Valentine’s Day | ప్రపంచం అణువులతోనో, పరమాణువులతోనో నిర్మితం కాలేదు. కథలు, ఉప కథలు, అనుబంధ కథలతో ప్రాణం పోసుకుంది. నిజమే, ప్రతి మనిషికీ ఓ కథ ఉంటుంది. ప్రతి కథలో అతను తనను తాను వెతుక్కుంటాడు. ఇక ప్రేమికులకైతే జీవితమే ఓ ప్రేమకథా ప్రయాణం. తొలి పరిచయం ఓ కథ. మలి భేటీ ఒక కథ. కలిసి తాగిన ఫిల్టర్ కాఫీ ఓ కథ. పక్కపక్కన కూర్చుని చూసిన హారర్ మూవీ ఒక కథ. గోడ దూకి లాంగ్‌డ్రైవ్ వెళ్లిన జ్ఞాపకమూ ఒక కథే. పెద్దల్ని ఒప్పించడం.. కాదంటే ఎదిరించడం, లేదంటే లేచిపోవడం, పస్తులే పరమాన్నంగా బతికేయడం,ఇరుకిరుకు గదినే ఇంద్రభవనంలా ఊహించుకోవడం.. పైకప్పు చిల్లుల్లోంచి చుక్కల్ని లెక్కబెట్టడం, జోరువానలో వడగళ్లు ఏరుకోవడం, వణికించే చలిలో ఐస్‌క్రీమ్ చప్పరించడం.. తొలి శుభవార్తకు పరవశించి పండుగ చేసుకోవడం.. మొత్తానికి, అచ్చంగా తెలుగు సినిమా ైక్లెమాక్స్లానే అమ్మానాన్నలూ – అత్తామామలూ.. ఎర్రబస్సు దిగొచ్చి కస్సున అరిచేయడం. అంతలోనే, మనసు మార్చుకుని ‘ఒకరు కాదు.. ఇద్దరు కావాల్సిందే. ఒక మనవడు. ఒక మనవరాలు’ అంటూ జోకేసి.. కేకు తినిపించడం. రెండున్నర గంటల సినిమాకైతే చివర్లో ‘శుభం’ పడుతుంది. కానీ, ఇది జీవితం! ఆరు పదుల్లోనూ ఆ ఇద్దరూ ప్రేమపక్షులే. ఎన్ని ఘట్టాలు, ఎన్ని ఉద్వేగాలు, ఎంత ఉత్కంఠ. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆనందబాష్పాలు. ఆ తర్వాత ఎప్పుడో.. ఏ వాలెంటైన్స్ డే నాడో.. ఏకాంతంలో ఆ కథలన్నీ నెమరేసుకుంటే.. పారేసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రాఫ్ మళ్లీ దొరికినంత ఆనందం!
వారం వారం ‘బతుకమ్మ’లో ప్రచురితమయ్యే చిట్టికథల్లోంచి.. ఏర్చికూర్చిన ప్రేమ కథల సమాహారం ఇది. మీరు చదవండి. మీకు ఇష్టమైనవారితో చదివించండి. ప్రేమలోక పౌరులతో షేర్ చేసుకోండి. సోషల్ మీడియా అకౌంట్లో స్టేటస్‌గా పెట్టుకోండి. ఎందుకంటే.. ఇవన్నీ మీ కథలే. నాయికానాయకులూ మీరే. ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉంటే.. ఆ బంధం ఇంకొంత బలపడుతుంది. ‘సింగిల్. రెడీ టు మింగిల్’ బ్యాచ్ అయితే.. త్వరలోనే అన్వేషణ ఫలిస్తుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే!
‘చాలా రోజులైంది. మీ పాస్వర్డ్ మార్చుకోండి’అంటూ బ్యాంకు నుంచి మెసేజ్. ఆమె వెంటనే మార్చేసింది..బ్యాంకును! ప్రేమించినవాడి పేరు.. ఎలా మార్చుకుంటుంది పాపం?
ఆమె కాలేజీకి రాకపోతే,ఎందుకు రాలేదని..నన్ను అడుగుతారు.నేను టాపర్‌గా నిలిస్తే ఆమెకు కంగ్రాట్స్ చెబుతారు. క్యాంపస్.. మమ్మల్ని ప్రేమికులుగా గుర్తించింది!
