మజార్
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
కథ
మీ పర్దాదా వక్ఫ్‌బోర్డ్‌కు రాసిచ్చిన జాగ గురించి ఎంక్వైరీ అయితోంది! నువ్వొకసారి ఊరికి వచ్చి పో!’ అని వారం కిందట రహీమొద్దీన్ ఫోన్ చేసిండు. రహీమొద్దీన్ మా ఊరి ముస్లిం పెద్ద. ఈ పొద్దున్నే మహాత్మా గాంధీ బస్టేషన్‌కు వచ్చి బస్సెక్కిన. టికెట్ తీస్కోని కూకున్న. బస్సు.. సిటీ ఔటర్ రింగ్ రోడ్డు దాటింది. నా ఆలోచనలు ఎన్కటి దినాలల్లకు వోయినయి.
మా ఊరంటే.. నేను, బషీర్ గాడు, జెండా చెట్టు.
నల్గొండ జిల్లాల కృష్ణానది ఒడ్డునున్న చిన్న పల్లె మాది. అది పందొమ్మిదొందల డెబ్బైల కాలం. ఊర్లల్ల పోలీస్ పటేల్, మాలీ పటేల్, పట్వారీల వ్యవస్థ ఉండేది. పల్లెలు యవసాయం, చేతి వృత్తులు, జీవాల పెంపకం మీద ఆధారపడి ఉండేయి. రైతులు తాము పండించిన పంటలను, సాకిన జీవాలను ఏరే ఊర్లకు కొంచవోయి అమ్ముకోవాలంటే పోలీస్ పటేల్ ‘రాదారి నామా’ రాసియ్యాల్సి ఉండేది. ‘రాదారి నామా’ అంటే.. రైతు అమ్ముకునే ధాన్యంగని, జీవాలుగని అతని సొంతమని, వాటిని అతను ఎక్కడైనా అమ్ముకునే హక్కు కలిగి ఉన్నాడని ఇచ్చే ధృవీకరణ పత్రం. సొంతూరోళ్లకు ఇబ్బంది లేదుగని, పొరుగూర్లకెళ్లి వచ్చే మారు బేరగాళ్లకు ‘రాదారి నామా’ రాసియ్యాలంటే పటేల్‌కు లంచం ఇయ్యాల్సిందే. ఒకేల లంచం ఇయ్యకవోతే.. వాళ్లను పోలీస్టేషన్‌కు వట్కవోయి.. ‘వీళ్లు దొంగ బేరగాళ్లు!’ అని కేసులు బనాయించి, లాకప్‌ల నూకెటోళ్లు. పోలీస్ పటేల్‌కు ఆ రకమైన ఆదాయం బాగనే ఉండేది.
మా ఊరి పెద్ద పటేల్ కాలం చేసినంక.. నలభై ఐదేళ్లు దాటిన అతని కొడుకు ఛోటేమియాకు వతన్‌దారి హక్కు కింద పోలీస్ పటేల్గిరీ వచ్చింది.
సుమారు వంద గడపల పైన్నే ఉన్న మా ఊర్లే పాతికదాంక ముస్లిం కుటుంబాలు ఉంటయి. ఛోటేమియా పటేల్ ఒక్కనికే ముప్పయి ఎకరాల యవసాయ భూమి ఉంది. ఇంకో ఇద్దరు ముగ్గురు సన్నకారు రైతులున్నరు. మిగతా ముస్లింలు అందరూ భూమి లేనోల్లే. మా బషీర్ వాళ్లకు గుడా భూమి లేదు. వానికి అక్క, అన్న ఉన్నరు. వాళ్ల అబ్బు, అన్న యవసాయం పనులే చేసేది.
మా ఊర్లే ఉర్దూ, అరబ్బీ సదూకున్నది ఛోటేమియా ఒక్కడే. ఊర్లే ఔరంగజేబు కాలంనాటి మసీదు ఉంది. ఛోటేమియా గా మసీదుల ముస్లింలకు నమాజు సద్వించేటోడు. ముస్లింలకు మంచి, చెడు, రీతి రివాజు చెప్పటానికి ఛోటేమియానే పెద్ద దిక్కు.
