ప్రకృతి ప్రేమికులు చాలా మందే ఉంటారు. తోచినప్పుడు మొక్కలు నాటడం, చెట్లను చూసి ఆనందించడం చేస్తుంటారు. కానీ, మొక్కలు నాటడం అన్నది ఓ జీవన విధానంలా మలుచుకున్న వాళ్లు మాత్రం అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకే చెందుతాడు భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన మూడ్ విశ్వామిత్ర చౌహాన్. తనకు కేవలం మూడేండ్ల వయసున్నప్పటి నుంచి ప్రతి రోజూ ఒక మొక్కను నాటాలన్న సంకల్పం పెట్టుకున్నాడు. ‘వాక్ ఫర్ ట్రీస్’ పేరుతో ఇప్పటికి దాదాపు నాలుగేండ్లుగా ఈ పనిని ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నాడు. అంతేకాదు, వనజీవి రామయ్య ఈ బుడతడిని తన వారసుడిగా ప్రకటించాడంటే ఇతనికి మొక్కల మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అలాంటి వారిలో ఒకరు జయరామ్ చౌహాన్. తానూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగమయ్యాడు. అప్పుడే ఆయన కొడుకు కూడా తండ్రి వెంట వెళ్లి మొక్కలు నాటడం నేర్చుకుని అదే అలవాటు చేసుకున్నాడు. ఇంటికి వచ్చి కూడా అదే పని చేసేవాడు. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి అతనికి అండగా నిలిచాడు. అలా పుట్టుకొచ్చిందే ‘వాక్ ఫర్ ట్రీస్’ కాన్సెప్ట్… అంటే ప్రతి రోజూ తన చేతుల మీదుగా ఒక మొక్క నాటాలన్న ఆలోచన. విశ్వామిత్ర చౌహాన్‌కి 3 సంవత్సరాల 17 రోజుల వయసున్నప్పుడు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, 2022న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ 1550 మొక్కలు నాటి వరల్డ్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ లెక్క కాకుండా విడిగా తాను నాటిన మొక్కలు వేలల్లోనే ఉన్నాయి.

కొత్తగూడెం హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న విశ్వామిత్ర చౌహాన్.. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్నాడు. చెట్లు ఎక్కువగా ఉంటే నేల చల్లగా ఉంటుందన్న మాట నమ్ముతాడు. అందుకే రోజూ మొక్కలు నాటడమే కాదు తనకు తెలిసిన వారిలో ఎవరింట్లో అయినా పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర వేడుకలు ఉన్నా , ఇంటి నుంచి తండ్రితో కలిసి మొక్కలు తీసుకువెళ్లి వారింట్లో నాటి శుభాకాంక్షలు చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఏ ఊరికైనా వెళ్తే అక్కడ కూడా ఒక మొక్క నాటుతాడు. పాఠశాలలు, కాలేజీలు, దేవాలయాలు, పంచాయతీ ఆఫీసులు, అటవీ శాఖ కార్యాలయాలు… ఇలా ఎక్కడ చెట్లకు పోషణ దొరుకుతుందో అక్కడికి వెళ్లి వారితో మొక్కలు నాటించి వస్తుంటాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసి మొక్కను కానుకగా అందించాడు. సర్పంచ్ మొదలు మంత్రుల దాకా ఎవరు జిల్లాకు వచ్చినా వారితో కలిసి మొక్కలు నాటుతాడు.
రోజూ కనీసం ఒక మొక్క లక్ష్యంగా పెట్టుకున్నా ఒక్కోసారి ఒకే రోజులో 70 నుంచి 100 దాకా నాటిన సందర్భాలూ ఉన్నాయి. ఇక, వేసవి సెలవుల్లో అడవిలో పెరిగే వివిధ రకాల చెట్ల గింజలను సేకరించి అటవీశాఖ వారికి ఇస్తూ ఉంటాడు. అలా గతేడాది 10 లక్షలకు పైగా గింజలను వారికి అందించాడు. అంతేకాదు, వర్షాకాలంలో వాటిని ఎలా చల్లాలో ప్రణాళికలు చేసి ఆ శాఖ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నాడు. ‘జస్ట్ త్రో అండ్ గ్రో రిటర్న్ గిఫ్ట్ బై సీడ్ బాల్’ కార్యక్రమం ద్వారా దాదాపు పది వేలకుపైగా సీడ్ బాల్స్ అడవులను చేరేలా చేశాడు. అడవుల్లో జీడి మామిడి, బాదం, మారేడు, నేరేడు, వేప, కరక ఇలా దాదాపు 36 రకాల గింజలు చల్లడం ద్వారా వచ్చిన మొక్కలు వేల సంఖ్యలో ఉండటం విశేషం. ఇక, నర్సింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న విశ్వామిత్ర చౌహాన్ తల్లి తన జీతంలో నెలకు 20 వేల రూపాయలను మొక్కల కొనుగోలు కోసం ఖర్చు చేస్తున్నారు. తైవాన్ మామిడి, యాపిల్, వాటర్ యాపిల్, ఎర్ర చందనంలాంటి మొక్కల్ని ప్రత్యేకంగా నర్సరీల నుంచి కొనుగోలు చేసి నాటుతున్నారు.
ఇతని కృషికి గాను ఎన్నో రికార్డుల్లో చోటు దక్కింది. రోజుకొకటి చొప్పున క్రమం తప్పకుండా 999 మొక్కలు నాటినందుకుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులోనూ, వరుసగా 1199 రోజులు మొక్కలు నాటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు (యూకే)లోనూ స్థానంతో పాటు విశ్వగురు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లాంటి మరెన్నింటిలోనో ఘనతలు సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏటా ఒకట్రెండు అవార్డులు అందుకోవడం విశ్వామిత్రకు పరిపాటిగా మారింది.
విశ్వామిత్ర గురించి తెలుసుకున్న వనజీవి రామయ్య తన ఇంటికి పిలిపించుకొని సత్కరించారు. మొక్కలు నాటడంలో తనకు వారసుడు ఇతనేనని ప్రకటించారు. విశ్వామిత్రను కూడా ‘వనజీవి’ అని పిలవాలంటూ ఆశీర్వదించారు. ఈ నేలను తనకు సాధ్యమైనంతగా పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతానంటున్న బాలుడు విశ్వామిత్ర నిజంగా వృక్షమిత్రుడే!
– కాగితపు వేంకటేశ్వర రావు
కొత్తగూడెం జి.వి. పాపారావు