంగతి తేల్చడానికి సిద్ధమయ్యారు. వాళ్లే మధుకైటభులు. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి నుంచి ఆవిర్భవించిన శక్తులే ఈ ఇద్దరు! చైతన్యం నిద్రలోకి జారుకుంటే.. రజోతమో గుణాలు జడలు విప్పుతాయి. సత్వగుణం చేష్టలుడిగి మిన్నకుండిపోతుంది. నిద్ర, బద్ధకం తమో గుణాలకు ప్రతీకలు. కోరికలు, గొడవలు, దుఃఖం రజోగుణ లక్షణాలు. జ్ఞానం, తెలివి, ధర్మం సాత్విక గుణ సంపదలు. చైతన్యం ఉన్నప్పుడే సత్వగుణం రాణిస్తుంది.
శ్రీహరి నుంచి ఉద్భవించిన మధుకైటభులు రజోతమో గుణాలకు నిదర్శనాలు. పుట్టడంతోనే.. సృష్టి కార్యానికి విఘాతం కలిగించే ప్రయత్నం మొదలుపెడతారు. బ్రహ్మ అమ్మవారిని ప్రార్థిస్తాడు. బ్రహ్మలోని సృష్టి శక్తి, విష్ణువులోని స్థితి శక్తి, రుద్రుడిలోని లయత్వాన్ని కలగలుపుకొని ఓ మహోన్నతమైన శక్తి ఆవిర్భవించింది. అంతకు ముందెన్నడూ చూడని రూపం. అది అపురూపం. ఆది పరాశక్తి అసలు రూపం అప్పుడు చూశాడు బ్రహ్మ. అనాదిగా సృష్టి అంతా చైతన్యంగా ఉన్న తల్లి.. ఓ రూపాన్ని ధరించింది.
దశదిశలూ విస్తరించిన ఆ స్వరూపం ఆవిష్కృతం కాగానే.. విష్ణువులో చైతన్యం కలిగింది. స్థితి లక్షణం సుస్థిరమైంది. తక్షణ కర్తవ్యం గుర్తుకొచ్చింది.

Madhukaitabha
మధుకైటభులపైకి చతుర్భుజ నారాయణుడు యుద్ధానికి వెళ్లాడు. సృష్టిని భయకంపితం చేస్తున్న ఉభయులనూ వెంబడించాడు.
పోరు ఒక్క తీరుగా సాగింది. అటు ఇద్దరు.. ఇటు ఒక్కడు. పట్టు చిక్కడం లేదు. సంహరించే వెసులుబాటు కుదరడం లేదు. రజోతమో గుణాలు పేట్రేగినంత కాలం సత్వగుణం ఉనికి ఉత్థానించదు. అంతేకదా! మనలో కోరికలు రెచ్చినంత కాలం, ఈర్ష్యాద్వేషాలు చెలరేగినంత కాలం.. అహంకారం అదుపులోకి రాదు. మమకారం సద్దుమణగదు. నిద్రాణమై ఉన్నా.. ఆ సత్వ గుణమే అప్పుడు శ్రీరామరక్ష!
ఎంతటి దుష్టభావనలు మనలో గూడు కట్టుకున్నా.. ఆ సత్వగుణం ఒకపాలు ఉంటే బతికి బట్టకట్టొచ్చు. ఆ లక్షణమే.. తెలివిని ప్రచోదనం చేస్తుంది. చెడును చెడు అని గుర్తించేలా మార్గం చూపుతుంది. ఆ తెలివే అమ్మవారి పాదాలు పట్టుకోమని చెబుతుంది. ఆ కాసేపు.. నియంత్రణలో ఉంటూ, అమ్మవారిని ఆశ్రయిస్తే చాలు! మిగతాదంతా ఆమే చూసుకుంటుంది. అమ్మ లీలలోకి వస్తే.. మధుకైటభులు పేట్రేగిపోతున్నారు.