నాకు ఎర్క వచ్చేటప్పటికే ఛోటేమియా పటేల్ భార్య సచ్చివోయింది. పటేల్‌కు ఇద్దరు కొడుకులు. వాళ్లకు కొలువులు వచ్చినయి. లగ్గాలై పెళ్లాం పిల్లల్తో కోదాడలో ఉంటుంరు. ఊర్లే పటేల్ ఒక్కడే ఉండేటోడు. వంట వగైరా పనులు బషీర్గాని తల్లే చేసి వెట్టేదంట.
ఛోటేమియా భార్య సచ్చివోయిన కొన్నాళ్లకు బషీర్ గాడు పుట్టినడంట. బషీర్ గాని పుట్టుక ‘ఒక రహస్యం’ అని ఊర్లే గుసగుసలు ఇన్పిస్తుండేయి. ‘అన్నెం పున్నెం అల్లాకే ఎర్క’ అని చెంపలు ఏసుకునేటోళ్లు గుడా ఉన్నరు. ఛోటేమియా పటేల్.. బషీర్ గాడ్ని బవు గారాబంగా సూస్కునేటోడు. అది ఊరోళ్లు అనుమానించటానికి ఊతమిచ్చింది. ఛోటేమియాకున్న నాలుగు
అరకల యవసాయాన్ని బషీర్ అబ్బు బురాన్, అన్న హుసేన్ సూస్కునేటోళ్లు.
మా ఊరి బడిల ఏడో తరగతి దాంకనే ఉంది. నేను, బషీర్, ఇంకొందరు పిల్లలం ఊరికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న దామరచర్ల హైస్కూల్ల ఎనిమిదో తరగతి సదూకుంటున్నం. పొద్దటి బడి ఇడ్సివెట్టినాంక పిల్లలందరం ఒక్కాడనే కూకోని సద్ది తినేటోళ్లం. కొంతమందిమి సజ్జ, జొన్న సంకటి, రోటి పచ్చళ్లు తెచ్చుకుంటే, ఒకల్లిద్దరు పెసర, ఉలవ గుగ్గిళ్లు తెచ్చుకునేటోళ్లు. అందరం ఒక్కాడ కూకుంటే.. బషీర్గాడు ఒక్కడే మా దిష్టి తగుల్తదని దూరంగవోయి తినేటోడు. వాని టిఫిన్ డబ్బాల వారంల ఐదు రోజులు నాన్‌వెజ్, తెల్లన్నం ఉండేది. ఆ రోజులల్ల ఊర్లే ఏ కులపోళ్లయిన గని యాటను కోసుకున్నరంటే.. ఒక పోగు పటేల్ ఇంటికి బరాబర్గ రావాల్సిందే. కిష్ణలో పట్టే చేపలు, ఎరకలోళ్లు అడవిల వేటకువోయి బురకలు, కౌజులు, కుందేళ్లు, జింకల్ని వేటాడి తెచ్చేది. వాటిల్ల గుడా పటేల్ వాటా పటేల్‌కు రావాల్సిందే. ఛోటేమియా పటేల్ ఇంట్లె వంట చేసేది బషీర్ వాళ్ల అమ్మే కాబట్టి.. బషీర్ గానికి రోజూ పండగే. మా అందర్లే వాడొక్కడే ప్రతిరోజూ మధ్యాహ్నం మహారాజ భోజనం చేసేటోడు.
బషీర్ ఎనిమిదో తరగతి సద్వి ఆపేసిండు. పటేల్ చేలల్లనే యవసాయ పనులకు వోతుండు. పటేల్ పొలాలకు తనూ వారసుడినే అనే ఫీలింగ్‌తో ఉండేటోడు.
గా టైంలనే స్కూల్ అటెండర్‌గా కొలువు చేసే మా అబ్బు అనారోగ్యంతో కాలం చేసిండు. ఊర్లే మాకు మట్టి మిద్దెలు తప్ప ఏరే ఆస్తుల్లేవు. ఏడాది కిందట మా పెద్దన్నకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల ఎల్డీసీగా కొలువొచ్చింది. మిర్యాలగూడల చేస్తుండు. మేం అందరం మిర్యాలగూడకు షిఫ్ట్ అయినం. నేను, రెండో అన్న ఇద్దరం మిర్యాలగూడ హైస్కూల్ల సద్వుకుంటున్నం.
