ఒకప్పటికంటే ఇప్పుడు ప్రజల్లో ఆర్గానిక్, సస్టెయినబుల్ వస్తువులపై ఆసక్తి పెరిగింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడుకుందామని వస్తున్న నినాదాలు జనాలపై ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో ప్లాస్టిక్‌కి బదులు సస్టెయినబుల్ మెటీరియల్‌ని వాడేందుకు ముందుకొస్తున్నారు. అందులో ఇప్పుడు ట్రెండింగ్‌లో నడుస్తున్నది బ్యాంబూ ప్రొడక్ట్స్. అదేనండీ, వెదురుతో తయారు చేసిన వస్తువులు. సాధారణంగా వెదురు వస్తువులు అంటే కుర్చీలు, టేబుళ్లు, బుట్టలు మాత్రమే అనుకుంటారు. కానీ ఇప్పుడు రకరకాల ఫ్యాషనబుల్ వస్తువులు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బ్యాంబూ బిజినెస్ ఏడాదికి 70 బిలియన్ డాలర్లతో దూసుకుపోతున్నది. అత్యంత డిమాండ్ ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ బిజినెస్‌లో 40 శాతం ఈ వెదురుదే. ముఖ్యంగా ఈశాన్య రాష్ర్టాల్లో వెదురుతో వస్తువులను తయారు చేసే నిపుణులు చాలామంది ఉన్నారు. అందులో మహిళల సంఖ్య అధికంగా ఉంది. ముంబయికి చెందిన ఒక ఫ్యాషన్ డిజైనర్ ప్రమోదిని దాస్ 2015 నుంచి తన స్టార్టప్ ద్వారా సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్‌తో దుస్తులు డిజైన్ చేయిస్తున్నది. వెదురు సిల్క్‌తో చీరలు, ఫ్యాబ్రిక్ నేయిస్తున్నది. వాటితో పిల్లలకు, పురుషులకు వివిధ రకాల డ్రెస్సులు డిజైన్ చేస్తున్నది. ఆమెలాగే మనదేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లు వెదురును తమ ముడి సరుకుగా చేసుకుని మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తున్నారు.

వెదురుతో తయారు చేసిన దుస్తులు మాత్రమే కాకుండా జ్యువెలరీని కూడా యువత ఆదరిస్తున్నది. వీళ్ల టేస్ట్‌కి తగ్గట్లే నిపుణులు కూడా వెదురుతో గాజులు, బ్రేస్లెట్లు, నెక్లేస్లు, చెవి కమ్మలు, హ్యాండ్‌బ్యాగ్, చేతి వాచీలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఇటు ఆఫ్‌లైన్, అటు ఆన్లైన్ రెండింట్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. కేవలం బ్యాంబూ ప్రొడక్ట్స్తోనే స్టార్టప్ ప్రారంభిస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ర్యాంప్ వాక్‌లపై కూడా వెదురుతో చేసిన డిజైనర్ డ్రెస్సులు, జ్యువెలరీని ఎక్స్పోజ్ చేస్తున్నారు మోడల్స్. భవిష్యత్‌లో బ్యాంబూ ఫ్యాషన్ మరింత విస్తృతంగా పెరుగుతుందని డిజైనర్లు అంచనా వేస్తున్నారు. విదేశాలకు కూడా మనదేశం నుంచి ఈ బ్యాంబూ ప్రొడక్ట్స్ ఎగుమతి అవ్వడం, వాటిని ఎన్ఆర్ఐలతో పాటు విదేశీయులు ఇష్టంగా కొనడం మంచి సూచకంగా చెప్పొచ్చు.
మరోవైపు వెదురుతో టీ పొడి కూడా తయారు చేస్తున్నారు. అదే ‘బ్యాంబూ టీ’. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీంట్లోని యాంటి ఆక్సిడెంట్స్, సిలికా చర్మ సమస్యలను తగ్గిస్తూ, జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలాగే ఈ వెదురును సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగిస్తన్నారు. ఫోమ్ క్రీమ్స్, లోషన్స్, సీరమ్స్, సబ్బుల తయారీలో బ్యాంబూని వాడుతున్నారు.