‘సిక్కా’ అనే మాట విన్నప్పుడు.. అది ఒక విలుప్తమైన పదంగా అనిపిస్తుంది. అనిపించడం కాదు.. అది వాస్తవం కూడా. ‘సిక్కా’ అనే పదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. ఈ పదానికి ‘నాణెం’ అనే అర్థంలోనే వాడుక ఎక్కువగా ఉండేది. కానీ, ఈ ‘సిక్కా’ కథను చదివితే.. ఇందులో ఒక వృత్తిపరమైన కథాంశంగా మన ముందు కనిపిస్తుంది. నేటికాలం నుంచి క్రితం కాలానికి వెళ్తే.. హోటల్లో డబ్బులు కట్టి, దాని బదులుగా ఓ అల్యూమినియం టోకెన్ తీసుకొని, సర్వర్ దగ్గరకి వెళ్లి వడ్డించుకునే పరిస్థితి కనిపించేది. ఆ ‘టోకెన్’కే ‘సిక్కా’ అనిపేరు. కానీ, ఇప్పుడు ఆ సిక్కా పేపర్లోకి మారింది.
పేపర్ టోకెన్ అయ్యింది. దాంతో సిక్కా తయారుచేసే జీవితాలు నష్టాల్లోకి, కష్టాల్లోకి జారుకున్నాయి. వారి ఆకలి వ్యథలకు అక్షర రూపమే.. ‘సిక్కా’ కథ. అణా, చారాణా, బారాణా.. ఇవి ఒకప్పుడు చలామణిలో ఉన్న నాణేలు. వీటిపైనా అనేక కథలు వచ్చాయి. ‘అణా కథలు’ అని కూడా ఉండేవి. ఒక కాయిన్ చుట్టూ కథల్ని అల్లడం అంటే.. ఒక వ్యవస్థలోని పరిస్థితుల్ని, ఆర్థికమైన స్థితిగతుల్ని ఎక్స్ప్లోర్ చేయడమే! ఆటల్లో నాణేన్ని గాల్లో ఎగరేసి.. ‘చిత్తా? బొత్తా?’ అని ప్రశ్నించుకున్నప్పుడు.. ఒకటి విజయం, ఒకటి విఫలం. కానీ, ఈ రెండూ నాణేన్ని బతికిస్తాయి. నాణేనికి చెలామణీ ఇస్తాయి.
కొత్త నీరు వస్తుంది. పాతనీరు పోతుంది. అలాగే, పాతవృత్తులు నశిస్తూనే.. కొత్త వృత్తులు కూడా పుట్టుకొస్తుంటాయి. అలాంటి పాత, కొత్త జీవితాలను ‘సిక్కా’లో కళ్లకు కట్టింది యువ రచయిత్రి శ్రీ ఊహ. ‘మహోన్నతుడు’లో బైసాకు చేసేది ఒక కొత్త వృత్తిగా కనిపిస్తుంది. ‘ఇలాంటి పనులు కూడా ఉంటాయా?!’ అనిపిస్తుంది. కానీ, అది అనాదిగా వస్తున్నదే! చనిపోయిన జీవాల బొక్కలేరటం, పుర్రెలను, చర్మాల్ని తీయటం, వాటిని సమీప ఫ్యాక్టరీలకు, టోకు వ్యాపారస్తులకు అమ్మటం.. ఇదంతా కూడా ఒక వృత్తే! ఈ పుస్తకంలోని మరో ఆసక్తికరమైన కథ.. షిఫ్ట్ డిలీట్. నిజానికి ఇందులో పేరులేని ‘ఆమె’.. స్త్రీవాద భావాలున్న అమ్మాయి కాదు. ప్రేమికుడు తనపై ఆధిపత్యం చూపిస్తున్నా, హింసకు గురిచేస్తున్నా.. అన్నిటినీ ఓపికగా భరిస్తుంది. చివరికి తెగదెంపులు చేసుకుంటుంది.
మొత్తంగా స్త్రీవాదాన్ని నిలబెడుతుంది. అలాగే మేఘాలయ కేంద్రంగా సాగే.. ‘నే’ కూడా. మాతృస్వామిక వ్యవస్థలోనూ మహిళలు పడే కష్టాలను చాటుతుంది. మానవ సంబంధాలపై వస్తువులు ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పే కథ.. అత్తర్. ఇవే కాకుండా గెలుపు తలుపు, పారగాన్ చెప్పులు, పడ్డ మార్గం, బ్యాంకు బర్త్‌డే, గాజుకన్ను బోడి బెంచి, ప్రెస్ అంకుల్-పద్మిని ప్రీమియర్ కథలు.. వేటికవే సాటి. మొత్తంగా.. సిద్ధాంతాలను, నియమాలను, తాత్విక మార్గాలను, అస్తిత్వాలను ఏ ఇతర భూమికలు, ఆధారాలు నడిపించినప్పటికీ.. పాఠకుడి ప్రయోజనమే అంతిమ లక్ష్యం. ‘సిక్కా’ కథల్లో అది మెండుగా లభిస్తుంది.
రచన : శ్రీ ఊహ,
పేజీలు : 126; ధర : రూ.200
ప్రతులకు : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నవోదయ బుక్‌హౌస్.
ఫోన్ : 70939 06001
-వహీద్ ఖాన్