అబ్బు చనిపోయిన నాలుగో ఏడు పెద్దన్నకు పెళ్లయింది. అప్పటికీ మా రెండో అన్న పీయూసీ పూర్తయింది. నా చదువు ఇంటర్‌తో ఆగివోయింది. నేను టైలరింగ్ నేర్చుకున్న. పెద్దన్నవాళ్ల కొత్త సంసారాన్ని వాళ్లకు వొదిలేసి.. అమ్మ, నేను, రెండో అన్న మల్ల మా ఊరికి షిఫ్ట్ అయినం. అమ్మకు వచ్చే పెన్షన్, నా టైలరింగ్‌లో వచ్చే డబ్బులతో అమ్మే ఇంటిని లాక్కొస్తొంది. రెండో అన్న జాబ్ ప్రయత్నం చేస్తూ ఖాళీగనే ఉండు.
అప్పటికే బషీర్ గానిలో శానా మార్పులొచ్చినయి. తెచ్చిపెట్టుకున్న ఠీవి మెయింటేయిన్ చేస్తుండు. నూనూగు మీసాలను దువ్వి కోరగా మెలేస్తుండు. తెల్ల పాలిష్టర్ చొక్కా, ఎర్రంచు తెల్ల కాటన్ లుంగీ కట్టుకొని, గట్టి వెదురు లాఠీకి తోలు బెల్ట్, దానికి మూడు గజ్జెలు కట్టి, స్పెషల్‌గా తయారు చేయించిన ఎర్రపూల కిర్రు చెప్పులేస్కోని, మస్కూర్లను ఎంటేస్కోని.. తనే ఊరికి అసలు సిసలు పోలీస్ పటేల్‌ని అన్నట్టు వీర లెవల్లో తిరుగుతుండు.
ఛోటేమియా పటేల్ ముసలోడయి మంచాన వడ్డడు. అతని కొడుకులకు గవర్నమెంట్ కొలువులు ఉన్నయి కాబట్టి పటేల్గిరీ చేయటానికి వాళ్లు రారు. ఇంక తనే పోలీస్ పటేల్ అయితనని ఊర్లే చెప్పుకొంటున్నడంట. వాని ఫాల్స్ దర్పానికి, వాడు కంటున్న పగటి కలలకు పట్టపగ్గాలు లేకుండావోయినయి.
మా రెండో అన్నకు ఆర్టీసీల కండక్టర్ కొలువొచ్చింది. నేను టైలరింగ్ మానేసి నల్గొండ ఎన్జీ కాలేజ్‌ల డిగ్రీల చేరిన.
పద్దెనిమిదేళ్లకే బషీర్గాడు పెళ్లి చేసుకుండు. పెళ్లయిన సంవత్సరానికే ఆడపిల్ల పుట్టింది. అదే ఏట ఛోటేమియా పటేల్ కాలం జేసిండు. బషీర్ గాడు ఊరికి తనే పోలీస్ పటేల్ అయితననే నమ్మకానికొచ్చిండు. ఛోటేమియా పటేల్ ‘చాలిస్మా’ కార్యం అయినంక, అతని కొడుకులు తమ ఆస్తుల పంపకాలకు ఊరి పెద్దల్ని కూకోవెట్టింరు. పొలాలు, ఇల్లు, గొడ్డు-గోదా వగైరాలన్నీ రెండు భాగాలుగా పంచుకుంరు.
బషీర్ వాళ్ల అబ్బు, కుటుంబం అంతా ఆడికొచ్చి కూకుంరు. ఇన్నేండ్లవట్టి ఇంటిల్లిపాది పటేల్ ఇంట్లే, చేలల్లా పనులు చేసినందుకు, ఛోటేమియాను కంటికి రెప్పలా సూస్కున్నందుకు తృణమో-ఫణమో ఇయ్యకపోతరా? అనే ఆశ వాళ్లను అక్కడ కూకోవెట్టింది.
పంపకాలన్నీ అయినంక..
“ఇయ్యాల్టితో మా ఇంటితోని, మా యవసాయ భూమితోని గనీ, బురాన్ కుటుంబానికి ఎస్వంటి సంబంధం లేదు!” అని చెప్పి, పటేల్ కొడుకులు పెద్దల సమక్షంలో బురాన్ వాళ్లను నిర్దయగా బేదఖల్ చేసింరు.
పంచాయితీల కూకున్న పెద్దగొల్ల అబ్బయ్య కలగజేస్కోని..
“పాతికేళ్లవట్టి మీ ఇంట్లే, చేలల్లో బురాన్ కుటుంబం దునియా చాకిరి చేసింది! మా కళ్లతో సూసినోళ్లం! వాళ్లకేం ఇయ్యకుండ వదిలేసి వోతరా?” అనడిగిండు.