అమ్మవారి అనుగ్రహం శ్రీహరిపై కురిసింది. మధుకైటభుల బుద్ధిని భ్రమింపజేసింది తల్లి. ‘బుద్ధిః కర్మానుసారిణి’ అన్నట్టుగా, తమతో పెనుగులాడుతున్న శ్రీహరికి వరమిస్తామన్నారు ఆ అసురులు. సత్వగుణం జాగృతమైతే.. జ్ఞానం వికసిస్తుంది. ధర్మం నిలబడుతుంది. ‘మిమ్మల్ని సంహరించే వరం ఇవ్వమ’ని కోరాడు విష్ణువు. ఇచ్చిన మాట తప్పడం కుదరదు. పైగా ఉచ్ఛస్థితిలో ఉన్న రజోతమో గుణాలు పర్యావసనాల గురించి ఆలోచించవు.
‘అలాగే! కానీ, నీళ్లు లేని చోట సంహరించే వరం ఇస్తున్నాం’ అన్నారట. విశ్వమంతా జలమే! అదేమంత తిరకాసు కాదు! ఆ అసురులకు తట్టలేదంతే! అజ్ఞానంతో కండ్లు మూసుకుపోయిన వారికి… రహస్యం ఏం తెలుస్తుంది! అదే జరిగింది. నీటి బొట్టు అంటని తన తొడలపైకి ఇద్దరినీ చేర్చి ముక్కలు చెక్కలు చేశాడు శ్రీమహావిష్ణువు. మధుకైటభులు ప్రాణాలు వదిలారు. బ్రహ్మ సృష్టి కార్యానికి పూనుకున్నాడు. విష్ణువు స్థితి చేయడానికి సిద్ధమయ్యాడు. రుద్రుడు లయ కార్యంలో నిమగ్నుడయ్యాడు. ఈ సృష్టి సజావుగా సాగడం మొదలైంది.
అహంకారం మనిషికి అలంకారం అవ్వకూడదు. మమకారం ఉచిత లక్షణం కాదు. ఈ రెండూ ఉంటే.. మనిషి ఎదుగుదల ప్రశ్నార్థకమే! ఎంత ఎదిగినా.. పుటుక్కున కూలిపోయే పేకమేడలా ఉంటుంది వ్యవహారం. జ్ఞానమే పరమావధి! ఆ జ్ఞానాన్ని జాగృతం చేయడానికి సత్వ గుణాన్ని పెంపొందించుకోవాలి. అందుకు దేవీ ఉపాసన చక్కని మార్గం.
అంతదాకా ఎందుకు, మనకు జన్మనిచ్చిన తల్లిని అడిగితే చాలు! ఏది మంచో, ఏది చెడో విడమర్చి చెబుతుంది. దుర్మార్గం నుంచి సన్మార్గంలోకి నడవమని ప్రోత్సహిస్తుంది. ‘యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా’ అన్ని జీవుల్లోనూ తల్లిగా కొలువై ఉన్న జగజ్జనని.. మన అమ్మలోనూ అమ్మగా ఉండదా! ఉచితమేదో, అనుచితమేదో.. అనునయంగా తెలియపర్చదా!!
దేవీ మహాత్మ్యం ప్రకారం.. అమ్మవారు ఎందరెందరో రాక్షసులను సంహరించింది. ఆ అసురులు అప్పటికి అంతమైనా.. వారి లక్షణాలు మాత్రం యుగయుగాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. సత్వ, రజో, తమో గుణాల హెచ్చుతగ్గులే మన నడవడిని నిర్దేశిస్తున్నాయి.
ఒకసారి లంకలోకి ప్రవేశిద్దాం.. రావణుడు రజోగుణానికి రారాజు. కుంభకర్ణుడు తమోగుణంతో ఉన్నవాడు. ఆ లంకలోనే ఉన్న విభీషణుడు సత్వగుణానికి ప్రతీక. రజోతమో గుణాలు బలం పుంజుకుంటే… లంకలో విభీషణుడిలా సత్వగుణం ఉన్నా ప్రయోజనం శూన్యం. మన దేహాన్ని లంకగా భావించుకుంటే… ఈ అన్వయం సరిగ్గా కుదురుతుంది. ఇంద్రియాలకు వశమైన మనసు మనిషిని పతనం వైపు నడిపిస్తుంది. ఇంద్రియాలను కట్టడి చేయగలిగితే.. మనీషిగా ఎదిగే అవకాశం ఉంటుంది.

