నీటి మధ్యలోంచి సాగిపోయే రహదారులు. అక్కడక్కడా చిన్నచిన్న దీవుల్లా కనిపించే ఇండ్లు. ప్రఖ్యాత వెనిస్ నగరానికి ఏమాత్రం తీసిపోని బ్యాక్‌వాటర్ అందాలు. రాత్రిపూట నీలిరంగులో మిరుమిట్లు గొలిపే నీళ్లు. వీటన్నిటినీ చూడాలంటే.. దేశంలోనే మొదటి మాడల్ ఎకో-టూరిజం విలేజ్‌గా పేరుగాంచిన కేరళంలోని కుంబళంగి గ్రామంలో వాలిపోవాల్సిందే!
కొచ్చి నగర శివార్లలోని కుంబళంగి దీవి.. పర్యాటకులకు ఎన్నో ఆసక్తికరమైన అనుభూతులను పంచుతుంది. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన వింతలతో.. దేశంలోనే ఓ ప్రత్యేక గ్రామంగా నిలిచింది. ఈ క్రమంలోనే.. 2003లో ‘కుంబళంగి ఇంటిగ్రేటెడ్ టూరిజం విలేజ్ ప్రాజెక్ట్’ను స్థానిక ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామీణుల సంప్రదాయ జీవన విధానాన్ని దెబ్బతీయకుండా, పర్యాటకులకు గ్రామీణ ప్రశాంతతను అందించేలా ఈ ప్రాజెక్ట్ రూపుదాల్చింది.

కవరు: కుంబళంగిలో అత్యంత వింతైనదీ, ఆకర్షణీయమైనది.. కవరు. వేసవిలో రాత్రిపూట ఇక్కడి కాలువల్లోని నీరు నీలిరంగులో మెరిసి పోతుంటుంది. ఇక్కడి నీటిలో ఉండే సూక్ష్మజీవుల వల్ల.. ఈ సహజ వింత ఏర్పడుతుంది. దీనిని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు. రాత్రిపూట బోట్లో విహరిస్తూ ఉంటారు.

చైనీస్ ఫిషింగ్ నెట్లు: కుంబళంగా బ్యాక్‌వాటర్స్ తీరం వెంట ఏర్పాటు చేసిన చైనీస్ వలలు మరో ప్రత్యేకం. అంతెత్తున పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వారు స్వయంగా చేపలు పట్టే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. ఇక ఇక్కడి సన్నని కాలువలు, దట్టమైన మడ అడవులు, రొయ్యలు-పీతల పెంపకం కేంద్రాల గుండా సాగే నాటు పడవల ప్రయాణం మరో గొప్ప అనుభవాన్ని, మానసిక ప్రశాంతతనూ అందిస్తుంది.

సంప్రదాయానికి పెద్దపీట: కుంబళంగిలో అడుగడుగునా కేరళం సంప్రదాయం కట్టిపడేస్తుంది. చేపల కూరలు, స్థానిక మసాలా వంటకాలు, రుచికరమైన ‘పాయసం’ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. కొబ్బరి పీచుతో తాళ్లు తయారు చేయడం, కొబ్బరి ఆకులతో చాపలు అల్లడం లాంటి స్థానిక గ్రామీణ వృత్తులను కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇక్కడి కాలువ గట్ల వెంట నడవడం.. జీవితకాల అనుభూతిని అందిస్తుంది. గ్రామంలో సరదాగా చుట్టిరావడానికి ఆటో రిక్షా ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

కొచ్చి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో కుంబళంగి గ్రామం ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. బహిరంగ ప్రదేశాలలో తిరగడానికి, రాత్రిపూట ‘కవరు’ చూడటానికి అనుకూలమైన సమయం. అదే.. పచ్చని ప్రకృతి అందాలు, బ్యాక్‌వాటర్స్ దృశ్యాలను ఆస్వాదించాలంటే.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వెళ్లాలి. అయితే వర్షాల వల్ల అవుట్డోర్ ప్రయాణాలకు అంతరాయం కలగొచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో స్థానికులతో కలిసి ఉండేందుకు.. ఇక్కడి హోమ్‌స్టేలు కూడా అందుబాటులో ఉంటాయి.