“ఒకేల అట్ట ఇయ్యకున్నాగనీ, పదెకరాల భూమిని నాలుగేళ్ల పాటు తక్కువ కౌలుకు బురాన్ వాళ్లకు ఇస్తే వాళ్లకు న్యాయం చేసినట్టు అయితది! తర్వాత పంచుకోంరి! ఆలోచించురి!” అన్నడు సాకలి పాపయ్య. వాళ్లిద్దరి మాటల్ని పటేల్ కొడుకులుగని, పెద్ద మడ్సులుగని పట్టించుకోలేదు.
‘మాకేమైనా ఇస్తరా? ఇయ్యరా?’ అని అడిగే హక్కులేని బురాన్ వాళ్ల కుటుంబం.. నిరాశగా, అవమాన భారంతో ఆడంగ లేసి ఇంటికి ఎళ్లివోయినరు. ఈ యవ్వారమంతా సూసిన డప్పు ఎంకడు బయటికొచ్చి కాండ్రించి ఉమ్మేసి ఎళ్లివోయిండు.
పటేల్ ఛోటేమియా గనీ, అతని కొడుకులు గనీ బురాన్ కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తరని ఊర్లే ఎవ్వరు అనుకోలే. బురాన్ వాళ్లు గుడా అనుకోలే. ఊర్లే కూలి పనులు దొరుకుత లేవు. గడిచిన రోజుల్ని తల్చుకొని కుమిలి వోతంది ఆ కుటుంబం. ఉంటే తిని, లేన్నాడు పస్తులు పంటుంరు.
ఊరికి పటేల్ అయితనని బషీర్గాడు కన్న కలలన్నీ గాలిలో కల్సివోయినయి.
‘ఆకలి కడుపు కోసం పిడికెడన్నం దొరికితే సాలు యా అల్లాహ్’ అనే వెతుకులాట. సంసారం ఈదటానికి ఏ ఆధారం లేదు.
గంపెడు కోర్కెల్ని నెత్తిన వెట్టుకొచ్చిన బషీర్ పెళ్లం పస్తులు ఉండలేక నిరసనకు దిగింది. ఇంటి బాధల్ని బయట ఎవరికీ చెప్పుకోలేక, దిగమింగుకోలేక ఇంటిల్లిపాదీ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంరు. తమ గురించి ఊరోళ్లు ఏం అన్కుంటున్నరో అనే న్యూనత ఒకవైపు. సరైన తిండి లేక ఆలోచనల ఒత్తిడి మరోవైపు. దాంతో బషీర్ గానికి టీబీ సోకింది. పిడికెడు మెతుకులకే తిప్పలు వడ్తుంటే వైద్యానికి డబ్బులెక్కడియి?
పాతికేళ్లవట్టి ఊరోళ్లు ఎవరేం అనుకున్నగనీ నిందలు మోస్తూ, పటేల్‌కు కట్టుకున్న భార్యగుడా చేయలేనన్ని సేవలు చేసింది బషీర్ గాని తల్లి. పటేల్ కొడుకులు తండ్రిని విల్సుకవోయి ఒక్కనాడైనా తమ భార్యలతో సేవలు చేయించింది లేదు. పైగా బషీర్ ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతలకు రాంగనే కొడుకులు, కోడళ్లు ఊర్లే దిగి.. కళ్లాలైనంక దిగుబడిని అమ్మి సొమ్ము చేస్కోని ఎళ్లివోయేటోళ్లు.
ఎంత మోసం! ఎంత దగా! కనీసం బషీర్ గాని తల్లి చేసిన చాకిరికైనా, ఆమె మోసిన అపనిందలకైనా ఓ రెండెకరాల భూమి రాసిస్తడేమో ఛోటేమియా.. అని ఊరంతా అన్కుంరు. అట్ట జరగలే. ఛోటేమియా కొడుకులిద్దరు ఆస్తుల్ని సమంగా పంచుకొని ఎవరి దారిన వాళ్లు ఎళ్లివోయింరు.
“వీళ్లేం మనుషులు? వీళ్లేం ముస్లిం మత విశ్వాసులు? నెత్తిన టోపీలు, జానెడు గడ్డాలు జనాలకు సూపెట్టటానికేనా? మనిషితనం ఉండక్కర్లే? గీ దొంగ భక్తి ప్రదర్శనలెందుకూ? కట్టుబానిసల్లా వాళ్లను వాడుకొని, వాళ్లను గాలికొదిలేసి అన్యాయం చేస్తరా? థూ! ఈళ్ల బతుకులు చెడ!” అని వాళ్లను తిట్టని నోరు లేదు ఊర్లే.