Ravana Kumbha, Vibhishana
అనేకానేక దుర్గుణాలకు ప్రతీక అయిన రాక్షసుడు మరొకడు ఉన్నాడు. అతనే మహిషాసురుడు. విశేషమైన తామసం, అంతకుమించిన తపోబలం.. ఆ అసురుణ్ని క్షణం నిలకడగా ఉండనివ్వలేదు. తనను ఎవరూ చంపలేరన్న మదం ఆ రాక్షసుడిది. ఎందుకంటే.. వరగర్వం. వరం కోరడంలోనూ అదే గర్వం. ఆడదాని చేతిలో తప్ప ఎవరితోనూ మరణం లేకుండా వరం కోరాడు. ఆడదంటే అలుసు. అసలు సృష్టికర్త అమ్మ అన్న విచక్షణ కూడా లేదతనికి.
ఆ వరంతోనే పేట్రేగిపోయాడు. సకల దుర్గుణాలు కలవాడు.. పాలకుడు అయ్యాడు. ధర్మం అడుగంటింది. న్యాయం ఊసే లేదు. సమస్త జాతులూ అవస్థపడసాగాయి. భూలోకాన్ని వశపర్చుకున్న మహిషుడు దేవతలతో కయ్యానికి కాలుదువ్వాడు. విశృంఖలంగా విజృంభించాడు. అనేక సంవత్సరాలు దేవాసుర సమరం కొనసాగింది. తాత్వికంగా చూస్తే.. దైవత్వం, అసురత్వం రెండూ మనలోనే ఉన్నాయి. ఈ రెండూ నిత్యం ఘర్షిస్తూనే ఉన్నాయి.
మనలో, మన చుట్టూ విస్తరిస్తున్న అసురశక్తులను గెలవలేకపోతే.. జీవితంలో పరాజయం తప్పదు! మనిషిలోనే కాదు.. సమాజంలోనూ ఈ పోకడ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. బలవంతుడికి అసుర లక్షణాలు ఉంటే.. అతని బతుకేమో కానీ, ఎందరెందరి జీవితాలో దుర్భరంగా మారుతాయి. ధర్మాన్ని అంటిపెట్టుకొని సాగితే.. ప్రమోదం. ధర్మాన్ని అతిక్రమించి నడిస్తే.. ప్రమాదం.
మహిషుడు రజోతమో గుణాల పుట్ట. కరుడుగట్టిన అజ్ఞాని. ఇంద్రియాలను తృప్తిపర్చడమే విధిగా భావించే వాడు. అందుకే ముల్లోకాలపై దండెత్తి తన దాహం తీర్చుకున్నాడు. పరిస్థితి చేజారింది. దేవతలందరితో కలిసి బ్రహ్మ బయల్దేరాడు. సదాశివుణ్ని, మహావిష్ణువుని కలిసి.. పరిస్థితి నివేదించాడు. పంచభూతాలనూ తను చెప్పినట్టూ ఆడిస్తూ… విశ్వాన్నంతా అతలాకుతలం చేస్తున్నాడని వివరించాడు. మహిషుడి దురాగతాలు విన్న శివుడు కోపంతో భృకుటి ముడివేశాడు. అందులోంచి ఓ అగ్ని ఉద్భవించింది.
మహావిష్ణువు నుంచి మరో కాంతి పుంజం పుట్టి.. ఆ అగ్నిలో కలిసింది. బ్రహ్మనుంచీ అంతే! అందరు దేవతల నుంచి వారివారి శక్తి కాంతిగా వెడలి.. ఆ తేజస్సులో లీనమైంది. ఇందరి దేవతల తేజం.. మహాగ్నిపుంజమై వెలుగులీనింది. వేల సూర్యమండలాలు ఒక్కచోటికి వస్తే ఎలా ఉంటుందో.. అంతటి కాంతిశక్తి విశ్వమంతా నిండినట్టుగా తోచింది అక్కడివారికి. సర్వదేవతల్లో ఉన్న అమ్మవారి శక్తి వెలువడి పూర్ణశక్తిగా ఏర్పడింది. ఆ శక్తిలోంచి ఒక రూపం ఏర్పడింది. అది మహా స్త్రీ రూపం.