ఐదేండ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆ అమ్మాయి.. ‘ఇంకా పెండ్లి చేసుకోలేదా?’ అని అడిగింది అతణ్ని. ‘ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా?’ అని ఆ మాటకు అర్థం.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు అడ్డొచ్చాయి. ఒకరిది అగ్రవర్ణం. ఒకరు దళితులు. ఇరవై ఏండ్ల తర్వాత ఇద్దరి పిల్లలూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఆస్తులు అడ్డొచ్చాయి. ఒకరు సంపన్నులు. ఒకరు నిరుపేద.
ఆమె.. అతని చేతికి ఇంజెక్షన్ ఇచ్చింది. అతనికి మాత్రం గుండెల్లో గుచ్చుకున్నది. నర్స్- పేషెంట్ ప్రేమ కథ ఆరంభం.
సాఫ్ట్వేర్ ఇంజినీర్. లవ్ ఫెయిల్యూర్. సూసైడ్ అటెమ్ట్. బ్రెయిన్ డెడ్. ఇంకా పనిచేస్తున్న గుండెను అంబులెన్స్‌లో అపోలోకు తరలిస్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ జామ్. ఎవరిదో శవయాత్ర. హఠాత్తుగా ఆ గుండె ఆగిపోయింది. పాడె మీద అతడి ప్రేయసి.
ఆ శాడిస్టు ప్రేమికుడు ఆమెను ఇరవై ఎనిమిది ముక్కలుగా నరికేశాడు. ‘ఇరవై తొమ్మిది ముక్కలు చేయాల్సింది డియర్. మరిచిపోయావా? మనం కలుసుకున్నది ఫిబ్రవరి 29న.. లీపు సంవత్సరం’ ప్రేయసి గుండె ఘోషిస్తూనే ఉంది.
నాన్న ఇచ్చిన డైమండ్ నెక్లెస్, అన్నయ్య కొన్న ఆపిల్ ఫోన్, బాబాయ్ పంపిన మేకప్ కిట్.. ఆ ఖరీదైన పుట్టినరోజు బహుమతుల మధ్య ఇరుక్కుపోయిన ఓ లేత రోజాను ఆమె జాగ్రత్తగా బయటికి తీసింది. అది.. ‘ప్రేమ’ గులాబీ!
రైల్వేస్టేషన్‌కు వచ్చి.. ట్రెయిన్ ఎక్కించి.. బండి కదిలే వరకు కిటికీ పక్కన నిలబడి.. పచ్చలైటు పడగానే హ్యాపీజర్నీ చెప్పి.. దిగాలుగా కంటతడి పెట్టేంత వరకూ తెలియదు.. నేనంటే అంత ప్రేమని!
‘నిజమే, నీ ప్రేమను తిరస్కరించాల్సింది కాదు. ఐ లవ్ యూ.. లవ్ యూ సో మచ్’ ..ఆమె మనసు తెరుచుకుంది. అతని శవపేటిక మూసుకుంది.
‘ఆత్మహత్యకు ప్రయత్నించే పిరికిపందలంటే నాకు అసహ్యం’. ఏదో సందర్భంలో ఆమె అన్న మాటలే.. ఆ భగ్న ప్రేమికుడిని ఇంకా బతికిస్తున్నాయి.
అతను లక్ష అబద్ధాలు చెప్పినా భరించింది.ఆ ఒక్క అబద్ధాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది.. ‘ఐ లవ్ యూ’.
మా ఇంటికొచ్చిన ప్రతిసారీ అతను ఏదో ఒకటి వదిలి వెళ్తాడు. మతిమరుపు కాదు. మళ్లీ రావడానికి సాకు.
తొలిముద్దు.. క్యాంపస్ విడిచి వెళ్తున్నప్పుడు. బస్ కదిలింది!చివరి ముద్దు.. శరీరం విడిచి వెళ్తున్నప్పుడు. అంబులెన్స్ కదిలింది!
‘ఒక ప్రేమ విఫలమైతేనేం. మరోసారి ప్రేమించు’ సలహా ఇవ్వబోయాడు మిత్రుడు. ‘మరోసారి మరణించడం ఎలా కుదురుతుంది?’సూటిగా ప్రశ్నించాడు భగ్న ప్రేమికుడు.
రెండో కప్పు చాయ్ అడిగాడంటే.. టీ ప్రేమికుడైనా కావాలి. నీ ప్రేమికుడైనా కావాలి.