Mazar 1
నేను కాలేజీ సెలవుల్లో ఇంటికొచ్చిన. పొద్దున్నే జెండా చెట్టు అరుగు మీద కూకోని వచ్చి పోయేటోళ్లని పల్కరిస్తున్న. ఇంతల బషీర్ గాడు వచ్చి నాకు ఎడంగా కూకుంటూ..
“మేరి జోరు మేరేకు మార్తీ హైరే!” అన్నడు.
వానికేసి చూసిన. అస్తిపంజరానికి తోలుతిత్తి తొడిగినట్టున్నడు. వాడు, నేను ఎన్నిసార్లు కొట్టుకున్నమో? అవన్నీ మర్సి మళ్ల ఎన్నిసార్లు కల్సి ఆడుకున్నమో? వాడేనా వీడు? చాలా బాధేసింది. వాడు ఎవర్నీ లెక్కవెట్టే రకం కాడు. లౌక్యం తెల్వని అహంభావి. మళ్ల వాడే..
“నా భార్య అన్నం సక్కంగ వెడ్తలేదురా! ఆకలైతోంది! ఇరువై రూపాయలుంటే ఇయ్యి! హోటళ్ల ఇడ్లి తినొస్త!” అన్నడు.
వాని మాటలిని నా కళ్లల్ల నీళ్లు తిరిగినయి. కళ్లు తుడ్సుకొని, ఇరువై రూపాయలు తీసిచ్చిన. వాడు నెమ్మదిగా అరుగు దిగి హోటల్ బాట వట్టిండు.
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చేవరకు ఐదు నెలల కాలం గడ్సింది. తిరిగి ఊర్లే బస్సు దిగంగనే బషీర్ గాని కుటుంబం గురించే ముందుగాల ఆరా తీసిన. ఏదయితే వినకూడదని అనుకున్ననో.. అదే వార్త విన్న.
బషీర్ గాని పెళ్లం రోగిష్టి మొగునితో సంసారం తన వల్ల కాదని మెళ్లోని ‘ఛడా’ తెంపి, బషీర్ ముఖాన కొట్టి బిడ్డను తీస్కోని ఎళ్లివోయిందంట. భార్య వోయిన రెండు నెలలకే బషీర్ సచ్చివోయిండంట. వాడు సచ్చిన నెల రోజులకే వాళ్లమ్మ, ఇంకో నెల తేడాతో వాని అబ్బు గుడా సచ్చివోయిండని తెల్సింది. మిగిలినోళ్ల బతుకులు గుడా చిందర వందర అయినట్లు ఎర్కయింది.
ఊర్లల్ల టెలిఫోన్లు లేని రోజులయి. నేను పరీక్షలు రాసి తిరిగి ఇంటికి వచ్చేవరకు పట్టిన ఐదు నెలల కాలంల ఒక కుటుంబం చిరునామా లేకుండా మాసి వోయింది.
అట్టా బషీర్ గాని కుటుంబం గురించి ఆలోచిస్తున్న నేను..
“చాపలపల్లి లాస్ట్ స్టేజీ! దిగేటోల్లెవరో జల్దీ దిగాలండి!” అన్న కండక్టర్ కేకతో తేరుకొని.. వెంట తెచ్చుకున్న మందుల బ్యాగ్ సంకల వెట్టుకొని బస్సు దిగిన.
ముప్పయ్యేండ్ల తర్వాత పుట్టిన గడ్డమీద కాలు వెట్టిన. మనసులో ఏవేవో జ్ఞాపకాలు మెరుపులెక్క మెరిసి మాయం అయితున్నయి.
ఊరు ఎర్కపట్టలేనంతగా మారింది. నన్ను గుర్తువట్టే వాళ్లెవరైనా కన్పడ్తరేమోనని చూసిన. ఎవరూ అగ్పడలే.