అష్టాదశ భుజాలతో.. త్రి నయనాలతో… ప్రసన్న వదనంతో.. సర్వదేవాత్మిక అయిన మహాదుర్గ అవతరించింది. ఆమె అంతకు ముందుంది. ఆ తర్వాతా ఉంది. లీల చూపించడానికి అప్పుడు వెలుగుచూసింది. అద్భుత అవతారం.. మహిషుడి గర్వాన్ని అణిచే అవతారం. ఆ అసురుణ్ని మట్టుపెట్టి, జగత్తును ఉద్ధరించే మాతృరూపం. సృష్టిని చక్కదిద్దే స్త్రీ రూపం. ఆ తల్లికి దేవతలంతా ప్రణమిల్లారు!

Devi Avirbhavam
పినాకపాణి అయిన శివుడు తన శూలం నుంచి మరో శూలం తీసి అమ్మకు కానుకగా సమర్పించాడు. విష్ణువు తన సుదర్శనం నుంచి మరో సుదర్శనాన్ని తీసి ఇచ్చాడు. బ్రహ్మ కమండలాన్ని సమర్పించాడు. వాయుదేవుడు ధనుస్సు, అమ్ములపొది, ఇంద్రుడు వజ్రాయుధంతోపాటు ఐరావతం మెడలోని ఘంటను అమ్మవారికి ఇచ్చాడు. యముడు కాలదండం, వరుణుడు పాశం, దక్షప్రజాపతి అక్షమాల, మృత్యుదేవత ఖడ్గం, డాలు ఇలా సమర్పించారు. సూర్యుడు తన కిరణ శక్తినంతా అమ్మవారి రోమకూపాల్లో నింపాడు.
విశ్వకర్మ గండ్ర గొడ్డలి, కవచం, మరికొన్ని అస్ర్తాలు ఇచ్చాడు. సముద్రదేవత పద్మహారాన్ని, చేతిలో ధరించడానికి వాడని పద్మాన్ని అందించింది. క్షీరసముద్రుడు నిత్య నూతనమైన వస్ర్తాలు, చూడామణి, భుజకీర్తులు, నూపురాలు, కంఠభరణాలు సమర్పించాడు. ఇక హిమవంతుడు సింహ వాహనం ఇచ్చాడు. కుబేరుడు అమృత పాత్ర ఇవ్వగా, ఆదిశేషుడు వెయ్యి సర్పాలు కలగలిసిన కిరీటాన్ని అమ్మవారికి అందించాడు.
అన్నీ ధరించిన అమ్మ మహద్రూపం.. దేవతలకు అభయమిచ్చింది. అటూ ఇటూ చూసిన అమ్మ మహా అట్టహాసం చేసింది. పదే పదే అలాగే వికటాట్టహాసం చేసింది. ఆ ధ్వనికి ప్రళయం వచ్చిందా? అన్నట్టుగా విశ్వం కపించింది. విషయం మహిషాసురుడి చెవిన పడింది. యుద్ధానికి సిద్ధమయ్యాడు. బీరాలు పలికి కదిలాడు. యుద్ధ క్షేత్రంలో అమ్మను చూడగానే కుదేలయ్యాడు. కంపించిపోయాడు. అనంత హస్తాలతో విశ్వభుజిగా ప్రకాశిస్తున్న మహాశక్తిని తట్టుకునే సామర్థ్యం ఆ అసురుడికి ఎక్కడిది? అమ్మవారి విజృంభణకు మహిషుడి సేనలు ఆగమయ్యాయి.
మహిషుడు పురుష రూపాన్ని వదిలి దున్నపోతుగా మారి కంపనం చేస్తూ.. తల్లి వాహనమైన సింహం మీదికి దుమికాడు. అమ్మ పాశం విసిరింది. వెంటనే వ్యాఘ్ర రూపం దాల్చాడు. ఆపై ఖడ్గమృగమై దాడికి పూనుకున్నాడు. ఆ వెంటనే సింహంగా మారాడు. మళ్లీ పురుష రూపం ధరించి ఆ వెంటనే ఏనుగు రూపం దాల్చి సింహాన్ని చుట్టేద్దాం అనుకున్నాడు. మహిషుడి పప్పులు ఉడకలేదు. మళ్లీ మహిషుడిగా మారాడు.
మహిషుడు కామరూపుడు. అందుకే అన్ని రూపాలు ధరించాడు. నేటి మనిషిలోనూ ఇన్ని జంతువుల ఉనికి ఉంది. ఈర్ష్యతో బుసకొట్టే సర్పం, నమ్మించి వంచించే తోడేలు, అహంకారంతో విర్రవీగే మదపుటేనుగు.. ఇలాంటి పశుప్రవృత్తులు మనలో ఎప్పుడో ఒకసారి తొంగి చూస్తూనే ఉంటాయి. మనలోని దైవీశక్తిని పట్టుకుంటే అవి అదుపులో ఉంటాయి. పూర్తి నమ్మకంతో ప్రయత్నిస్తే సంపూర్ణంగా అంతర్దానం అవుతాయి. మహిషుడికి అంతటి విజ్ఞత ఎక్కడిది? ‘అబల నన్ను అడ్డగిస్తుందా?’ అని మరింత క్రౌర్యం పొందాడు.
ఆ తల్లి రూపాన్ని చూసి భయపడుతూనే.. పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శించాడు. అమ్మ మాత్రం సరదాగా అమృతపానం చేసి.. ఆ అసురుడి వంక అలా చూసిందట! ఒక్కసారిగా మహిషుడిపై దూకి పాదాలతో దున్నను అదిమిపెట్టిందట. తల ఎత్తేలోపే… త్రిశూలంతో కంఠం నొక్కిందట. కంఠం పై భాగం నుంచి పైకి వచ్చిన శిరస్సును కత్తితో తెగనరికింది. మహిషుడి అంతం.. లోకానికి జయం. సమస్త సృష్టికి ఆది తానేనని.. ఒక మహిళ చేయలేనిది లేదని.. స్త్రీశక్తిని లోకానికి విదితం చేసింది జగజ్జనని. అపరాజితగా విరాజిల్లింది.

Saptamatrika
ఇంతటి గెలుపు సాధించినా.. స్త్రీశక్తిని అంగీకరించలేదు అసురులు. శుంభనిశుంభులు దిగారు. సర్వశక్తిమయి అయిన తల్లిని మరోలా చూశారు. ‘మాంవా, మమ అనుజంవా’ నన్ను గానీ, నా తమ్ముడిని గానీ ఏ ఒకరినైనా చేపట్టాలని వర్తమానం పంపారు. ఇక్కడ మాంవా.. అంటే అహంకారం, అనుజంవా.. మమకారం. ఈ రెండే కదా.. మనిషిని ముప్పుతిప్పలు పెట్టేవి. నేను, నాది అనే రెండు భావాలే శుంభ, నిశుంభులు.
వారి వర్తమానానికి అమ్మవారు కించిత్ ఆగ్రహించలేదు. ‘నన్ను యుద్ధంలో గెలిచినవాడినే చేసుకుంటాను అని గతంలో ప్రతిజ్ఞ చేశాను. ముందు ఆ ప్రయత్నం చేయండి తర్వాత చూద్దాం’ అని ప్రతి వర్తమానం పంపింది. ఆ అసురులకు అహం దెబ్బతిన్నది. అమ్మవారిపైకి ధూమ్రలోచనుడు అనే రాక్షసుణ్ని పంపారు. అమ్మ హూంకరించడంతోనే అతను భస్మం అయ్యాడు. తర్వాత చండముండులు చతురంగ బలాలతో బయల్దేరారు.