నేను హైద్రాబాద్‌కు మకాం మారక ముందే మా ఊర్లే సిమెంట్ ఫ్యాక్టరీ పడింది. స్థానికులకు ఉద్యోగాలు ఇయ్యాలనే డిమాండ్‌తో నడిచిన బలమైన ఉద్యమంలో ఉద్యమ నాయకులు బలవడ్డరు. నిజాయితీ గల ఉద్యమ కార్యకర్తలకు ఫ్యాక్టరీ యాజమాన్యం గేట్లు మూసేసింది. ఆ బహిష్కృత బాధితుల్లో నేనూ ఒకడిని. అప్పుడే పొట్ట చేత పట్టుకొని పట్నానికి మకాం మార్చిన.
టైం సూసుకున్న. రెండైతోంది. ఆకలిగా ఉంటాన హోటళ్ల టిఫిన్ చేసిన. మా పాత ఇంటిని, జెండా చెట్టును సూడాలన్పించి ఆడికొచ్చిన. పాత గుర్తులు కొన్ని.. క్షణంలో గిర్రున తిర్గినయి. ఇంటివైపు సూసిన. ఇప్పుడది మా ఇల్లు కాదు. కొనుక్కున్నోళ్లు మిద్దెల్ని కూల్చి బిల్డింగ్ కట్టింరు. జెండా చెట్టువైపు సూసిన. ఎన్కట పచ్చని ఆకుల్తో నిగనిగలాడ్తుండేది. దాని మీద రకరకాల పక్షులు వాలి సందడి చేసేయి. ఇప్పుడది ముసలిదైంది. కొమ్మలు ఎండివోయి కళేబరం లెక్కుంది.
నేను మా ఊరికి రాటానికి ఈ జెండా చెట్టు ఒక కారణం. చెట్టు చుట్టూ ఉన్న జాగ మా ముత్తాత ‘వక్ఫ్ బోర్డ్’కు దానం కింద రాసిచ్చింది. ఈ చెట్టుకు ‘గ్యార్ మి’ జెండాలు, కందూరు జెండాలు కట్టి ‘ఫాతెహా’లు ఇచ్చేది. ముస్లింలే కాదు, ముస్లిమేతరులు గుడా భక్తిశ్రద్ధలతో కొబ్బెర కాయలు కొట్టి షక్కెర ఫాతేహాలు ఇప్పించేది. ఈ జాగ, మొహర్రం పండుగకు పీర్లను కూకోవెట్టే ‘ఆషిర్ ఖానా’, ముస్లింల ‘ఖబ్రస్థాన్’ జాగ గుడా మా ముత్తాత వక్ఫ్ బోర్డ్‌కు దానం కింద రాసిచ్చిందే. జెండా చెట్టుకు, ఆషీర్ ఖానాకు ట్రస్టీగా వక్ఫ్ బోర్డ్‌లో ఇప్పుడు గుడా మా అబ్బు పేరే ఉంది. ప్రభుత్వాలు మారి వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై కొంత గందరగోళం చోటు చేసుకున్నంక వెరిఫికేషన్ జరుగుతోంది.
‘వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ట్రస్టీల వారసులు ఎవరైనా ఉంటే పిలిపించండి!’ అని ఫీల్డ్ ఆఫీసర్ రహీమొద్దీన్కు చెప్పినడంట. అందుకే రహీమొద్దీన్ నాకు ఫోన్ చేసి ఊరికి వచ్చి పొమ్మన్నడు.
రహీమొద్దీన్కు ఫోన్ కలిపి..
“మనూరికి వచ్చి మా పాత ఇంటి కాడున్న! ఎక్కడికి రానూ?” అనడిగిన.
“మస్కూరి జిలానీని బైక్ ఇచ్చి పంపిస్త! ఖబ్రస్థాన్ కాడికే రా!” అన్నడు రహీమొద్దీన్.
కాసేపట్లనే బైక్ మీద ఒకతను వచ్చి..
“అస్సలాం అలైకుం! రహీమొద్దీన్ పంపిండు సాబ్!” అన్నడు.
అతనికి ‘వాలేకుం!’ చెప్పి, బైక్ ఎక్కి కూకున్న. పది నిమిషాలల్ల ఖబ్రస్థాన్ కాడ దింపిండు.
అక్కడ రహీమొద్దీన్తోపాటు ఇద్దరు ఊరోళ్లు ఉన్నరు. నన్ను పరిచయం చేసి..
“ఆషిర్ ఖాన, జెండా చెట్టు జాగకు ట్రస్టీగా మీ అబ్బు పేరే ఉంది. ఊర్లే పరిస్థితులేం బాగ లేవు! అందుకనీ వాటికి ట్రస్టీగా మీ అబ్బు పేరే కొనసాగించేటట్టు తీర్మానించినం! నీకు సమ్మతమే కదా?” అనడిగి, మల్ల కాసేపట్లనే..