అమ్మ కోపంగా చూసిందట. కనుబొమల నుంచి ఓ రూపం వెలుగుచూసింది. ఆవిడే కాళి. కాల స్వరూపం ఆ తల్లి. చండముండులను దునుమాడింది. అందుకే ఆమెకు చాముండగా పేరొచ్చింది. అఖండ జ్ఞానం చాముండ. అజ్ఞాన, తిమిరాలు చండముండులు. అనేకత్వాన్ని తొలిగించిన ఏకత్వం ఆమె!
ఇక లాభం లేదనుకొని శుంభనిశుంభులు తమ మేనల్లుడు రక్తబీజుణ్ని రంగంలోకి దింపారు. అంతకుముందే.. రాక్షస సంహారం కోసం బ్రహ్మ నుంచి బ్రాహ్మీ, మహేశ్వరుడి నుంచి మాహేశ్వరి, కుమారస్వామి నుంచి.. కౌమారి, విష్ణుమూర్తి నుంచి వైష్ణవి, వరాహ స్వామి నుంచి వారాహి, నరసింహుడి నుంచి నారసింహి, ఇంద్రుడి నుంచి ఐంద్రి.. ఇలా సప్త మాతృకలు వెలువడ్డాయి. కాళికి జతగా కలకాలం అనుష్ఠించే రూపాలు అవతరించాయి.
వీరి సరసన శివదూతి వచ్చి చేరింది. ఈ నవమాతృకలూ పరాశక్తి అంశలే! కానీ, దుష్టత్వంతో ఉన్నవాడు ఈ ఏకత్వాన్ని గ్రహించక దెబ్బతింటాడు. ఈ సత్యం తెలియకనే రక్తబీజుడు చెలరేగాడు. వాడి రక్తం బొట్లు ఎన్ని కిందపడితే.. అంతమంది రక్తబీజులు ఉద్భవించసాగారు. కాళిక నాలిక చాపింది. రక్తం బొట్టు కిందపడకుండా చేసింది. అక్కడ పరాశక్తి రక్తబీజుడి శిరస్సును ఎగరేసింది. ఆ తర్వాత శుంభనిశుంభుల వంతు! అమ్మవారు ఏదో ముంజేతి కంకణం సవరించుకున్నంత సులువుగా ఇద్దరినీ.. తుదముట్టించేసింది. అమ్మవారు నిలిచింది. అమ్మదనం గెలిచింది.
ఈ కథలన్నీ పరాశక్తి లీలలుగా చెప్పుకొంటాం. అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఇవన్నీ సదా స్మరించుకుంటాం. బాగానే ఉంది. కానీ, మనలోని చెడును జయించడమే నిజమైన సాధన! ఆ సాధనకు ఊతమే అమ్మవారు. విజయదశమి సకల విజయాలకూ నాంది. నాది, నేను అనే అహం వీడితే సగం జయం. నా వాళ్లూ, పరాయివాళ్లు అన్న మమకారం వీడితే అదే దిగ్విజయం. సర్వం ఏకమే! ఆ ఏకత్వ సాధనే.. అమ్మ ఉపాసన. ఈ సత్యాన్ని తెలుసుకొని మసులుకుంటే ప్రతి రోజూ విజయదశమే! ప్రతి విజయమూ అమ్మవారి అనుగ్రహమే!!
సమస్తం ఆ తల్లే..