“ఇప్పుడున్న ఖబ్రస్థాన్ జాగ గుడా మీ పర్దాదా దానం చేసిందే! జనాభా పెరిగింది! ఇప్పుడది సరిపోత లేదు! ఖబ్రస్థాన్‌కు ఆనుకొని ఉన్న ముప్పయి గుంటల భూమి మీదే! మీ అబ్బు పేరనే ఉంది. మీరు పెద్ద మనసుతో ఆ భూమిని ఖబ్రస్థాన్‌కు ఇస్తే ముస్లింలకు మేలైతది. ఖబ్రస్థాన్‌కు భద్రత లేదు. మీరు ఆ జాగ ఇస్తే, అది కలిపేసి ఖబ్రస్థాన్ చుట్టూత ప్రహరీ కట్టిద్దామని అనుకుంటున్నం. మీ అన్నలు, వాళ్ల పిల్లలు గుడా సంతకాలు వెడ్తమన్నరు. నిన్ను ఓ మాట అడుగమన్నరు. నువ్వు గుడా ఒప్పుకొంటే బాగుంటది!” అన్నడు రహీమొద్దీన్.
కిష్ట మడకు ఖబ్రస్థాన్‌కు మధ్యల ఉంటది మా భూమి. అది మాకు ఏ రకంగానూ పనికి రాదు. అందుకని..
“పర్వాలేదు. ఖబ్రస్థాన్‌కు తీసుకోండి! నేను గుడా సంతకం పెడ్తా!” అని చెప్పా.
అప్పుడే వక్ఫ్ బోర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చిండు. రహీమొద్దీన్ నన్ను అతనికి పరిచయం చేసి, మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అతనికి చెప్పిండు. అప్పటికే అతను పేపర్స్ రెడీ చేసుకొని పెట్టుకొనుండు. గా పేపర్స్‌పై నా సంతకాలు తీసుకుండు. అందరం అక్కడికెల్లి రిటర్న్ అయినం.
ఖబ్రస్థాన్కెళ్లి బయటికొస్తుంటే మెయిన్ గేటుకు కుడి పక్కన నాలుగు అడుగుల ఎత్తులో తెల్ల పాలీష్ రాళ్లతో కట్టిన ‘మజార్’ కనిపించింది. అక్కడ అదొక్కటే ప్రత్యేకంగా కనిపిస్తోంది. నేను ఖబ్రస్థాన్ ఎన్కంగ రాటాన ఆ ‘మజార్’ నా కంట పడలే. మజార్‌పై వివరాలు చెక్కిన బండను గమనించకుండా..
“ఈ మజార్ ఎవరిది?” అని రహీమొద్దీన్ను అడిగిన.
“ఛోటేమియా పటేల్‌ది! ఆయన కొడుకులు కట్టిచ్చింరు. ఇది కట్టేటప్పటికే నువ్వు ఊరు ఇడ్సివెట్టి ఎల్లివోయినవ్!” అన్నడు రహీమొద్దీన్.
ఆ మజార్ పటేల్ ఛోటేమియాదని ఇనంగనే.. నాకు మల్ల బషీర్ కండ్లల్ల మెదిలిండు.
“బషీర్ది, వాళ్ల అమ్మి, అబ్బు మజార్లు ఉండాలె గదా? యాడున్నయి?” అనడిగిన.
“వాళ్లయా? అయి ఎప్పుడో నేల మట్టమైనయి. వాటి మీద తుమ్మలు గుడా మొల్సినయి!” అని కొంచెం దూరంలో తుమ్మ పొదలవైపు సూపించిండు రహీమొద్దీన్.
అటు సూసిన. ఆడ సమాధులున్న ఆనవాళ్లే లేవు. తలాపున, కాళ్ల కాడ నాటిన నాపరాళ్లు మాత్రం సగం మట్టిలో కూరుకువోయి కనిపిస్తున్నయి. పటేల్ ఛోటేమియా మజార్ తెల్ల పాలీష్ బండలతో దర్జాగా వెలిగిపోతుంటే.. అతనింట్లే బానిసల మాదిరి చాకిరి చేసిన బురాన్, అతని కుటుంబ సభ్యుల మజార్లు ఆనవాళ్లు లేకుండా వోయినయి. అంటే ఈ లెక్కన..
ఐదొందల ఏండ్ల నాటి మొఘల్ చక్రవర్తులు కట్టిన రాజ మహళ్లు, రాణీవాస అంతఃపురాలు, శత్రు దుర్భేధ్య కట్టడాలు, వారి అమర ప్రేమ చిహ్నలు, వారు నిర్మించిన ఆధ్యాత్మిక మందిరాలు, అద్భుత నిర్మాణ శైలితో కట్టుకున్న వారి వంశజుల సమాధులకు మేం వారసులమంట! అదెలా? ఎంత విడ్డూరం!?
నాటి చక్రవర్తులు తమ కీర్తిని దిశ దిశలా విస్తరించుకోటానికి చేసిన దండయాత్రల్లో రాలిపడిన తలలకు, మొండాలకు కదా మేం వారసులం! వారి చారిత్రక కట్టడాల శిథిలాల కింద చితికిన శ్రమజీవుల ఆక్రందనలకు కదా మేం వారసులం! ఆ వినిపించే అశక్త శోక హాహాకారాలు మా తాత, ముత్తాత, ముత్తాతల ముత్తాతల, ముత్తాతలవే కదా!
పటేల్ మజార్‌కు, పటేల్ ఆస్తులకు, పటేల్ చేసిన చాటుమాటు దాష్టికాలకు.. బురాన్, బషీర్, వాళ్ల కుటుంబీకులెవరూ బాధ్యులు, హక్కుదారులు కానట్లే..
మొఘల్ సామ్రాట్టుల రాజ్య విస్తరణ కాంక్షలో చిమ్మిన రక్తసిక్త చరిత్రకు మేం బాధ్యులం కాదు. వారి ఆర్థికావసరాలకు చేసిన యుద్ధాల్లో దోచి దాచుకున్న వారి భాండాగారంలోని ధనరాసులకు మేం వారసులం కాదు. నాటి రాచరిక వ్యవస్థలో గుర్రపు డెక్కల కింద నలిగింది మేమే. నేడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పిడికెడు మెతుకుల కోసం నలుగుతోందీ మేమే. మావైపు గురిపెట్టి చూపుతున్న ఆ చూపుడు వేల్లెవరియీ? తెరిచిన పుస్తకంలాంటి మా బతుకులపై అద్దుతున్న విద్రోహ ముద్రికలెవరియీ? రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేయ బూనుకున్న శక్తులకు ఊతమిస్తోందెవరూ?
నేనిలా ఆలోచిస్తుండగనే అసర్ నమాజ్ అజాఁ పిలుపు ఇనిపించింది. ఒక్కొక్కరూ వానపాముల్లా మసీదు బాట వట్టింరు. రహీమొద్దీన్ ఊర్లోని ముస్లింలందరి తరఫున నాకు షుక్రియా చెప్పి..
“మా ఇంటికి పోదం పా! రేపొద్దున్నే వోదువు!” అన్నడు.
“సారీ! వేరే పనులున్నయి! మల్లెప్పుడైనా వస్తలే!” అన్న.
“సరే!” అని చేయి కలిపి.. మసీదుకు ఎలివోయిండు రహీమొద్దీన్.
ఆడనే నిలవడ్డ మస్కూరి జిలాని..
“బస్టాండ్ల ఇడ్సివెట్టనా సాబ్?” అనడిగిండు. నేను ‘పోదం పా!’ అన్నట్లు తలూపి.. బషీర్, వాని అమ్మి, అబ్బుల యాదిల భారమైన మనసుతో బైక్ ఎక్కి కూకున్న. బైక్ బస్టాండ్ దిక్కుగా కదిలింది.
ఉర్దూ పదాలకు అర్థాలు
మజార్: సమాధి
పర్దాదా: ముత్తాత
ఫాతేహా: సమర్పణ
ఖబ్రస్థాన్: బొందల గడ్డ (శ్మశానం)
ఆషిర్ఖానా: పీర్ల చావిడి
చాలిస్మా: వ్యక్తి చనిపోయాక 40 రోజులకు చేసే కార్యం.
ఛడా: నల్లపూసల దండ
అసర్‌కి నమాజ్: ముస్లింలు ఐదుపూటలా ఆచరించే నమాజులలో మూడవది.
– సయ్యద్ గఫార్, 81432 53116
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Mazar
- special prize
- won
- ₹5000
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