సృష్టిలో సమస్తం అమ్మవారిలో అంతర్భాగమే. మహర్షులు బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరిస్తున్నారో ఆ శక్తినే దేవి అన్నాం. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అలాంటి అమ్మవారి మూలతత్త్వం సూక్ష్మమని, నిర్గుణ రూపమని కూడా మన పురాణాలు చెప్పాయి. ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధపాడ్యమినాడు అవతరించి, నవమి నాడు రాక్షస సంహారం చేసినట్లు నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో ఆది పరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయమైంది. అమ్మ దైవకార్యం కోసం స్థూలరూపం ధరించి, సగుణ స్వరూపంతో లోకానికి వ్యక్తమైనప్పుడు అనేక అవతారాల్లో కనిపిస్తుంది. అందులో తొమ్మిది రూపాలను శరన్నవరాత్రుల సందర్భంగా మనం తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తున్నాం. అయితే ఆది పరాశక్తి సగుణరూపం ప్రధానంగా త్రిగుణాత్మకంగా ఉంటుంది. తమో గుణ ప్రధానమైనప్పుడు మహాకాళి అనే పేరుతో ఉంటుంది. రజోగుణంలో ఉన్న శక్తిని మహాలక్ష్మి అని, సత్వగుణంతో ప్రకాశించే శక్తి మహా సరస్వతి, సర్వచైతన్య స్వరూపిణిగా వెలుగొందుతుంది. లలిత పేరుతో పూజలందుకుంటుంది. జగదాంబ తొమ్మిది రోజుల పాటు శత్రు సంహారం చేసి పదో రోజు విజయోత్సవం చేసుకున్నారు. కాబట్టి దశమిని విజయదశమి అని పిలుస్తారు.

Devata Archana
అమ్మ నేర్పే పాఠాలివి…
నగృహం బంధనాగారం బంధనే నచ కారణమ్ మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్చతే!
ఇల్లు అనేది కారాగారం కాదు, అది బంధన కారణం కూడా కాదు. మనసే అన్నిటికీ కారణం. అది బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలోనే ఉండి మోక్షాన్ని సాధించవచ్చు. ఈ విషయాన్ని శ్రీ దేవీ భాగవతం మనిషికి బోధిస్తుంది. అష్టాదశ పురాణాల్లో అద్వితీయమైన దేవీ భాగవతం ఉపాసనకు జ్ఞానాన్ని సమన్వయించి, ఒకవైపు ఐహిక ప్రయోజనాలు సాధిస్తూనే, పారమార్థిక సాధనకు మార్గాన్ని అన్వేషించేవారికి దారిచూపుతుంది. ఇందులో 11వ అధ్యాయం మనిషి పాటించాల్సిన నిత్య విధులను వివరించింది. శారీరక, మానసిక వ్యవస్థలను శుభ్రపరచుకుని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే విధానాలెన్నో తెలియజేసింది.
లోకంలో ద్రవ్యజ్ఞానం, దివ్య జ్ఞానాలని రెండు రకాల విజ్ఞతలున్నాయి. లౌకిక విషయాలపై పరిజ్ఞానాన్ని ద్రవ్యజ్ఞానం అంటారు. పారమార్థిక ప్రయోజనాలను సాధించి పెట్టేది, దైవాన్ని పరిచయం చేసేది దివ్యజ్ఞానం. ఈ రెండిటినీ సమపాళ్లలో సమన్వయం చేసుకున్నవారి జీవితాలు ధన్యతను పొందుతాయి. మనిషిని స్వధర్మం ఆయుష్మంతుణ్ని చేస్తుంది. ఆచారపరుడిగా, సత్పురుషుడిగా తీర్చిదిద్దుతుంది.
మనిషి తన స్వధర్మాన్ని గుర్తించాలి. దాన్ని గ్రామ, దేశ ధర్మాలతో సమన్వయించాలి. అంటే తన రోజువారీ పనులన్నిటినీ సామాజిక ప్రయోజన కోణంలో ఆలోచించాలి. ‘హాయిగా బతుకు… బతకనివ్వు’ అనేది దీంట్లో ఉన్న సందేశం. నా హృదయంలో భగవంతుడున్నాడనే భావంతో ఎప్పుడూ ఉండాలి. ఆసన, ప్రాణాయామాలు నియమంగా పాటించాలి. సదాచారంతో మనిషి తనను బలపరుచుకుని ఆచారపరుడు అవ్వాలని దేవీ భాగవతం వివరిస్తున్నది.
– త్రిగుళ్ల నాగరాజు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- durga
- Goddess
- great
- Salutations
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

